ప్రశ్న రావణ్ మళ్లీ అరెస్టు
ABN , Publish Date - Jul 03 , 2026 | 05:28 AM
కుల వివక్షపై ఎస్సీ బాలికలతో యూట్యూబ్‌లో మాట్లాడించి రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టేలా, కులమతాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని..
కాకినాడ జిల్లా సర్పవరంలో ఉద్రిక్తత
కోడి గుడ్లతో దాడికి జనసైనికుల యత్నం
బెయిల్ మంజూరు చేసిన కోర్టు
మరో కేసులో కృష్ణాజిల్లాకు తరలింపు
ఏలూరులో కూడా కేసు నమోదు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
కుల వివక్షపై ఎస్సీ బాలికలతో యూట్యూబ్‌లో మాట్లాడించి రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టేలా, కులమతాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని అందిన ఫిర్యాదు మేరకు యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌ను కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఇదే జిల్లాలోని పిఠాపురం పోలీసులు నమోదు చేసిన కేసులో ప్రశ్న రావణ్‌ను అరెస్టు చేయగా.. కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. తాజాగా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలుకు చెందిన జనసేన నాయకుడు ఓదూరి కిషోర్ ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీసులు గురువారం తెల్లవారుజామున ప్రశ్న రావణ్‌ను పిఠాపురంలో అరెస్ట్ చేసి సర్పవరం పోలీ్‌సస్టేషన్‌కు తీసుకువచ్చారు. వైద్య పరీక్షల అనంతరం కాకినాడలో జడ్జి ఎదుట హాజరుపరిచేందుకు పోలీసులు తీసుకెళ్తుండగా జనసైనికులు పెద్దఎత్తున అక్కడికి చేరుకొని రావణ్‌పై కోడిగుడ్లతో దాడికి యత్నించారు. దీంతో వారిని పోలీసులు చెదరగొట్టారు. అనంతరం కాకినాడ మొబైల్ మేజిస్ర్టేట్ కోర్టులో అతన్ని హాజరుపరచగా బెయిల్ మంజూరైంది. అయితే, బెయిల్‌పై బయటికొచ్చిన రావణ్‌ను కృష్ణాజిల్లా మచిలీపట్నం, గుడివాడ పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడికి తరలించారు. కాగా, ప్రశ్న రావణ్‌పై ఏలూరులోనూ జనసేన నాయకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీసుస్టేషన్‌లోనూ జనసైనికులు ఫిర్యాదు చేశారు.