Share News

NMC Chairman Abhijat Seth: పీపీపీ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలోనే

ABN , Publish Date - Jan 08 , 2026 | 04:44 AM

పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌(పీపీపీ) విధానంలో నడిచే ఆస్పత్రులు ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) చైర్మన్‌ అభిజాత్‌ చంద్రకాంత్‌ సేథ్‌ అన్నారు.

NMC Chairman Abhijat Seth: పీపీపీ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలోనే

  • ఇందులో రోగులకు ఉచిత/ రాయితీపై చికిత్స.. ఈ విధానం గుజరాత్‌లో విజయవంతమైంది

  • ఎన్‌ఎంసీ చైర్మన్‌ అభిజాత్‌ సేథ్‌ స్పష్టీకరణ

అమరావతి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌(పీపీపీ) విధానంలో నడిచే ఆస్పత్రులు ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) చైర్మన్‌ అభిజాత్‌ చంద్రకాంత్‌ సేథ్‌ అన్నారు. ఈ మోడల్‌లో రోగులకు చికిత్స ఉచితంగా లేదా రాయితీపై అందుతుందని స్పష్టం చేశారు. బుధవారం రాష్ట్రంలో పర్యటించిన ఆయన... సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీలో వీసీ చంద్రశేఖర్‌, రిజిస్ట్రార్‌ రాధికారెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. పీపీపీని అమలు చేయడం రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయమని తెలిపారు. గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో ఈ విధానం విజయవంతంగా కొనసాగుతోందని చెప్పారు. పీపీపీ విధానంపై ఎన్‌ఎంసీ స్పష్టమైన మార్గదర్శకాలు సిద్ధం చేస్తుందని, ఆ ఎస్‌వోపీల మేరకే కాలేజీలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఎన్‌ఎంసీ నిబంధనల్లోని సెక్షన్‌-8 ప్రకారం లాభాపేక్ష లేని సంస్థలకు మాత్రమే మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు అనుమతి ఉండేదని.. వివిధ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాల విన్నపం మేరకు గత డిసెంబరు 17న బోర్డు సమావేశంలో దీనికి సవరణలు చేశామని తెలిపారు. లాభాపేక్ష ఉన్న కార్పొరేట్‌ సంస్థలు కూడా వైద్య కళాశాలలు ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చామన్నారు. వారు కూడా పీపీపీ విధానంలో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేయవచ్చని పేర్కొన్నారు. పీపీపీ మెడికల్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా, మేనేజ్‌మెంట్‌ కోటా, మిగిలిన కోటా సీట్ల పంపకంలో కొంత ఇబ్బందులు ఉన్నాయని, కానీ కొన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు కన్వీనర్‌ కోటాకు ఇవ్వడం మంచిదని అభిజాత్‌ అభిప్రాయపడ్డారు.


మెడికల్‌ కాలేజీలకు వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌ అంశం ఎన్‌ఎంసీ పరిధిలోకి రాదన్నారు. ప్రభుత్వ వైద్యులు, ప్రైవేట్‌ కాలేజీల్లో వైద్యుల 75 శాతం హాజరు అనేది చివరి ఆప్షన్‌ మాత్రమేనని, దాని ఆధారంగా సీట్లు రద్దు, ఇతర విషయాల్లో నిర్ణయాలు తీసుకోమని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలు కలిసి పని చేయడం ద్వారా వైద్య విద్య కోసం అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా ఉపయోగించుకోవచ్చని ఎన్‌ఎంసీ భావిస్తోందని తెలిపారు. వైద్య విద్యను సామాన్యులకు చేరువ చేస్తూనే, అంతర్జాతీ య ప్రమాణాలతో కూడిన విద్యను అం దించడమే జాతీయ వైద్య కమిషన్‌ లక్ష్యమని వెల్లడించారు. వై ద్య కాలేజీల గుర్తింపు ప్రక్రియను సులభతరం చేస్తామన్నారు. వైద్యవిద్యలో నాణ్యతను పెంచేందుకు క్లినికల్‌ రీసెర్చ్‌ను తప్పనిసరి చేయడంతో పాటు కొత్తగా పీహెచ్‌డీ స్పెషాలిటీ, సబ్‌ స్పెషాలిటీ కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. వైద్య విద్యలో ఏఐ డిజిటల్‌ హెల్త్‌ కేర్‌, అత్యాధునిక సాంకేతికతను జోడించనున్నట్లు పేర్కొన్నారు.

సమానంగా పీజీ, యూజీ సీట్లు: వీసీ

రాష్ట్రంలో యూజీ, పీజీ సీట్లు సమానంగా పెంచే దిశగా అడుగులు వేస్తున్నట్లు హెల్త్‌ వర్సిటీ వీసీ చంద్రశేఖర్‌ తెలిపారు. 500 డీఎన్‌బీ సీట్లకు ఆమోదం తెలపి, ఫ్యామిలీ మెడిసిన్‌లో డీఎన్‌బీ సీట్లు కేటాయించేందుకు ఎన్‌ఎంసీ అంగీకరించిందని తెలిపారు. 12న వర్సిటీ రీసెర్చ్‌ డేను తొలిసారి నిర్వహిస్తున్నామన్నారు. వర్సిటీలో ప్రముఖ శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు విగ్రహాన్ని మంత్రి సత్యకుమార్‌ ప్రారంభిస్తారని వీసీ తెలిపారు.

సీఎంను కలసిన ఎన్‌ఎంసీ చైర్మన్‌

ఎన్‌ఎంసీ చైర్మన్‌ డాక్టర్‌ అభిజత్‌ చంద్రకాంత్‌ సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన చంద్రకాంత్‌ కొద్దిసేపు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.

Updated Date - Jan 08 , 2026 | 04:45 AM