CM Chandrababu Naidu: యూనిట్ రూ.4కే!
ABN , Publish Date - Jan 09 , 2026 | 03:57 AM
వైసీపీ హయాంలో కమీషన్ల కోసం అస్తవ్యస్త విధానాలను అమలు చేసి విద్యుత్ చార్జీల భారాన్ని ప్రజలపై మోపారు. కూటమి అధికారంలోకి వచ్చే నాటికి యూనిట్ విద్యుత్ రూ.5.19 గా ఉంది.
మూడేళ్లలో కరెంటు చార్జీ ఆ మేరకు తగ్గిస్తాం: సీఎం
కూటమి వచ్చే నాటికి ధర రూ.5.19
ప్రస్తుతం దానిని 4.90కి తీసుకొచ్చాం
మార్చికి మరో 10 పైసలు తగ్గిస్తాం
సీమ లిఫ్టుపై తప్పు చేసింది వాళ్లే
జగన్ హయాంలోనే ఆగింది
నాడు కళ్లుమూసుకుని నేడు నిందలా?
ఇలాంటివాటిలో వాళ్లు సిద్ధహస్తులు
తిరుమలలో మద్యం బాటిళ్ల వ్యవహారం వైసీపీ నైజానికి నిదర్శనం
అప్రమత్తంగా లేకపోతే నష్టపోతాం
పీపీపీ అమల్లో దేశంలో మనమే టాప్
మంత్రివర్గ సహచరులతో చంద్రబాబు
వైసీపీ వారికి బురదజల్లడం అలవాటుగా మారింది. రాయలసీమ లిఫ్టు విషయం గానీ.. తిరుమలలో మద్యం బాటిళ్ల ఉదంతం గానీ వారి నైజాన్ని బయటపెడుతున్నాయి. ఇలాంటి వాటిని ఎక్కడికక్కడ పార్లమెంటు నియోజకవర్గాలవారీగా తిప్పికొట్టాలి. నేతలు ఏకతాటిపైకి వచ్చి వైసీపీ అసత్య ప్రచారాలకు దీటుగా బదులివ్వాలి.
- సీఎం చంద్రబాబు
అమరావతి, జనవరి 8(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ హయాంలో కమీషన్ల కోసం అస్తవ్యస్త విధానాలను అమలు చేసి విద్యుత్ చార్జీల భారాన్ని ప్రజలపై మోపారు. కూటమి అధికారంలోకి వచ్చే నాటికి యూనిట్ విద్యుత్ రూ.5.19 గా ఉంది. దానిని ప్రస్తుతం రూ.4.90కి తెచ్చాం. మార్చి నాటికి మరో 10 పైసలు తగ్గించి రూ.4.80కి తెస్తాం. 2029 నాటికి మొత్తం మీద యూనిట్‌కు రూ.1.19 తగ్గించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. అంటే మూడేళ్లలో యూనిట్ రూ.4కి తీసుకొస్తాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో మంత్రిమండలి సమావేశంలో వైసీపీ హయాంలో 2019-24 నాటి ట్రూఅప్ చార్జీల భారం రూ.4,498 కోట్లను ప్రభుత్వమే భరించాలన్న నిర్ణయానికి ఆమోదం తెలిపే సమయంలో సీఎం పై వ్యాఖ్యలు చేశారు. చార్జీలు తగ్గించాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు విద్యుదుత్పత్తిని పెంచుకోవడంతోపాటు సరఫరాలో నష్టాలు తగ్గించుకునే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జగన్ చేసిన తప్పిదాలను కూటమి ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం జరుగుతోందన్నారు. 2020లో ఆయన హయాంలోనే ఆ స్కీం ఆగిపోతే.. అప్పుడు కళ్లు మూసుకుని ఇప్పుడు ఆ నిందను మనపై వేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇలాంటివన్నీ వారికి అలవాటుగా మారాయని.. దీనిని గట్టిగా తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు. తిరుమలలో లిక్కర్ బాటిళ్లను పెట్టి రాద్ధాంతం చేసిన అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఇలాంటివి చేయడంలో వైసీపీ వారు సిద్ధహస్తులని.. మనం అప్రమత్తంగా లేకపోతే నష్టపోతామని వ్యాఖ్యానించారు. ఇంకా ఏం చెప్పారంటే..
