Share News

ఐరన్‌ ఓర్‌ ప్రాంతాల్లో రక్షణ

ABN , Publish Date - Apr 10 , 2026 | 03:42 AM

ప్రకాశం జిల్లాలోని లింగసముద్రం, వలేటివారిపాలెం మండలాల్లో ఎర్రబంగారం (ఐరన్‌ ఓర్‌) నిక్షిప్తమై ఉన్న ప్రాంతంలో రక్షణ ఏర్పాట్లకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

ఐరన్‌ ఓర్‌ ప్రాంతాల్లో రక్షణ

  • గనులున్న మండలాల్లో ప్రకాశం ఎస్పీ పర్యటన

కందుకూరు, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లాలోని లింగసముద్రం, వలేటివారిపాలెం మండలాల్లో ఎర్రబంగారం (ఐరన్‌ ఓర్‌) నిక్షిప్తమై ఉన్న ప్రాంతంలో రక్షణ ఏర్పాట్లకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఎస్పీ హర్షవర్ధన్‌రాజు గురువారం సందర్శించారని తెలిసింది. ఆయన పర్యటన గోప్యంగా సాగింది. లింగసముద్రం మండలంలోని అద్దంకివారిపాలెం బ్లాక్‌ పరిధిలో అయ్యవారిపల్లి చెరువు సమీపంలో జేఎ్‌సడబ్ల్యూ గ్రూప్‌ తమ మెషినరీ కోసం నిర్మిస్తున్న షెడ్లను ఆయన పరిశీలించారు. ఐరన్‌ఓర్‌ డ్రిల్లింగ్‌కు అవసరమైన భారీ యంత్రపరికరాలు, టిప్పర్లు, ఇతర విలువైన యంత్రాలు త్వరలోనే ఇక్కడకు రానున్నట్లు కంపెనీ నుంచి సమాచారం అందడంతో రక్షణ ఏర్పాట్లలో భాగంగా ఆయన ఇక్కడ పర్యటించారు. అప్రమత్తంగా ఉండాలంటూ స్థానిక పోలీసులకు సూచించారు. యంత్ర పరికరాలతోపాటు వందలాది మంది కార్మికులు, ఇతర సిబ్బంది ఈ ప్రాంతంలోనే ఇక ముందు బసచేయనున్నారు. వీరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అంచనా కోసమే ఎస్పీ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వలేటివారిపాలెం మండల పరిధిలోకి వచ్చే లక్ష్మక్కపల్లి నార్త్‌ ఐరన్‌ఓర్‌ బ్లాక్‌ ప్రాంతంలో పోలినేనిచెరువు, చుండి పరిసరాలతో పాటు అక్కడి అటవీప్రాంతాన్ని ఎస్పీ పరిశీలించారు. పోలినేనిచెరువు సమీపంలో జరుగుతున్న వైట్‌క్వార్ట్జ్‌ మైనింగ్‌ను పరిశీలించిన ఎస్పీ వారికి ఉన్న లైసెన్సులు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలినేనిచెరువు నుంచి 167బీ జాతీయ రహదారికి ఉన్న అన్ని మార్గాలలో పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటుచేయాలని పోలీసు అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీచేశారు.

Updated Date - Apr 10 , 2026 | 03:42 AM