Share News

రాజధాని అమరావతి జోలికొస్తే ఖబడ్దార్‌

ABN , Publish Date - Apr 14 , 2026 | 06:05 AM

ప్రజా రాజధాని అమరావతి జోలికి వస్తే ఖబడ్డార్‌.. అంటూ వైసీపీ నాయకులను రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్‌ పోతుల బాలకోటయ్య హెచ్చరించారు.

రాజధాని అమరావతి జోలికొస్తే ఖబడ్దార్‌

  • మూడు రాజధానులు సగం పిచ్చి...

  • మావిగన్‌ పూర్తి పిచ్చి: పోతుల బాలకోటయ్య

విజయవాడ, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): ప్రజా రాజధాని అమరావతి జోలికి వస్తే ఖబడ్డార్‌.. అంటూ వైసీపీ నాయకులను రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్‌ పోతుల బాలకోటయ్య హెచ్చరించారు. రాజధానిగా మావిగాన్‌ పేరు ఎత్తి జగన్మోహన్‌రెడ్డి భస్మాసురుడిగా మారాడంటూ మండిపడ్డారు. జగన్‌ చెప్పే మావిగాన్‌కు అర్థం తెలిస్తే వైసీపీ నాయకులు చెప్పాలని, ఆ తర్వాతే నోరు మెదపాలని, లేకుంటే నోరు మూసుకొని కూర్చోవాలని హితవు పలికారు. గురునానక్‌ కాలనీలోని విజయవాడ ఎంపీ కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి నిర్మాణానికి రూ.లక్షల కోట్లు ఖర్చవుతుందని, ‘మావిగన్‌’కు అసలు ఖర్చే ఉండదని వైసీపీ సోషల్‌ మీడియా చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. జగన్‌ చెబుతున్న మావిగన్‌కు, ప్రజా రాజధాని అమరావతికి మధ్య తేడాలను వివరించారు. జగన్మోహన్‌రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన ‘సగం పిచ్చి’ అయితే, ‘మావిగన్‌’ అనేది ‘పూర్తి పిచ్చి’కి సంకేతమన్నారు. అమరావతి అంటే 29 గ్రామాలని వైసీపీ నాయకులు అనుకుంటున్నారని, అదీ వారికున్న పరిజ్ఞానమంటూ ఎద్దేవా చేశారు. సీఆర్డీయే పరిధి మొత్తం రాజధాని అమరావతి ప్రాంతమేనన్న విషయాన్ని జగన్‌తో సహా వైసీపీ నాయకులు తెలుసుకోవాలన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన జగన్‌కు సీఆర్డీయే హద్దులు తెలియకపోవడం సిగ్గుచేటన్నారు.


విజయవాడ రైల్వేస్టేషన్‌ 1888లో, గన్నవరం విమానాశ్రయం 1940లో, విజయవాడ బస్‌ స్టేషన్‌ 1990లో ఏర్పడ్డాయన్నారు. బ్రిటీష్‌ కాలంలో జరిగిన నిర్మాణాలనూ జగన్‌ తన ఖాతాలో వేసుకోవడం అవివేకమన్నారు. అమరావతిని రాజధానిగా రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చాయని, రాజధాని ప్రాంతాన్ని మార్చటం జగన్‌ తరం కాదన్నారు. మచిలీపట్నం వంటి సముద్ర తీర ప్రాంతాల్ల్లో రాజధాని పెట్టడం సాధ్యపడదన్న విషయం అరకొర జ్ఞానం ఉన్న జగన్‌కు, ఆ పార్టీ నాయకులకు ఏం తెలుస్తుందంటూ ఎగతాళి చేశారు. 1977 దివిసీమ తుఫాను వంటి చేదు అనుభవాలను జగన్‌ ముందుగా తెలుసుకోవాలని హితవు పలికారు. మచిలీపట్నంలో రాజధాని పెట్టాలి అంటున్న జగన్‌ గానీ, మాజీ మంత్రి పేర్ని నాని గానీ ఒక ఎకరం భూమి మచిలీపట్నంలో సేకరించగలరా? ఆ దమ్ము వారికుందా? ప్రజలు జగన్‌ను నమ్ముతారా? అక్కడ భూమైనా ఇస్తారా? అంటూ ప్రశ్నించారు. అమరావతికి రూ.3.6 లక్షల కోట్లు ఖర్చవుతుందనేది తప్పుడు ప్రచారమనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు.

Updated Date - Apr 14 , 2026 | 06:07 AM