Share News

ఈ 12 ఏళ్లలో అగ్రగామిగా భారత్‌

ABN , Publish Date - Jun 10 , 2026 | 05:29 AM

ఎన్నికైన ప్రధానిగా అత్యధిక కాలం పాలించిన ఘనత నరేంద్ర మోదీకి దక్కిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్నారు.

ఈ 12 ఏళ్లలో అగ్రగామిగా భారత్‌

  • అనేక క్లిష్ట సమస్యలకు మోదీ పరిష్కారం

  • ఆయన నాయకత్వంలో ఎకానమీ అభివృద్ధి

  • మౌలిక సదుపాయాల కల్పనతో భారీ పెట్టుబడులు, ఉపాధి

  • చంద్రబాబుది విజనరీ పాలన

  • కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రశంస

  • మోదీ సర్కారు విజయాలపై తిరుపతిలో పుస్తకావిష్కరణ

  • మంత్రులు అనగాని, గొట్టిపాటి, నేతలు హాజరు

తిరుపతి సిటీ, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): ఎన్నికైన ప్రధానిగా అత్యధిక కాలం పాలించిన ఘనత నరేంద్ర మోదీకి దక్కిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్నారు. ఎన్నికైన ప్రధానిగా నెహ్రూ 4,398 రోజులు పనిచేస్తే, మోదీ బుధవారంతో 4399 రోజులు పూర్తి చేసుకోనున్నారని.. ఈ 12 ఏళ్ల కాలంలో దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడమే కాకుండా అనేక క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం చూపారని కొనియాడారు. మోదీ ప్రభుత్వ 12 ఏళ్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కేంద్ర సమాచార శాఖ ప్రచురించిన పుస్తకాలను తిరుపతిలో మంగళవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబుది విజనరీ పాలనంటూ ప్రశంసించారు. సామాజిక భద్రతపై ఆయన, పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందన్నారు. ‘అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌, దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ వంటి ప్రాజెక్టులకు కేంద్రం గణనీయమైన సహాయం అందించింది’ అని చెప్పారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగులకు సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మోదీ హయాంలో భారత్‌ విద్యుత్‌ కొరత నుంచి విద్యుత్‌ మిగులు దేశంగా ఎదిగిందన్నారు.


ప్రస్తుతం భారత విద్యుదుత్పత్తి సామర్థ్యం 538 గిగావాట్లకు చేరుకోగా.. అందులో 33 శాతం పునరుత్పాదక ఇంధన వనరుల నుంచే వస్తోందన్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో 290 గిగావాట్ల స్థాపిత సామర్థ్యంతో భారత్‌ అమెరికాను అధిగమించిందని.. సౌరశక్తి, పవనశక్తి రంగాల్లో ప్రపంచంలో వరుసగా 3, 4 స్థానాల్లో నిలిచిందన్నారు. మోదీ నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా అభివృద్ధి చెందిందని, మౌలిక సదుపాయాల కల్పనతో భారీ పెట్టుబడులు, యువతకు ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. 25 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. దేశంలో ఆర్థిక సంక్షోభం వస్తుందన్న ఊహాగానాలను ఆయన కొట్టివేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ మాట్లాడుతూ.. ఎన్నికైన ప్రధానిగా మోదీ 12 ఏళ్లు పూర్తిచేసుకున్నారని, దేశవ్యాప్తంగా సుస్థిరమైన పాలన అందిస్తున్నారని కొనియాడారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, గొట్టిపాటి రవికుమార్‌, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి, కూటమి నేతలు నరసింహ యాదవ్‌, పనబాక లక్ష్మి మొదలైన వారు పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2026 | 05:29 AM