రావణ్ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేయండి
ABN , Publish Date - Jul 10 , 2026 | 05:05 AM
చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ-ఉపా) కేసులో ప్రస్తుతం నెల్లూరు జైలులో ఉన్న వివాదాస్పద యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ‘ప్రశ్న’ రావణ్‌కు చెందిన బ్యాంకు ఖాతాలను..
ఐసీఐసీఐ, ఎస్ బ్యాంకులకు సర్పవరం పోలీసుల నోటీసులు
ఆయనపై నూజివీడులోనూ ఫిర్యాదు
సర్పవరం జంక్షన్/నూజివీడు టౌన్, జూలై 9(ఆంధ్రజ్యోతి): చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ-ఉపా) కేసులో ప్రస్తుతం నెల్లూరు జైలులో ఉన్న వివాదాస్పద యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ‘ప్రశ్న’ రావణ్‌కు చెందిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయాలని కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు బ్యాంకు అధికారులకు లేఖలు జారీ చేశారు. దేశ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు చేశారని ఆయనపై ‘ఉపా’ కింద గన్నవరం పోలీసులు కేసు పెట్టిన విషయం తెలిసిందే. అంతకుముందు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఈ నెల 2వ తేదీన సర్పవరం పోలీసులు రావణ్‌ను అరెస్టు చేయడం, కోర్టు బెయిల్ ఇవ్వడం విదితమే. ఈ నెల 4న సాయంత్రం గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా.. ఈ నెల 18 వరకు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. పోలీసులు రావణ్ నుంచి ఆపిల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని.. డిలీట్ చేసిన వీడియోలు, పోస్టింగ్‌ల వివరాల సేకరణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఈ క్రమంలో రావణ్ బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీల వివరాలను సర్పవరం పోలీసులు సేకరించారు. జోసెఫ్ రావణ్ పేరుతో ఐసీఐసీఐ బ్యాంకులో రెండు ఖాతాలు, ఎస్ బ్యాంకులో ఒక అకౌంట్ ఉన్నట్లు గుర్తించారు. ఈ మూడు బ్యాంకు ఖాతాల లావాదేవీలను స్తంభింపచేయాలని కోరుతూ బ్యాంకు అధికారులకు నోటీసులు జారీ చేసినట్లు సర్పవరం పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌వో సీహెచ్ ప్రకాశ్ తెలిపారు. మరోవైపు.. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏలూరు జిల్లా నూజివీడులో గురువారం జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రావణ్‌ను సమర్థిస్తున్న న్యాయవాది జడ శ్రావణ్, సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌పైనా చర్యలు చేపట్టాలని ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ, నియోజకవర్గ నాయకులు ముమ్మలనేని సునీల్‌కుమార్, రామిశెట్టి తేజస్విని తదితరులు ఫిర్యాదులో పేర్కొన్నారు.