కరెంట్ పోయింది.. ఊపిరి ఆగింది
ABN , Publish Date - May 31 , 2026 | 06:31 AM
ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంతో ఓ రోగి మృతి చెందిన ఘటన అనంతపురంలో జరిగింది.
అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో విషాదం
విద్యుత్ సరఫరా లేక ఆగిపోయిన వెంటిలేటర్
కాసేపటికే మృతిచెందిన అత్యవసర విభాగంలోని రోగి
చీకట్లో ఇబ్బందిపడ్డ రోగులు, వైద్యులు, సిబ్బంది
అనంతపురం వైద్యం, మే 30(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంతో ఓ రోగి మృతి చెందిన ఘటన అనంతపురంలో జరిగింది. మరికొంత మంది ఎమర్జెన్సీ వార్డులో వైద్యం అందక విలవిల్లాడిపోయారు. అనంతపురంలో శనివారం గాలివాన కారణంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో జిల్లా ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చీకటి అలుముకుంది. కరెంట్ లేకపోవడంతో వెంటిలేటర్ మిషన్లు ఆగిపోయాయి. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన మోహన్ (45) మృతిచెందాడు. ఇదే విభాగంలో వెంటిలేటర్‌పై ఉన్న ఇల్లూరు గ్రామానికి చెందిన నాగన్న ఊపిరి అందక విలవిల్లాడాడు. ప్రసూతి వార్డులో విద్యుత్ సరఫరా లేక వైద్యులు తీవ్ర ఆందోళన చెందారు. ఎస్‌ఎన్‌సీయూ, ఎన్‌ఐసీయూలో వార్మర్లు, వెంటిలేటర్లపై ఉన్న నవజాత శిశువులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆస్పత్రిలో కరెంట్ పోగానే ఆటోమేటిక్‌గా ఆన్ అవ్వాల్సిన జనరేటర్.. నిర్వహణ సరిగాలేక ఆన్ అవ్వలేదు. సుమారు 15 నిమిషాలపాటు తంటాలు పడితే ఆన్ అయ్యింది. అప్పటికే ఒకరు మృతిచెందగా, పలువురికి ఊపిరి ఆగినంతపనైంది.
ఉదయమే అడ్మిట్ అయ్యాం
నా భర్త మోహన్ కొన్ని నెలలుగా పెరాలసిస్, షుగర్, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నాడు. పెద్దాస్పత్రిలో ఎమర్జెన్సీ వార్డులో శనివారం ఉదయం అడ్మిట్ చేయించాం. వెంటిలేటర్‌పై పెట్టడంతో తిరిగి కోలుకుంటాడన్న ధైర్యం వచ్చింది. కానీ సాయంత్రం కరెంట్ పోవడంతో వెంటిలేటర్ ఆగిపోయింది. దాంతో నా భర్త మృతిచెందాడు. మా కుటుంబానికి దిక్కులేకుండా పోయింది.
- జయలక్ష్మి, మోహన్ భార్య
చెప్పినా విద్యుత్ అధికారులు పట్టించుకోలేదు
జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో విద్యుత్ సరఫరా సరిగాలేదని ఏపీఎంఎ్‌సఐడీసీ అధికారులకు నెల కిందటే చెప్పాం. స్తంభాలు పాతబడ్డాయని, ఎక్కడిక్కడి వాలిపోతున్నాయని, లైన్లు తెగిపోతున్నాయని ఫిర్యాదు చేశాం. సమస్యలన్నీ వివరించాము. మరమ్మతులకు ఖర్చు ఎక్కువ అవుతుందని నిర్లక్ష్యం చేశారు. గాలివాన కారణంగా శనివారం సాయంత్రం స్తంభాలు కూలి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
- డా. మల్లీశ్వరి, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి