Share News

పడకేసిన పారిశుధ్యం

ABN , Publish Date - Jul 25 , 2026 | 04:42 AM

వారం రోజుల క్రితం ప్రమాదంలో కాలు విరిగిన ఓ వ్యక్తి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. ఆయనకు శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు. రెండు మూడు రోజుల్లో ఆపరేషన్‌ అనగా అతడికి తీవ్రమైన జ్వరం వచ్చింది.

పడకేసిన పారిశుధ్యం

  • బోధనాస్పత్రుల్లో అస్తవ్యస్తంగా పరిస్థితి

  • చికిత్స కోసం వచ్చే రోగులకు కొత్త రోగాలు

  • మలేరియా బారిన పడుతున్న రోగులు

  • శానిటేషన్‌ను గాలికొదిలేసిన కాంట్రాక్ట్‌ సంస్థలు

  • అరకొర సిబ్బందితో నెట్టుకొస్తున్న వైనం

  • కమీషన్ల కక్కుర్తితో పట్టించుకోని అధికారులు

  • విజయవాడ, విశాఖ, సీమలో పరిస్థితి దారుణం

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

వారం రోజుల క్రితం ప్రమాదంలో కాలు విరిగిన ఓ వ్యక్తి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. ఆయనకు శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు. రెండు మూడు రోజుల్లో ఆపరేషన్‌ అనగా అతడికి తీవ్రమైన జ్వరం వచ్చింది. అనుమానంతో రక్త నమూనాలను పరీక్షించగా మలేరియా అని తేలింది. దీంతో మలేరియా తగ్గే వరకూ శస్త్రచికిత్స చేయడానికి వీల్లేదని వైద్యులు ఆపరేషన్‌ నిలిపివేశారు. ఆస్పత్రుల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారడంతో రోగాలు నయం చేసుకోవడానికి వచ్చే రోగులకు కొత్త రోగాలు అంటుకున్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ..! వాస్తవానికి ఈ సమస్య ఒక్క విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోనే కాదు. విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరుతో పాటు రాయలసీమలోని బోధనాస్పత్రుల్లో శానిటేషన్‌ వ్యవస్థ దారుణంగా తయారైంది. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులకు కొత్త జబ్బులు వస్తున్నాయి. శానిటేషన్‌ కాంట్రాక్టర్లకు రూ.కోట్లు చెల్లిస్తున్నా ఫలితం మాత్రం తీవ్ర నిరాశ కలిగిస్తోంది.

తక్కువ మందితోనే పనులు..

బోధనాస్పత్రుల్లో శానిటేషన్‌ వ్యవస్థ దారుణంగా తయారవడానికి అనేక కారణాలున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన సిబ్బంది ఆస్పత్రుల్లో విధులు నిర్వహించడం లేదు. విజయవాడలో ప్రతిరోజు 280 మంది శానిటేషన్‌ వర్కర్లు విధులు నిర్వహించాల్సి ఉంది. కానీ.. కాంట్రాక్టర్‌ 150 మందిని మాత్రమే నియమించుకుని.. వారితోనే పని కానిచ్చేస్తున్నారు. గుంటూరులో 290 మందికి 160 మంది, విశాఖలో 401 మందికి గాను 300 మందితో సరిపెట్టేస్తున్నారు. దీంతో ఆస్పత్రుల్లో పారిశుధ్యం పడకేసి రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై రోగులు నుంచి ఫిర్యాదులు వచ్చినా పట్టించుకునే నాధుడే లేడు.


ముఖ్యమంత్రి అసంతృప్తి..

ఆస్పత్రుల్లో పారిశుధ్యంపై ప్రజల్లో సంతృప్తి స్థాయి తగ్గిపోతోంది. నెలనెలా నిర్వహించే సమీక్షల్లోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల క్రితం 60 శాతంగా ఉన్న సంతృప్తి స్థాయి ఇప్పుడు 50 శాతానికి పడిపోయింది. దీనిపై సీఎం అనేక సార్లు ఆగ్రహం వ్యక్తం చేసినా ఫలితం కనిపించడం లేదు. శానిటేషన్‌ కోసం రూపొందించిన నిబంధనలను ఆస్పత్రుల్లో ఎక్కడా అమలు చేయడం లేదు. కాంట్రాక్టర్లు చేపట్టిన శానిటేషన్‌ పనులకు 95 మార్కులు వస్తేనే వంద శాతం బిల్లులు చెల్లించాలి. దానికి ఒక్క మార్కు తగ్గినా బిల్లులు తగ్గించి ఇవ్వాలి. కానీ ఆరోగ్యశాఖలో కింద నుంచి పైస్థాయి వరకూ కమీషన్లు కొట్టేసి కాంట్రాక్టర్‌కు 95 మార్కులుపైనే వేస్తున్నారు. దీంతో కాంట్రాక్టర్‌కు పూర్తిస్థాయి బిల్లులు వచ్చేస్తున్నాయి. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో 280 మంది శానిటేషన్‌ వర్కర్లు విధులు నిర్వహించాలన్న నిబంధన ఉన్నప్పటికీ... 150 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఈ నిబంధన ప్రకారం సదరు కాంట్రాక్టర్‌కు 80 నుంచి 85ు మార్కులే వేయాలి. విశాఖలో కూడా తక్కువ సిబ్బందితో పనిచేయిస్తున్నందుకు మార్కులు తగ్గించి వేయాలి. కానీ ఈ రెండు చోట్లా కాంట్రాక్టర్‌కు 95 మార్కులు పైనే వేస్తున్నారు.


సిబ్బంది ధర్నాలు...

విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లోని బోధనాస్పత్రుల్లో శానిటేషన్‌ పనులు చేస్తున్న కాంట్రాక్ట్‌ సంస్థ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చినా ఫర్వాలేదన్నట్లు వ్యవహరిస్తోంది. ఒకవైపు ప్రతి ఆస్పత్రిలో తక్కువ మంది సిబ్బందితోనే పనులు చేయించుకుంటూ.. మరోవైపు ఆ కొద్ది మందికి కూడా జీతాలు సరిగా చెల్లించడం లేదు. ఆరోగ్యశాఖకు, కాంట్రాక్ట్‌ సంస్థకు మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోయినా సిబ్బందికి మాత్రం ప్రతి నెలా జీతాలు ఇవ్వాలి. ఈ నిబంధన కూడా ఉల్లంఘిస్తూ రెండు, మూడు నెలలుగా వర్కర్లకు జీతాలివ్వడం లేదు. పీఎఫ్‌, ఈఎఎస్ఐ ఊసే ఎత్తడం లేదు. దీంతో సిబ్బంది జీతాల కోసం ధర్నాలు చేయాల్సి వస్తోంది. ఏప్రిల్‌లో విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో శానిటేషన్‌ సిబ్బంది జీతాల కోసం పోరాటం చేశారు. ఇప్పుడు మళ్లీ మే, జూన్‌ నెలల జీతాల కోసం ధర్నాలు చేయాల్సి వస్తోంది. మిగిలిన జిల్లాల్లోనూ పరిస్థితి ఇలానే ఉంది.

Updated Date - Jul 25 , 2026 | 04:50 AM