చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్
ABN , Publish Date - Nov 02 , 2026 | 12:29 AM
చెదురు మదురు గటనలు మినహా జిల్లాలో మున్సిపల్ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. 95 ఏళ్ల వృద్ధులు, వికలాంగులు, బాలింతలు, గర్భిణులు సైతం తమ ఓటు హక్కును క్యూలో నిలబడి వినియోగించుకున్నారు.
ఒక్క పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ ప్రయత్నం
జిల్లాలో ఎక్కడా రీపోలింగ్ లేదు
చిత్తూరు, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): చెదురు మదురు గటనలు మినహా జిల్లాలో మున్సిపల్ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. 95 ఏళ్ల వృద్ధులు, వికలాంగులు, బాలింతలు, గర్భిణులు సైతం తమ ఓటు హక్కును క్యూలో నిలబడి వినియోగించుకున్నారు.
నగరిలో కనిపించని వైసీపీ నాయకులు
నగరి మున్సిపల్ ఎన్నికల్లో పలు చోట్ల వైసీపీ నాయకులు తెరమరుగయ్యారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత దాదాపు 30 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు, నాయకులు ఎక్కడా కనిపించలేదు. ఐదో వార్డులో వైసీపీ అభ్యర్థి రెండు రోజులుగా సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ వెళ్లిపోవడంతో ఇక్కడ టీడీపీ గెలుపు మరింత సులువుగా మారింది.
చిత్తూరు, పలమనేరులో దొంగ ఓట్లకు ప్రయత్నాలు
చిత్తూరు కార్పొరేషన్‌లోని 21వ డివిజన్ పోలింగ్ కేంద్రంలో పలువురు రిగ్గింగ్ చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడ సుమారు 15 ఓట్ల వరకు రిగ్గింగ్ చేసుకున్నట్లు ఉన్నత స్థాయి అధికారులు చెబుతున్నారు. అలాగే పలమనేరులో కూడా మధ్యాహ్నం 3 గంటల తర్వాత గుంపులు గుంపులుగా చేరి దొంగ ఓట్లు వేసేందుకు విఫలయత్నం చేశారు. ఆయా ప్రాంతాల్లో అధికారులు, పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పలమనేరులోని 8వ వార్డులో తన ఓటును ముందుగా ఎవరో వేసినట్లు ఆయేషా ఆరోపించారు.
ఫ చిత్తూరు నగరంలోని న్యూకయనికట్టువీధి, గంగనపల్లె 26వ డివిజన్ పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం సమీపంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య మొదట వాగ్వాదం జరగ్గా, అనంతరం అది ఘర్షణకు దారి తీసింది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. అలాగే 32వ డివిజనులో వైసీపీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రం నుంచి జనసేన నాయకులు బయటికి పంపే ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు. మళ్లీ కేంద్రంలోకి పంపించారు.