Share News

పొలూష్యనైట్‌

ABN , Publish Date - Nov 11 , 2026 | 11:38 PM

దీపావళి పండగ అంటేనే ముఖ్యంగా బాణ సంచా పేలుళ్లు గుర్తుకు వస్తున్నాయి. మోత మోగాలి, దుమ్ము లేవాలి అన్న చందంగా పండగ వాతావరణం ఉంటుంది.

   పొలూష్యనైట్‌

- మోతాదుకు మించి కాలుష్యం

ఫ బాణసంచా మోత మోగించారు

ఫ దీపావళి రోజున అధిక మొత్తంలో కాలుష్య కారకాలు

ఫ టపాసుల పేలుళ్లతో శబ్ధ, వాయు కాలుష్యం

కర్నూలు రాజ్‌విహార్‌ సర్కిల్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): దీపావళి పండగ అంటేనే ముఖ్యంగా బాణ సంచా పేలుళ్లు గుర్తుకు వస్తున్నాయి. మోత మోగాలి, దుమ్ము లేవాలి అన్న చందంగా పండగ వాతావరణం ఉంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా చాలా మందిలో పర్యావరణ పరిరక్షణ సృహ పెరుగుతోంది. చాలా విషయాల్లో తరాల మధ్య అంతరాలున్నా దీపావళి టపాసుల విషయంలో మాత్రం ఎలాంటి వ్యత్యాసం కానరావటం లేదు. దీపావళి బాణా సంచా పేల్చటం వల్ల ఏర్పడే వాయు, శబ్ధ కాలుష్యాలపై అటు నిపుణులు, ఇటు అధికార యంత్రాంగం హెచ్చరికలు, అవగాహన కల్పించినా, ప్రజలు బాణా సంచా మోత, చిచ్చుబుడ్డులు, కాకర ఒత్తుల వెలురుతుతోనే పండగ సంబరాన్ని పరిసమాప్తం చేశారని చెప్పాలి. సాధారణ రోజులతో పోలిస్తే దీపావళి రోజున ఉత్పన్నమైన వాయు, శబ్ధ కాలుష్యాలు ఒకింత మోతాదును మించాయనే చెప్పాలి.

హరిత టపాసులతో నిర్వహించుకోవాలని..

దీపావళి పండగను కాలుష్య రహితంగా పర్యావరణ హితంగా హరిత టపాసులతో నిర్వహించుకోవాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఎంత చెప్పినా నగరవాసుల చెవికెక్కలేదనే చెప్పాలి. హరిత టపాసుల (గ్రీన్‌ కాకర్స్‌) వల్ల తక్కువ స్థాయిలో వాయు కాలుష్యం, పరిమిత సంఖ్యతో శబ్ధ కాలుష్యం వెలువడుతోందని అధికారులు పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు, కూడళ్లలో కళాజాతా బృందాలచే చైతన్య కార్యక్రమాలు ప్రదర్శించారు. వీటిని ఆసక్తిగా తిలకించిన విద్యా ర్థులు, ప్రజలు చివరకు కాలుష్య కారక టపాసుల వైపే మొగ్గు చూపారు. ఫలితంగా సాధారణ రోజుతో పోల్చితే దీపావళి ఒక్క రోజులోనే రెట్టింపు సంఖ్యతో కాలుష్యం విడుదలైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.

చెవులు చిల్లులు పడేలా...

వాయు, శబ్ధ కాలుష్యాన్ని పరిశీలించేందుకు నవంబరు 1వ తేదీని, దీపావళి రోజైన 8వ తేదీని ఎంచుకున్నారు. ఈ క్రమంలో నివాసిత ప్రాంతాలు ఉండే క్రిష్ణానగర్‌, వాణిజ్య సముదాయాలు ఉండే రాజ్‌విహార్‌ సర్కిల్‌, పరిశ్రమలు కొలువుదీరిన కల్లూరు పారిశ్రామికవాడ, సున్నిత ప్రాంతమైన ఎక్యాంప్‌ మాంటిస్సోరి పాఠశాల ప్రాంతాల్లో శాస్ర్తీయ పద్దతిలో గంట వ్యవధి తేడాలో సాయంత్రం 6 గంటల నుంచి అర్థరాత్రి 12 వరకు ఈ కాలుష్య పరిశీలనను నిర్వహించారు. క్రిష్ణానగర్‌ ప్రాంతంలో ఈ తీవ్రత అధికంగా కన్పించింది. సాధారణ రోజుల్లో 73.2 డెసిబుల్స్‌ ఉన్న శబ్ధ కాలుష్యం, దీపావళి నాడు 105.3 నమోదైంది. పాఠశాలలు, ఇళ్లు అధికంగా ఉంటే ఏక్యాంపులోను ఈ శబ్ధ తీవ్రత అధికంగానే ఉంది. మామూలు దినాల్లో 72.4గా ఉండే శబ్ధం కాస్త పండగ రోజున 98.9గా నివేదికలు చెబుతున్నాయి. మొత్తం మీద ఐదు ప్రాంతాల సగటు సాధారణ రోజుల్లో 58.9గా నమోదు కాగా, దీపావళి రోజు సగటున 80.2గా అధ్యయనంలో తేలింది.

గాలిలోకి నిషేధిత రసాయనాలు

టపాసుల పేలుళ్ల వల్ల గాలిలోకి నిషేధిత రసాయనాలు ఉత్పన్నం కావటంతో పాటు, శ్వాస కోశ ఇబ్బందులు కలిగించే స్మూక్ష, ధూళి కణాలు వెలువుడుతాయి. ఇందులో ప్రధానంగా సల్ఫర్‌ డైఆక్సైడ్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌ వంటి ప్రమాదకర వాయువులు గాలిలోకి మిళితం అవుతాయి. పర్టిక్యులేట్‌ మేటర్‌ 10 (పీఎం) పెద్ద దూళి కణాలను, పీఎం 2.5 చిన్న దూళి కణాలను కొలిచే కొలమానం. సాధారణ రోజుల్లో క్రిష్ణానగర్‌లో పీఎం10 40 ఉండేది కాగా దీపావళి రోజున 124.9 నమోదైంది. పీఎం2.5 సాధారణ రోజుల్లో 18 ఉండగా పండుగ రోజున 83గా నమోదు కావటం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. ఐదు ప్రాంతాల్లో పీఎం 10 సగటు 50, పీఎం 2.5 సగటు 24గా నమోదైంది. కానీ ఇవే ప్రాంతాల్లో పండగ రోజు పీఎం10 సగటు 91, పీఎం2.5 64గా నివేదికలు తేల్చి చెప్పాయి.

నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది..

పర్యావరణ పరిరక్షణకు తమ వంతు ప్రయత్నం నిరంతర ప్రక్రియగా కొనసాగు తోంది. ప్రజల్లో అవగాహన కల్పించి, వారిని చైతన్యుల్ని చేయటమే తమ కర్తవ్యం. అదే తరహలో ప్రజలు సైతం తమ వంతు సామాజిక బాధ్యతగా మా ప్రయత్నాలకు తోడ్పాటును అందించాలి. భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించాలి

ఫ పీవీ కిషోర్‌రెడ్డి, ఎన్విరాన్‌ మెంటల్‌ ఇంజనీరు, కర్నూలు

Updated Date - Nov 11 , 2026 | 11:39 PM