కత్తులు చూపించి.. ప్రయాణికులను బెదిరించి..
ABN , Publish Date - Jul 04 , 2026 | 05:06 AM
కొద్ది నెలలుగా గుంటూరు జిల్లా పరిధిలో వరుస రైలు దోపిడీ ఘటనలు చోటుచేసుకోగా.. తాజాగా విశాఖ-అనకాపల్లి పరిధిలో జరిగిన మరో దోపిడీ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలులో దొంగల ముఠా బీభత్సం
నగదు, సెల్‌ఫోన్లు దోచుకెళ్లిన దుండగులు.. నలుగురు అరెస్ట్
తుని రూరల్, జూలై 3(ఆంధ్రజ్యోతి): కొద్ది నెలలుగా గుంటూరు జిల్లా పరిధిలో వరుస రైలు దోపిడీ ఘటనలు చోటుచేసుకోగా.. తాజాగా విశాఖ-అనకాపల్లి పరిధిలో జరిగిన మరో దోపిడీ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళుతున్న ప్రశాంతి ఎక్స్‌ప్రె్‌సలో నలుగురు దుండగులు ప్రయాణికులను కత్తులు, బ్లేడ్లతో బెదిరించి నగదు, సెల్‌ఫోన్లు అపహరించారు. తుని రైల్వే పోలీసులు శుక్రవారం రాత్రి ఈ కేసు వివరాలను వెల్లడించారు. గురువారం ఉదయం 9.30 గంటల సమయంలో కాకినాడ జిల్లా అన్నవరం రైల్వే స్టేషన్‌లో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలులో నలుగురు యువకులు ఎక్కారు. వీరంతా గంజాయి మత్తులో ప్రయాణికులను బ్లేడ్లు చూపించి భయభ్రాంతులకు గురిచేశారు. బోగీలో ఉన్న వారి వద్ద నుంచి నగదు, సెల్‌ఫోన్లను బలవంతంగా లాక్కొన్నారు. రైలు అనకాపల్లి స్టేషన్‌కు చేరుకునే సమయంలో వేగం తగ్గగానే నిందితులు దూకి పరారయ్యారు. ఆరుగురు ప్రయాణికుల నుంచి రూ.30,800 నగదుతోపాటు మూడు సెల్‌ఫోన్లను దుండగులు అపహరించినట్టు సమాచారం. ఘటన అనంతరం బాధితులు విశాఖపట్నం జీఆర్పీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సమాచారం అందుకున్న తుని జీఆర్పీ పోలీసులు.. ఆర్పీఎఫ్, సీఐబీ సిబ్బందితో కలిసి.. టవర్ లొకేషన్, సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారాన్ని విశ్లేషిస్తూ అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తృత గాలింపు చేపట్టారు. కాకినాడ రైల్వే లైన్స్ ఇన్‌స్పెక్టర్ టి.శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో సాయంత్రం నలుగురు నిందితులను అరెస్టు చేశారు. నిందితులను విజయవాడ ప్రాంతానికి చెందిన సిందే పౌల్, వనర్జీ పౌల్, సబ్బవరపు సాంబశివరావు, షేక్ రఫీగా గుర్తించారు. వీరిని శనివారం న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. ఘటనజరిగిన ఒక్కరోజులోనే కేసును ఛేదించిన సిబ్బందిని రాజమండ్రిడీఎ్‌సఆర్పీ మెహర్‌జయరాంప్రసాద్ అభినందించారు.