Share News

అమరం శ్రీరాములు సమరం

ABN , Publish Date - Mar 16 , 2026 | 06:02 AM

అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతిలో రాజధాని అమరావతిలో నిర్మించిన 58 అడుగుల విగ్రహాన్ని సీఎం చంద్రబాబు సోమవారం ఆవిష్కరించనున్నారు.

అమరం శ్రీరాములు సమరం

  • ఆత్మార్పణతో తెలుగుజాతికి సొంత రాష్ట్రం

  • దేశ రాజకీయ ముఖచిత్రం మార్చిన దీక్ష

  • దేశ విముక్తికి, దళిత ఆత్మగౌరవ స్ఫూర్తికి

  • జీవితాంతం అంకితమైన ధన్య జీవితం

  • స్వాతంత్య్ర సమరంలో పలుమార్లు జైలుకు

  • భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఆద్యుడు

  • నాటి దీక్షకు గుర్తుగా 58 అడుగుల విగ్రహం

  • నేడు రాజధానిలో ఆవిష్కరించనున్న సీఎం

‘‘ప్రస్తుతం హరిజనోద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టాను. కొంతకాలం తర్వాత నాకు ఇప్పుడు లభిస్తున్న ప్రోత్సాహం కూడా లభించకపోవచ్చు. నా దారిని హర్షించలేకపోతున్న నా బంధువులు నాకు తిండి పెట్టి ఆశ్రయం ఇవ్వడానికి కూడా నిరాకరించవచ్చు. ఐనా నిరుత్సాహపడను. బిచ్చమెత్తయినా ప్రచారం సాగిస్తాను. సమయం వస్తే హరిజనులకు దేవాలయ ప్రవేశం కల్పించడానికి నిరాహారదీక్షకు పూనుకోవడానికి కూడా సిద్ధపడతాను. ఇందుకు మీ ఆశీర్వాదాలు కోరుతున్నాను.’’

- 1944లో గాంధీజీకి రాసిన లేఖలో పొట్టి శ్రీరాములు

నెల్లూరు, తుళ్లూరు, మార్చి15 (ఆంధ్రజ్యోతి): అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతిలో రాజధాని అమరావతిలో నిర్మించిన 58 అడుగుల విగ్రహాన్ని సీఎం చంద్రబాబు సోమవారం ఆవిష్కరించనున్నారు. ఒకరోజు తిండి తినకపోతేనే కడుపులో ఏదోలా ఉంటుంది. అటువంటిది ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 58 రోజులపాటు నిరాహార దీక్ష చేయడమంటే ఊహించగలమా? అందువల్లే సరిగ్గా అన్నే అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పొట్టి శ్రీరాములు 125వ జయంతి నాడు (సోమవారం) ఆవిష్కరించనుంది. పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16వ తేదీన మద్రాసులో (ప్రస్తుతం చెన్నై) గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. నెల్లూరుకు చెందిన వీరి తల్లిదండ్రులు వ్యాపార అవసరాల రీత్యా మద్రాసుకు వలస వెళ్లారు. ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం మద్రాసులోనే జరిగింది. ఆ తర్వాత బొంబాయి వెళ్లి శానిటరీ ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. ఈ సమయంలోనే శ్రీరాములుకు తన మేనమామ కుమార్తె సుబ్బమ్మతో వివాహం జరిగింది. కొన్నాళ్లు మద్రాసులో చిన్నపాటి ఉద్యోగం చేశాక తిరిగి బొంబాయి వెళ్లి చదువుకు తగ్గ ఉద్యోగంలో చేరారు. ఆ సమయంలోనే భార్య సుబ్బమ్మ అనారోగ్యం పాలయ్యారు. అనేక మంది వైద్యుల వద్ద చూపించినా చివరకు సుబ్బమ్మ 1928లో తనువు చాలించారు. అంతకుముందే పుట్టిన బిడ్డ కూడా చనిపోవడంతో శ్రీరాములు కుంగిపోయారు. అక్కడి నుంచి పూర్తిగా దేశ సేవలోకి దిగారు.


గాంధీజీ మార్గదర్శకం

బొంబాయిలో కాలేజీలో చదువుతూనే జాతీయోద్యమం వైపు శ్రీరాములు ఆకర్షితులయ్యారు. అయితే, సన్నిహితుల సూచన మేరకు ముందు చదువును పూర్తి చేశారు. అయితే 1930వ సంవత్సరం శ్రీరాములు జీవితాన్ని మలుపుతిప్పింది. గాంధీని కలిసిన శ్రీరాములు.. తన మిగిలిన జీవితాన్ని దేశ సేవకై అంకితం చేసేందుకు అవకాశమివ్వాలని కోరారు. దీంతో సబర్మతి ఆశ్రమంలో చేరాల్సిందిగా గాంధీజీ సూచించారు. అప్పుడు కూడా స్నేహితులు, బంధువులు ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి వెళ్లవద్దని సూచించినా శ్రీరాములు పట్టించుకోలేదు. సబర్మతి ఆశ్రమంలో ఉంటూ గాంధీజీ ఆలోచనలకు, ఆశయాలకు ఆకర్షితుడయ్యారు. 1933లో గాంధీ బ్రిటీషు అధికారుల తీరుకు వ్యతిరేకంగా శాసనోల్లంఘన ఉద్యమం చేపట్టారు. ఆ సమయంలోనే గాంధీతో పాటు సబర్మతి ఆశ్రమంలో ఉన్న 34 మందిని బ్రిటీషు పోలీసులు అరెస్టు చేశారు. ఇలా తొలిసారి స్వాతంత్య్ర ఉద్యమంలో అరెస్టయి శ్రీరాములు జైలుకు వెళ్లారు. ఆ తర్వాత ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు మరోమారు జైలు జీవితం గడిపారు. 1934లో బీహార్‌లో పెద్ద భూకంపం సంభవించింది. అక్కడి బాధితులకు సహాయ సహకారాలు అందించాల్సిందిగా గాంధీజీ పిలుపునిచ్చారు. ఈ సమయంలో బీహార్‌ భూకంప బాధితుల కేంద్ర సహాయక సంఘం ఏర్పడింది. ఈ సంఘంలో శ్రీరాములు సభ్యునిగా ఉన్నారు.


