రండి.. బేరం మాట్లాడుకుందాం..ది లాబీయిస్ట్
ABN , Publish Date - Mar 16 , 2026 | 05:35 AM
స్టీల్‌ప్లాంట్ కావాల్నా? షిప్‌యార్డ్ కావాల్నా? జింకా, బంకా? హెచ్‌పీసీఎల్‌నా? ఏం కావాలి? ఇవన్నీ దేనికి సార్? ఉద్యోగాలు చేయడానికి.. ఇది.. ఓ సినిమాలో కామెడీ సీన్! దాన్ని తలదన్నే ‘రియల్’ సీన్ ఒకటి ఏపీలో నడుస్తోంది.
రిటైర్డ్ ఐఏఎస్ దగ్గరి బంధువు దందా
సొంత జిల్లా కడప.. హైదరాబాద్‌లో మకాం
ఆర్డీవో, డీఎస్పీ పోస్టింగ్‌ల్లో మంత్రాంగం
సెటిల్మెంట్ల కోసం వచ్చి మాట్లాడుకోండి
డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ క్యాడర్‌కు ఫోన్లు
పోస్టులు రిజర్వ్ చేసుకోవాలంటూ ‘ఆఫర్లు’
గత ప్రభుత్వంలో పోస్టింగ్‌ల్లో చక్రం
ఆయనది.. కడప జిల్లా! మకాం.. హైదరాబాద్‌లో! సెటిల్మెంట్లు చేసేది.. అమరావతిలో! ప్రభుత్వంలో ఆయనకు ఎలాంటి పదవీ లేదు. అధికారి కూడా కాదు. కానీ ఆర్డీవో, డీఎస్పీ పోస్టింగ్‌లు ఇప్పిస్తానంటూ లాబీయింగ్ చేస్తున్నారు. వచ్చి మాట్లాడుకోవాలని అధికారులకు ‘ఆఫర్లు’ కూడా ఇస్తున్నారు. గత జగన్ ప్రభుత్వంలో కీలక స్థానంలో పనిచేసిన ఓ రిటైర్డ్ ఐఏఎస్‌తో ఆయనకు దగ్గరి బంధుత్వం ఉంది. అప్పట్లో గ్రూప్-1 అధికారుల పోస్టింగ్‌ల్లో చక్రం తిప్పారు. ఇప్పుడు ఆర్డీవో, డీఎస్పీ పోస్టులపై కన్నేశారు. ఈ లాబీయి్‌స్టకు కీలక అధికారులతో సన్నిహిత పరిచయాలున్నాయి.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
స్టీల్‌ప్లాంట్ కావాల్నా? షిప్‌యార్డ్ కావాల్నా? జింకా, బంకా? హెచ్‌పీసీఎల్‌నా? ఏం కావాలి? ఇవన్నీ దేనికి సార్? ఉద్యోగాలు చేయడానికి.. ఇది.. ఓ సినిమాలో కామెడీ సీన్! దాన్ని తలదన్నే ‘రియల్’ సీన్ ఒకటి ఏపీలో నడుస్తోంది. రాష్ట్రంలో ఏ పోస్టు ఎప్పుడు ఖాళీ అవుతుంది? ఎప్పుడు భర్తీ చేస్తారో నయా లాబీయి్‌స్టకు అలా తెలిసిపోతుంటుంది. ఆ పోస్టుకు ఎవరెవరు అర్హులో చూసుకొని సమాచారం పంపిస్తుంటారు. ‘రండి.. వచ్చి మాట్లాడుకోండి..’ అంటూ ఆఫర్లు ఇస్తుంటారు. ఆర్డీవో పోస్టు కావాలా? డీఎస్పీ కావాలా? డీఆర్‌డీఏ కావాలా? డ్వామా కావాలా? ఇంకేం కావాల్నో రిజర్వ్ చేసుకో అంటూ బేరసారాలు మొదలుపెడతారు. పెద్ద పెద్ద ఐఏఎస్ పోస్టుల జోలికి వెళ్లరు. కానీ మధ్య శ్రేణి పోస్టింగ్‌లన్నింటిలో తనదే హవా అంటారు. ఆయన వ్యవహార శైలి, బిల్డప్ చూస్తే అవతలివాళ్లు కచ్చితంగా నమ్మేస్తారు. దానికి తగినట్లుగానే ఉన్నతాధికారులు, మంత్రులు, ఇంకా ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులతో బలమైన లాబీయింగ్ నడిపిస్తుంటారు. ఆ పరిచయాలు చూసిన వారు ఇట్టే