బోట్ల మాయంపై వాడీవేడి చర్చ!
ABN , Publish Date - Apr 07 , 2026 | 05:56 AM
నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో ఉంచిన నాలుగు బోట్ల మాయంపై సోమవారం వాడీవేడి చర్చ జరిగింది. తమిళనాడు బోట్ల వ్యవహారంపై ప్రకాశం జిల్లా సింగరాయకొండ...
ప్రకాశం జిల్లా పాకలలో మత్స్యకారుల సమావేశం
4 జిల్లాల నుంచి భారీగా హాజరైన గంగపుత్రులు
సింగరాయకొండ, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో ఉంచిన నాలుగు బోట్ల మాయంపై సోమవారం వాడీవేడి చర్చ జరిగింది. తమిళనాడు బోట్ల వ్యవహారంపై ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల పంచాయతీ పరిధిలోని పోతయ్యగారి పట్టపుపాలెంలో మత్స్యకారులు సమావేశం నిర్వహించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురిని కాపులు బహిరంగంగా విచారించారు. హార్బర్‌లో శంకుస్థాపన నేపథ్యంలో.. ఓ పోలీసు అధికారి సూచనలతో బోట్లను పక్కకు పెట్టామని విచారణలో ఇద్దరు నిందితులు చెప్పగా.. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని గట్టిగా నిలదీయగా.. రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు ప్రోద్బలంతోనే బోట్లను విడిచి పెట్టినట్లు చెప్పి.. తాను తప్పు చేసినట్లు ఒప్పుకున్నారు. ఈ సమావేశానికి బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల నుంచి భారీగా మత్స్యకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుంచి వచ్చిన కాపులు, పెద్దలు మాట్లాడారు. 20 ఏళ్లుగా తమిళనాడుకు చెందిన బోట్లు అక్రమంగా జలాల సరిహద్దులు దాటి రాష్ట్ర తీరంలోని చొరబడి మత్స్య సంపదను దోచుకెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కడలిని నమ్ముకొని బతికే తాము ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నామన్నారు.
అక్రమంగా వేట సాగిస్తున్న పుదుచ్చేరి, కరైకల్‌కు చెందిన నాలుగు బోట్లను ప్రాణాలను ఫణంగా పెట్టి పట్టుకున్నామని తెలిపారు. వీటిని 160 మత్స్యకార గ్రామాల కాపుల ఏకాభిప్రాయంతో నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో భద్రపరిచామని వివరించారు. వాటి రక్షణ బాధ్యత ఇసుకపల్లె, కొత్తబంగారుపాలెం, తాటిచెట్లపాలెం, పాతపాలెం గ్రామాల కాపులకు అప్పగించామన్నారు. వారు బోట్లకు కాపలాగా పాతపాలెంకు చెందిన శెట్టిని నియమించినట్లు చెప్పారు. ఇసుకపల్లెకు చెందిన కాపు తోటయ్య, బంగారుపాలెంకు చెందిన జాలిరెడ్డికి నిర్వహణ బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు. ఈ క్రమంలో గత నెలలో నాలుగు బోట్లు జువ్వలదిన్నె హార్బర్ నుంచి అదృశ్యమయ్యాయని వివరించారు. బహిరంగ విచారణలో భాగంగా ఈ వ్యవహారంలో ఎవరి హస్తం ఉందో బయటపెట్టాలని ఆ ముగ్గురిని గట్టిగా నిలదీశారు. దీంతో గత నెల 12న హార్బర్‌లో శంకుస్థాపన ఉన్న నేపథ్యంలో.. అడ్డుగా ఉన్న బోట్లను ఓ పోలీసు అధికారి సూచనలతో పక్కకు పెట్టామని విచారణలో శెట్టి, జాలిరెడ్డి తెలిపారు. అయితే ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న తోటయ్యను గట్టిగా నిలదీయగా.. రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు ప్రోద్బలంతోనే బోట్లను విడిచి పెట్టినట్లు చెప్పారు.