చిప్పగిరిలో రాజకీయ దుమారం
ABN , Publish Date - Nov 28 , 2026 | 11:39 PM
చిప్పగిరి మండలంలో వైసీపీ, టీడీపీ మధ్య రాజకీయ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
- సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల వ్యవహారంతో
వైసీపీ, టీడీపీ మద్దతు అభ్యర్థుల మధ్య వివాదం
- సర్పంచ అభ్యర్థి ఎల్లంకి రజని ఫిర్యాదుతో కేసు నమోదు
- నకిలీ ఖాతా సృష్టించి పోస్టులు పెట్టారని
ఎమ్మెల్యే విరూపాక్షి వివరణ
చిప్పగిరి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): చిప్పగిరి మండలంలో వైసీపీ, టీడీపీ మధ్య రాజకీయ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో పోటీ చేసిన ఎల్లంకి రజని వైసీపీ మద్దతు అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో తనపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర వ్యాఖ్యలతో పోస్టులు పెట్టారంటూ రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి సోదరుడి కుమారుడు తనపై అసభ్యకర పోస్టులు పెట్టినట్లు ఆరోపిస్తూ రజని అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. మహిళా నాయకురాలిపై ఇలాంటి అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టడం సరికాదని, బాధ్యుడిని వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్లంకి రజని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే విరుపాక్షి సోదరుడు శ్రీరాములు కుమారుడు మధుసూదన్‌పై కేసు నమోదు చేసినట్లు చిప్పగిరి ఎస్ఐ నరసింహులు శనివారం వెల్లడించారు. మరోవైపు ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే విరూపాక్షి స్పందించారు. తన సోదరుడి కుమారుడి పేరుతో నకిలీ ఫేక్ అకౌంట్ సృష్టించి ఇలాంటి పోస్టులు పెట్టారని, ఆ పోస్టులకు తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. గతంలోనే ఈ విషయంపై ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న ఈ సోషల్ మీడియా వివాదం మండలంలో రాజకీయ వేడిని మరింత పెంచింది. ఒకవైపు రజని తనపై అసభ్య పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుండగా, మరోవైపు ఎమ్మెల్యే విరూపాక్షి తన సోదరుడి కుమారుడిపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ నకిలీ ఖాతా వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడంతో చిప్పగిరి రాజకీయాల్లో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.