Share News

పోలింగ్‌ ప్రశాంతం

ABN , Publish Date - Nov 02 , 2026 | 12:00 AM

మదనపల్లె, పుంగనూరు మున్సిపాలిటీల్లో ఆదివారం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మదనపల్లెలో ఛైర్మన్‌తో పాటు 47 వార్డులు(144 పోలింగ్‌ కేంద్రాలు), పుంగనూరులో 4 వార్డులకు (8 పోలింగ్‌ కేంద్రాలు) ఎన్నికలు జరిగాయి.

పోలింగ్‌ ప్రశాంతం
మదపనల్లెలో పోలింగ్‌ కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్లు

పోలింగ్‌ ప్రశాంతం

- మదనపల్లెలో 61.50శాతం.. పుంగనూరు శాతం 63.47

- ప్రారంభంలో జోరుగా ఓటింగ్‌

- 11.30 తర్వాత పలుచబడ్డ క్యూలు

- పర్యవేక్షించిన కలెక్టర్‌, జేసీ, ఎస్పీ

అన్నమయ్య, నవంబర్‌ 1(ఆంఽధ్రజ్యోతి): మదనపల్లె, పుంగనూరు మున్సిపాలిటీల్లో ఆదివారం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మదనపల్లెలో ఛైర్మన్‌తో పాటు 47 వార్డులు(144 పోలింగ్‌ కేంద్రాలు), పుంగనూరులో 4 వార్డులకు (8 పోలింగ్‌ కేంద్రాలు) ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమైంది. 11.30 గంటల వరకు ఓటర్లు క్యూ కట్టారు. ఆ తర్వాత ఓటింగ్‌ మందకొడిగా సాగింది. చాలా పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు లేక క్యూలు ఖాళీగా కనిపించాయి. కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ శివనారాయణశర్మ, ఎస్పీ ధీరజ్‌ పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. చిన్నచిన్న వాగ్వాదాలు తప్ప ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదు. మదనపల్లెలో 61.50 శాతం, పుంగనూరులో 63.47శాతం పోలింగ్‌ నమోదైంది.

జోరుగా మొదలై.. చప్పగా ముగిసి..

ఉదయం 6.30 గంటలకే పలు పోలింగ్‌ కేంద్రాలలో ఓటర్లు క్యూలలో నిలబడ్డారు. ఏడు గంటలకు పోలింగ్‌ మొదలైంది. మదనపల్లె చంద్రకాలనీ బీ.ఆర్‌అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలో ఆరు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 11.30 గంటల వరకు ఓటర్లు ఎక్కువగా కనిపించారు. అనంతరం పోలింగ్‌ శాతం తగ్గింది. ఓటర్లు లేక పోలింగ్‌ కేంద్రాలు వెలవెలబోయాయి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు చాలా తక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 3 గంటల నుంచి పోలింగ్‌ ముగిసే సమయానికి మళ్లీ ఓటర్లు పెరిగారు.

పోలింగ్‌ సరళి ఇలా..

మదనపల్లెలో ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 13.01 శాతం పోలింగ్‌ జరిగింది. పుంగనూరులో 14.41ఽశాతం నమోదైంది. 11 గంటల వరకు మదనపల్లెలో 28.29శాతం, పుంగనూరులో 31.82శాతం నమోదైంది. ఒంటి గంట వరకు మదనపల్లెలో 43.46శాతం, పుంగనూరులో 44.83శాతం పోలింగ్‌ నమోదైంది. 3 గంటల వరకు మదనపల్లెలో 53.46. శాతం, పుంగనూరులో 55.65శాతం నమోదైంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3గంటల వరకు కేవలం 10 శాతం మాత్రమే మదనపల్లెలో పోలింగ్‌ శాతం నమోదైంది. పుంగనూరులో ప్రారంభం నుంచి ఓటింగ్‌ మందకొడిగా సాగింది. ఎక్కడా క్యూలలో ఓటర్లు వేచి ఉండే పరిస్థితి కనిపించలేదు. 9వ వార్డులో టీడీపీ, సీపీఐ మధ్య పోటీ ఉండటంతో వైసీపీ ఓటర్లు సీపీఐకి మద్దతు ఇచ్చినట్లు కనిపించింది. మిగిలిన చోట్ల టీడీపీ, జనసేన ఽమధ్య పోటీ నెలకొంది.

ఓటింగ్‌ ఇందుకే తగ్గిందా..?

వర్షం పడలేదు. పోలింగ్‌ కేంద్రాల వద్ద హింసాత్మక ఘటనలూ జరగలేదు. ఓటర్లకు ఇరు పార్టీలు శక్తి మేర డబ్బు పంపిణీ చేశాయి. అయినా పోలింగ్‌ శాతం బాగా తగ్గింది. పట్టణంలోని జనం శివార్లలోని కాలనీల్లోకి మారడమే దీనికి కారణంగా తెలుస్తోంది. మదనపల్లె శివారులో టిడ్కో ఇళ్లు, బీకే పల్లె కాలనీ, కోళ్లబైలు, కురువంక, బసినికొండ వడ్డెపల్లె, నక్కలదిన్నె కాలనీలు ఉన్నాయి. పట్టణంలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈ కాలనీల్లోకి వెళ్లిపోయారు. నివాసం ఒకచోట.. ఓటు ఒక చోట ఉండటంతో ఓటు వేయడానికి వారు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.

కొన్నిచోట్ల చెదురుమదురు ఘటనలు..

మదనపల్లె మున్సిపాలిటీలో కొన్నిచోట్ల చెదురుమదురు ఘటనలు జరిగాయి. 16, 17, 18 కేంద్రాల్లో పోలింగ్‌ సరళిని పరిశీలించేందుకు టీడీపీ ఛైర్మన్‌ అభ్యర్ది శ్రీరామ్‌ చినబాబు వచ్చారు. దీనికి వైసీపీ చైర్మన్‌ అభ్యర్ధి జింకా వెంకటాచలపతి అభ్యంతరం తెలిపారు. కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. 21వ వార్డులో కొందరు ముఖానికి గుడ్డకట్టుకున్న వ్యక్తులు బ్యాలెట్‌ పేపర్లను చింపుకెళ్లినట్లు తెలిసింది. అయితే దీనిపై ఎటువంటి ఫిర్యాదూ రాలేదు. 22వ పోలింగ్‌ కేంద్రం వద్ద బయట వ్యక్తులు వచ్చారంటూ ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తలు గుమికూడటంతో పోలీసులు చెదరగొట్టారు. 15వ పోలింగ్‌ కేంద్రంలో కొందరు వ్యక్తులు రిగ్గింగ్‌ చేయడానికి వచ్చారని పోటీలో ఉన్న జనసేన అభ్యర్థి వాళ్లను పోలీసులకు అప్పగించారు. 19వ పోలింగ్‌ కేంద్రంలో ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థులు స్వల్ప ఘర్షణపడ్డారు. పోలీసుల జోక్యంతో సర్దుబాటైంది.

Updated Date - Nov 02 , 2026 | 12:00 AM