Yarapathineni Srinivas: 12 మందిని పొట్టన పెట్టుకున్న పాపం వైసీపీదే
ABN , Publish Date - Jan 18 , 2026 | 03:49 AM
ఎక్కడ శవం కనిపిస్తుందా.. ఎప్పుడు రాజకీయం చేయాలా అని వైసీపీ నేతలు తెగ ఎదురు చూస్తుంటారని పల్నాడు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
పల్నాడులో రక్తపుటేరులు పారించారు
శవ రాజకీయాలు మానుకోకపోతే శాశ్వత సమాధే
జగన్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి: యరపతినేని
గుంటూరు సిటీ, జనవరి 17(ఆంధ్రజ్యోతి): ఎక్కడ శవం కనిపిస్తుందా.. ఎప్పుడు రాజకీయం చేయాలా అని వైసీపీ నేతలు తెగ ఎదురు చూస్తుంటారని పల్నాడు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో గురజాల నియోజకవర్గంలో 12 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న పాపం వాళ్లకే దక్కుతుందన్నారు. శనివారం గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో ఇద్దరు దళితుల మధ్య గొడవ జరిగి ఆ నేపథ్యంలో ఒకరిపై ఒకరు కర్రలతో దాడులకు పాల్పడ్డారని తెలిపారు. సాల్మన్ అనే వ్యక్తి తలకి బలమైన గాయం కావటంతో గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని తెలిపారు. వాస్తవానికి గొడవకు దిగిన ఇద్దరు దళిత యువకులూ ఏ పార్టీలోనూ అంత చురుకుగా ఉండే వారు కాదని యరపతినేని వెల్లడించారు. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగి ఒకరు మరణిస్తే దానికి మాజీ ఎమ్మెల్యే కాసు మహే్‌షరెడ్డి రాజకీయ రంగు పులుముతున్నారని ఆరోపించారు. ఇదే మహేష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలోని 12 మందిని అత్యంత కిరాతకంగా హత్యలు చేయించారని ఆరోపించారు. అంత మంది దళితులను దారుణంగా హత్య చేస్తున్నా అధికారంలో ఉన్న మహేష్ రెడ్డి కళ్లు మూసుకొని కూర్చున్నారని విమర్శించారు. కనీసం ఆ హత్యలపై సరైన ఎఫ్‌ఐఆర్‌లు కూడా నమోదు కాకుండా అడ్డుకున్నారని దుయ్యబట్టారు. అంతేకాకుండా కాసు ధన దాహానికి, అక్రమ మైనింగ్‌కు ముక్కుపచ్చలారని 8 మంది పిల్లలు చనిపోయారని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు పల్నాడులో రక్తపు టేరులు పారించి సీఎం హోదాలో ఉండి కూడా జగన్ రెడ్డి సైంధవుడి పాత్ర పోషించారని యరపతినేని మండిపడ్డారు. ఇప్పుడు అసలు పిన్నెల్లిలో ఏమి జరిగిందో తెలుసుకోకుండానే జగన్ విమర్శలు చేయటం అవివేకమని తెలిపారు. శవ రాజకీయాలు.. రఫ్ఫా.. రఫ్ఫా రాజకీయాలకు స్వస్తి పలకకపోతే రానున్న రోజుల్లో వైసీపీకి ప్రజలు శాశ్వత సమాధి కడతారని యరపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు.