Share News

ప్రకాశ్‌రాజ్‌కు లీగల్‌ నోటీసు

ABN , Publish Date - Apr 19 , 2026 | 04:21 AM

సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు టీటీడీ బోర్డు సభ్యుడు జి.భానుప్రకాశ్‌ రెడ్డి లీగల్‌ నోటీస్‌ పంపారు. రామాయణం, హిందూ మత విశ్వాసాలపై అవమానకర వ్యాఖ్యలు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు...

ప్రకాశ్‌రాజ్‌కు లీగల్‌ నోటీసు

  • హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ నోటీసు పంపిన టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌ రెడ్డి

  • రూ.100 కోట్ల పరువు నష్టం దావా హెచ్చరిక

తిరుపతి(నేరవిభాగం), ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు టీటీడీ బోర్డు సభ్యుడు జి.భానుప్రకాశ్‌ రెడ్డి లీగల్‌ నోటీస్‌ పంపారు. రామాయణం, హిందూ మత విశ్వాసాలపై అవమానకర వ్యాఖ్యలు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు భానుప్రకాశ్‌ రెడ్డి తరఫు న్యాయవాది అజయ్‌కుమార్‌ పరువు నష్టం నోటీసు జారీ చేశారు. ఇటీవల కేరళ లిటరేచర్‌ ఫెస్టివల్‌ వేదికగాను, అలాగే సోషల్‌ మీడియాలో కూడా ప్రకాశ్‌రాజ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా, వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని నోటీసులో పేర్కొన్నారు. ముఖ్యంగా శ్రీరాముడు, లక్ష్మణుడు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణాన్ని ఆక్రమించేందుకుగాను వచ్చారన్న వ్యాఖ్యలు రామాయణాన్ని వక్రీకరించడమే కాకుండా, ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆరోపించారు. ప్రకాశ్‌రాజ్‌ వ్యాఖ్యలు భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్‌ 299 ప్రకారం మత భావాలను అవమానించడం, సెక్షన్‌ 356 ప్రకారం అపకీర్తి కలిగించడం నేరాలకు చెందుతాయని నోటీసులో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వారం రోజుల్లోగా ప్రకాశ్‌రాజ్‌ ప్రముఖ దినపత్రికల్లో, తన సోషల్‌ మీడియా వేదికల ద్వారా బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలపాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో రూ.100 కోట్ల నష్టపరిహారం కోరుతూ సివిల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని నోటీసులో హెచ్చరించారు.

Updated Date - Apr 19 , 2026 | 04:21 AM