Share News

రావణ్‌ ఇంట్లో విస్తృత సోదాలు

ABN , Publish Date - Jul 11 , 2026 | 04:13 AM

చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ-ఉపా) కేసులో అరెస్టయిన యూట్యూబర్‌ బచ్చలకూరి జోసెఫ్‌ అలియాస్‌ ప్రశ్న రావణ్‌ నివాసంలో గన్నవరం పోలీసులు విస్తృత సోదాలు నిర్వహించారు.

రావణ్‌ ఇంట్లో విస్తృత సోదాలు

  • సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ ఫ్లాట్లో గన్నవరం పోలీసుల తనిఖీలు

  • ప్రక్రియంతా వీడియో రికార్డింగ్‌

  • కీలక ఫైళ్లు, రికార్డులు స్వాధీనం

  • ఇంటికి రాజకీయ నేతలు వచ్చేవారా?

  • జోసెఫ్‌ ఎవరితో ఎక్కువ మాట్లాడేవారు?

  • ఆయన భార్యను ప్రశ్నించిన పోలీసులు

  • కాంటాక్టు లిస్టులో ఉన్నవారిని కూడా..

గన్నవరం, జూలై 10(ఆంధ్రజ్యోతి): చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ-ఉపా) కేసులో అరెస్టయిన యూట్యూబర్‌ బచ్చలకూరి జోసెఫ్‌ అలియాస్‌ ప్రశ్న రావణ్‌ నివాసంలో గన్నవరం పోలీసులు విస్తృత సోదాలు నిర్వహించారు. గన్నవరం పోలీసు స్టేషన్‌ నుంచి ప్రత్యేక బృందం శుక్రవారం తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని ఆయన ఫ్లాట్‌కు చేరుకుంది. ఇల్లంతా సుదీర్ఘంగా సోదా చేసింది. తనిఖీల ప్రక్రియ మొత్తాన్నీ వీడియో రికార్డింగ్‌ చేశారు. కొన్ని కీలక ఫైళ్లు, రికార్డులను దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా.. పోలీసులు రావణ్‌ భార్యతో పాటు ఆయన కాంటాక్టు లిస్టులో ఉన్నవారిని విడివిడిగా ప్రశ్నించారు. ‘ఇంటికి రాజకీయ నాయకులు ఎవరైన వస్తున్నారా? రావణ్‌ ఎవరితో ఎక్కువ సేపు మాట్లాడుతుంటారు’ అని ఆయన భార్యను ప్రశ్నించారు. ఆమె జవాబివ్వలేదని తెలిసింది. కేసు దర్యాప్తునకు సంబంధించిన పలు వివరాలను అడిగినా ఆమె ఎలాంటి సమాచారమూ చెప్పలేదని సమాచారం. ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలు, పంచనామా రికార్డులపై రావణ్‌ భార్య సంతకాలను అధికారులు తీసు కున్నట్లు తెలిసింది. రావణ్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్న వారిని కూడా రహస్య ప్రాంతంలో గన్నవరం పోలీసులు విచారించారు. రావణ్‌ ఎలా తెలుసు? ఆయనకు, మీకు సంబంధం ఏమిటి ? మీతో ఎప్పుడైనా నిషేధిత సంస్థలు, విద్వేష ప్రసంగాలగురించి చర్చించారా అని అడిగారు. కేసు దర్యాప్తు దశలో ఉన్నందున వివరాలు వెల్లడించడానికి పోలీసులు నిరాకరించారు.


రావణ్‌ కస్టడీపై విచారణ వాయిదా: రావణ్‌ను విచారించేందుకు 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని గన్నవరం పోలీసులు వేసిన పిటిషన్‌పై విచారణ 14వ తేదీకి వాయిదా పడింది. గన్నవరం ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో శుక్రవారం పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉంది. రావణ్‌ తరఫు న్యాయవాది మరికొంత సమయం కోరారు. దీనిపై ప్రాసిక్యూషన్‌కు ఏమైనా అభ్యంతరం ఉందా అని న్యాయాధికారి గాయత్రి అడిగారు. ఏమీ లేదని న్యాయవాది హమీద్‌, పీపీ పి.మాధవి బదులిచ్చారు. దీంతో విచారణను 14కి వాయిదా వేశారు.

పోలీసులకు మరో ఫిర్యాదు

గణపవరం, జూలై 10(ఆంధ్రజ్యోతి): మతవిశ్వాసాలను అవమానించడం, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చే సిన ప్రశ్న రావణ్‌పై తక్షణం చర్యలు తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండల జనసేన అధ్యక్షుడు తోట శ్రీనివాసరావు గణపవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని పేర్కొన్నారు.

Updated Date - Jul 11 , 2026 | 04:14 AM