అందరం లబ్ధిపొందుతాం..
సముద్రంలో కలిసే నదీ జలాలు రెండు తెలుగు రాష్ట్రాలు ఉపయోగించుకుంటే తెలుగు ప్రజలందరూ లబ్ధి పొందుతారు. పోలవరం-నల్లమల సాగర్ పూర్తయితే సమృద్ధిగా నీరు, విద్యుత్ లభిస్తాయి. నీటి లభ్యత ఉంటే సాగు విస్తీర్ణం పెరుగుతుందని, రైతులు కొత్త రకాల పంటలు వేసుకోవచ్చు.
270 పీపీపీ ప్రాజెక్టులు..
పీపీపీ విధానం అమల్లో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. కూటమి ప్రభుత్వం 270 ప్రాజెక్టులను ఈ విధానంలో అమలు చేస్తోంది. మన తర్వాతి స్థానాల్లో తమిళనాడు, మధ్యప్రదేశ్ ఉన్నాయి. పెట్టుబడుల సాధనలో ఏపీ ముందంజలో ఉందని.. దేశంలో నాలుగో వంతు పెట్టుబడులను ఆకర్షిస్తోందని ఫోర్బ్స్ పత్రిక ప్రచురించింది. ప్రతి నెలా జీఎస్డీపీ గణాంకాలను సేకరిస్తున్న రాష్ట్రం దేశంలో ఏపీ ఒక్కటే.
లాజిస్టిక్ రంగంపై మరింత దృష్టి..
ప్రపంచంలో ఏ అభివృద్ధి చెందిన దేశాన్ని చూసినా అక్కడ లాజిస్టిక్ రంగం ముందంజలో ఉంటుంది. ఏపీని కూడా ఈ రంగంలో నంబర్ వన్ స్థానంలో నిలపాలి. అత్యంత చౌకయిన జలరవాణా సౌకర్యాలను మెరుగుపరచుకునే దిశగా కార్యాచరణ రూపొందించాలి. జలరవాణా మెరుగుపడితే అభివృద్ధిపథంలో ముందుంటాం. ఇందుకు అనుగుణంగా ప్రతి తీర ప్రాంత జిల్లాలో ఓ పోర్టు ఏర్పాటు కావాలి.
ధాన్యం సేకరణ రికార్డు స్థాయిలో చేశాం. అన్ని రకాల పంటలు కొనుగోలు చేస్తున్నాం. రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహించాలి.
పర్యాటక రంగం గేమ్ చేంజర్. ఈ రంగంలో అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలి. చీరాలను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. సూర్యలంకలో మరో మూడు హోటళ్ల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదించింది.
జగన్‌లా ప్రజలను భయపెట్టడం టీడీపీ సంస్కృతి కాదు: లోకేశ్
మంత్రివర్గ సమావేశానికి ముందు ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో టీడీపీ మంత్రులతో మంత్రి లోకేశ్ అల్పాహార భేటీ నిర్వహించారు. పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. వైసీపీలా రప్పా, రప్పా.. మన విధానం కాదన్నారు. జగన్‌లా ప్రజలను భయపెట్టడం, బెదిరించడం, దౌర్జన్యాలకు పాల్పడడం వంటివి తెలుగుదేశం సంస్కృతి కాదని స్పష్టంచేశారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రజలకు ఎంత ప్రయోజనం చేకూర్చామో ప్రతి ఒక్కరూ బేరీజు వేసుకోవాలన్నారు. ప్రజావేదికలో వచ్చే ఫిర్యాదులు పరిష్కారమయ్యేలా మంత్రులు బాధ్యత తీసుకోవాలని కోరారు. తమ తమ శాఖలకు సంబంధించిన అర్జీల పరిష్కారానికి వారు చొరవ చూపాలన్నారు. పార్టీ మరింత బలోపేతమే లక్ష్యంగా క్యాడర్‌ను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఇన్‌చార్జి మంత్రులు పనిచేయాలని కోరారు.