మద్యపాన నిషేధానికి కృషి

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె గ్రామంలో వైద్యునిగా పనిచేస్తున్న సోదరుడు రంగయ్య నుంచి శ్రీరాములుకు ఓ ఉత్తరం అందింది. మేనమామ అవసాన దశలో ఉన్నట్లు తెలపడంతో శ్రీరాములు అక్కడికి చేరుకున్నారు. స్థానికంగా బడుగు, బలహీన వర్గాలకు ఎదుర్కొంటున్న దురాచారాలను నిలదీశారు. అప్పట్లో రెండు రోజులు మద్య నిషేధం కోసం నిరాహార దీక్ష చేశారు. మరోసారి మద్యం ముట్టుకోము అని ఆ ఊరి వారితో ప్రమాణం చేయిస్తూ గ్రామంలో ఓ పాడుపడిపోయిన ఓ బావికి వారి చేత మరమ్మతులు చేయించి తాగునీటి సమస్యను తీర్చారు. అనంతరం కృష్ణా జిల్లా అంగలూరులో స్థాపించిన గాంధీ ఆశ్రమానికి శ్రీరాములు చేరుకొని నూలు వడకడం, మద్యనిషేధం, అస్పృశ్యతా నివారణ మొదలైన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వరాజ్యం కోసం పోరాడుతున్న గాంధీని అరెస్టు చేశారన్న వార్త తెలుసుకున్న శ్రీరాములు.. 1943లో గుడివాడ వెళ్లి జాతీయ జెండాను ధరించి బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. దీంతో మరోమారు శ్రీరాములు జైలుకెళ్లారు. జైలు నుంచి విడుదలయ్యాక తిరిగి జువ్వలదిన్నె చేరుకుని, ప్రజలను చైతన్యం చేశారు.


ప్రాణత్యాగం.. అనేక జాతులకు విముక్తి

పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం.. ఒక్క తెలుగు జాతికే కాకుండా దేశంలో అనేక జాతులకు విముక్తి కల్పించింది. నాలుగు దశాబ్ధాల పాటు ఆంధ్రరాష్ట్ర సాధనకు జరుగుతున్న ప్రయత్నాలు ఫలించకపోవడం, మద్రాసు రాష్ట్రంలో తెలుగు వారంటే చులకనగా చూడడం వంటి సంఘటనలు పొట్టి శ్రీరాములను కదిలించాయి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 1952 అక్టోబరు 19వ తేదీన చెన్నైలోని మద్రాసు శాసనసభ మాజీ అధ్యక్షుడైన బులుసు సాంబమూర్తి ఇంటి ఆవరణలో నిరాహార దీక్షకు పూనుకున్నారు. 28వ రోజు వచ్చేసరికి శ్రీరాములు ఆరోగ్యం క్షీణించింది. ప్రజలు, నాయకుల మద్దతు శ్రీరాములుకు క్రమేనా పెరుగుతూ వచ్చింది. పొట్టి శ్రీరాములు దీక్ష చేస్తున్న విషయం తెలుగు వారందరి చెవులకు చేరింది. దీక్ష విరమించాలని ఎందరు పెద్దలు కోరినా శ్రీరాములు అందుకు ఒప్పుకోలేదు. 1952 డిసెంబరు 8వ తేదీన మద్రాసు శాసనసభ నుంచి యాభై మంది సభ్యులు వాకౌట్‌ చేసి అప్పటి నెహ్రూ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. అది డిసెంబరు 15వ తేదీ.. అప్పటికి నిరాహార దీక్ష చేపట్టి 58 రోజులైంది. ఎముకుల గూడుగా మారిన శరీరం.. నోట్లో నుంచి, ముక్కుల నుంచి నీరు కారుతోంది. అలసిపోయిన పొట్టి శ్రీరాములు తనువు చాలించారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే వ్యాపించడంతో మద్రాసు రాష్ట్రం అగ్నిగుండంగా మారింది. దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకై ప్రకటన చేసింది. ఆయన త్యాగఫలమే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు మార్గం సుగుమం చేసింది. కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌, పంజాబ్‌, హరియానా వంటివి ఈ కోవలో ఏర్పడ్డ భాషా ప్రయుక్త రాష్ట్రాలు.

Updated Date - Mar 16 , 2026 | 06:03 AM