Share News

అగ్గప్పరాజు అడ్డా సన్నమూరు గడ్డ!

ABN , Publish Date - Mar 15 , 2026 | 05:39 AM

ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం సన్నమూరు గ్రామంలో క్రీస్తుశకం 968 సంవత్సరం నాటి శిలాశాసనం బయటపడింది.

అగ్గప్పరాజు అడ్డా సన్నమూరు గడ్డ!

  • ప్రకాశం జిల్లాలో వెయ్యేళ్ల నాటి శిలాశాసనం

మర్రిపూడి, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం సన్నమూరు గ్రామంలో క్రీస్తుశకం 968 సంవత్సరం నాటి శిలాశాసనం బయటపడింది. గ్రామానికి దూరం గా శిథిలావస్థకు చేరిన పురాతన దేవాలయం వద్ద దీన్ని ఇటీవల గ్రామస్థులు గుర్తించారు. పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డికి సమాచారం ఇవ్వడంతో ఆయన శనివారం గ్రామానికి వచ్చి పరిశీలించారు. బలిచక్రవర్తి వారసులుగా పేరొందిన బాణరాజుల వంశానికి చెందిన అగప్పరాజు కాలంలో అగ్రేశ్వరస్వామి దేవాలయాన్ని నిర్మించినట్టు శిలాశాసనంలో ఉంది. దూపదీప నైవేద్యాలకు 25 ఎకరాల భూమిని అగ్గప్పరాజు దానంగా ఇచ్చినట్లు, అప్పటి నెల్లూరు సీమలోని సన్నమూరు కేంద్రంగా అగ్గప్పరాజు పరిపాలించినట్లు శాసనం ద్వారా తెలుస్తోంది. శాసనంపై ఉన్న పతాకంపై నల్ల జింక ఉంది. నల్లజింకను బాణరాజుల పతాకంగా భావిస్తారు. ఇప్పటికే ఈ చారిత్రక ఆనవాళ్లు చెన్నైలోని పురావస్తుశాలలో 96వ క్రమసంఖ్యలో నమోదైందని శివనాగిరెడ్డి తెలిపారు. ఈ ఆలయ పునరుద్ధరణ కోసం మాజీ సర్పంచ్‌ పింగళి సూర్యనారాయణ, హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఆడిటర్‌ ప్రసాద్‌ నడుం బిగించడంతో ఈ శిలాశాసనం బయటపడింది. గ్రామంలో పురాతన అవశేషాలను శివనాగిరెడ్డి పరిశీలించారు. గ్రామంలోని పోలేరమ్మ విగ్రహం 10వ శతాబ్దం నాటిదని, రామాలయంలోని వేణుగోపాలస్వామి శిల్పం 16వ శతాబ్దానిదని తెలిపారు. చరిత్రకారులు డాక్టర్‌ జ్యోతిచంద్రమౌళి, షేక్‌ మస్తాన్‌, ఆగమ పండితులు బాలాజీ గురకుల్‌, సీపీ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 15 , 2026 | 05:41 AM