రావణ్ కేసులో కొత్త ట్విస్ట్
ABN , Publish Date - Jul 15 , 2026 | 04:32 AM
యూట్యూబర్ బచ్చలకూరి జోసఫ్ అలియాస్ ‘ప్రశ్న’ రావణ్ కేసులో మంగళవారం కొత్త పరిణామం చోటుచేసుకుంది. ఆయన్ను విచారించేందుకు పది రోజులు కస్టడీకి ఇవ్వాలని..
10 రోజుల కస్టడీ పిటిషన్ ఉపసంహరణ
15 రోజుల కస్టడీ కోరుతూ కొత్త వ్యాజ్యం వేసిన పోలీసులు
విజయవాడ, జూలై 14(ఆంధ్రజ్యోతి): యూట్యూబర్ బచ్చలకూరి జోసఫ్ అలియాస్ ‘ప్రశ్న’ రావణ్ కేసులో మంగళవారం కొత్త పరిణామం చోటుచేసుకుంది. ఆయన్ను విచారించేందుకు పది రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ గన్నవరం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను పోలీసులు ఉపసంహరించుకున్నారు. వెంటనే 15 రోజుల కస్టడీ కోరుతూ కొత్త వ్యాజ్యం వేశారు. రావణ్‌ను అరెస్టు చేసి కోర్టు ద్వారా రిమాండ్‌కు పంపిన పోలీసులు.. ఆయన్ను విచారించేందుకు పది రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈ నెల 6న వేసిన పిటిషన్ మంగళవారం కోర్టు ముందుకు వచ్చింది. విచారణ ప్రారంభం కాగానే.. ఆ వ్యాజ్యాన్ని ఉపసహరించుకుంటున్నట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. తర్వాత కొత్త పిటిషన్ వేస్తామన్నారు. సాయంత్రం దాఖలు చేశారు కూడా. ఈ కేసులో రావణ్ నుంచి మరిన్ని వివరాలు రాబట్టాలంటే 15 రోజులపాటు విచారించాల్సి ఉందని.. కస్టడీకి ఇవ్వాలని అందులో విజ్ఞప్తిచేశారు. దీనిపై రావణ్ తరఫు న్యాయవాదులకు నోటీసులివ్వాలని కోర్టు ఆదేశించింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది. రావణ్ తరపున మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టుకు హాజరయ్యారు.