కలుషిత నీరే గతి..!
ABN , Publish Date - Mar 23 , 2026 | 11:19 PM
మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఆర్‌వో ప్లాంట్లు ఏళ్ల తరబడి పనిచేయడం లేదు.
పనిచేయని ఆర్‌వో ప్లాంట్లు
విద్యార్థులకు తప్పని
తాగునీటి ఇబ్బందులు
హొళగుంద, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఆర్‌వో ప్లాంట్లు ఏళ్ల తరబడి పనిచేయడం లేదు. దీంతో వేల మంది విద్యార్థులకు తాగునీరు అందని ద్రాక్షగా మిగిలింది. దాంతో కలుషిత నీరే గత్తైంది. మండలంలో 39 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా నాడు- నేడు పథకం క్రింది మొదటి విడతలో 21 పాఠశాలలకు ఆర్‌వో ప్లాంట్లు మంజూరు అయ్యాయి. 19 చోట్ల ఆర్‌వో ప్లాంట్లు పూర్తిగా పాడయ్యాయి. దీంతో విద్యార్థులు కొళాయి, బోర్ల , రంగు మారిన నీరు తాగి రోగాల బారిన పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఆర్‌వో ప్లాంట్లు ఎక్కడికక్కడే మూలకు చేరాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి ఆర్‌వో ప్లాంట్లను ఏర్పాటు చేశారు. రూ.50 వేల నుంచి రూ.4లక్షల వరకూ ఖర్చు చేశా రు. విద్యార్థులకు ప్లోరైడ్ నీటి బాధ నుంచి విముక్తి కల్పించేందుకు ఆర్‌వో ప్లాంట్లు ఏర్పా టు చేసినట్టు గత ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. కానీ నిర్వహణ మర్చిపోవడంతో రకరకాల కారణాలతో ప్లాంట్లు మూలకు చేరాయి. అప్పట్లో సాంకేతిక సిబ్బందిని సైతం అందుబాటులో ఉంచారు. కాగా ప్రస్తుతం ప్లాంట్లు పనిచేయడం లేదని ప్రభుత్వ పాఠశాలలో హెచఎంలు ఫోన చేస్తుంటే టెక్నికల్ సిబ్బంది స్పందించడం లేదంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరముందని, లేకుంటే వందల కోట్ల రూపాయలు విలువచేసే ఆర్‌వో ప్లాంట్లు దేనికి పనికిరాకుండా పోయే అవకాశం ఉందని తల్లిదండ్రులు అంటున్నారు. ఈ విషయంపై ఎంఈవో సుధారాణిని వివరణ కోరగా ఆర్‌వో ప్లాంట్‌కు సంబంధించిన టెక్నికల్ సిబ్బంది స్పందించడం లేదన్నారు. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.
పనిచేయడం లేదు
పాఠశాలలో 650 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఆర్‌వో ప్లాంట్ మంజూరు అయింది. త్రీ ఫెస్ కరెంట్ లేకపోవడంతో ఆరు సం వత్సరాలుగా మూలాన పడింది. విద్యార్థులు కొళాయి నీరు తాగుతున్నారు. ఆర్‌వో ప్లాంటు ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
- భీమేష్ రెడ్డి, హెబ్బటం జడ్పీ ఉన్నత పాఠశాల హెచఎం