పడిపోతుంటారు. ఆయనది కడప జిల్లా. గత జగన్ ప్రభుత్వ హ యాంలో కీలక స్థాయిలో ఉన్న అధికారులను పట్టుకొని పనులు చేయించుకొని గట్టి అనుభవం సంపాదించారు. ఓ రిటైర్డ్ ఐఏఎ్‌సతో దగ్గరి బంధుత్వం కూడా ఉంది. దీంతో గ్రూప్-1 అధికారుల పోస్టింగ్‌ల్లో చక్రం తిప్పారు. తన రేంజ్‌కు కడప సరిపోదనుకొని వ్యాపారాల పేరుతో హైదరాబాద్‌లో మకాం పెట్టారు. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి అమరావతిలో వాలిపోతుంటారు. ఇక్కడే రెండు, మూడు చోట్ల విలాసవంతమైన ఫ్ల్లాట్లు ఉన్నాయి. సెటిల్‌మెంట్లు అన్నీ అక్కడే జరుగుతుంటాయి. తాజాగా ఆర్డీవోలు, డీఎస్పీల ఖాళీలపై ఆయన కన్నుపడింది. రాష్ట్రంలో 25 ఆర్డీవో, 26 డీఎస్పీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందులో కీలకమైనవి ఇప్పిస్తానని, వచ్చి మాట్లాడుకొని రిజర్వ్ చేసుకోవాలంటూ ఆయన మంత్రాంగం మొద లుపెట్టారు. ఇప్పటికే భర్తీ అయిన ఆర్డీవో, డీఎస్సీ పోస్టులను కూడా మార్పించి కోరుకున్న చోట పోస్టింగ్ ఇప్పిస్తానంటూ మరో కొత్త బేరం ప్రారంభించారు. అంటే.. ఎవరైనా ఏదైనా పోస్టు కోరుకుంటే, అందులో ఇప్పటికే ఎవరో ఒక అధికారి పనిచేస్తున్నా, వారిని బదిలీ చేయించి మరీ ఇప్పిస్తానంటూ ఆఫర్లు ఇచ్చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఇటు డిప్యూటీ కలెక్టర్లు, అటు డీఎస్పీల్లో ఇదే హాట్‌టాపిక్‌గా మారింది. ఆయన చెబితే పనులవుతాయా? అని కొందరు.. ఆయన చెప్పారంటే పోస్టు పక్కా అని మరి కొందరు చెబుతున్నారు. ఇంతలా ఉంది ఆయన రేంజ్. ఆయన తన ఫోన్ వాట్సాప్ ఖాతాకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో దిగిన ఫొటోనే డీపీగా పెట్టుకున్నారు.
పోస్టులను కేటగిరీలుగా విభజించి..
గ్రూప్-1 పరీక్షల వివాదం నేపథ్యంలో... నాడు ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపికై ఆర్డీవోలు, డీఎస్పీలుగా పనిచేస్తున్న వారిని నాన్ ఫోకల్ పోస్టులకు బదిలీ చేయాలని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు 25 మంది ఆర్డీవోలు, 26 మంది డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆర్డీవోలను జీఏడీకి, డీఎస్పీలను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ వివాదం ఇప్పుడు ఏ మలుపు తిరుగుతుందో తెలియ దు. ప్రస్తుతానికి ఆ పోస్టులయితే ఖాళీగా ఉన్నాయి. దీనికి తోడు రెగ్యులర్ బదిలీలు కూడా జరిగే అవకాశముంది. రెండేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం ఆర్డీవో, డీఎస్పీలుగా పనిచేస్తున్న వారిని కూడా బదిలీ చేసే అవకాశముంది. కడపకు చెందిన ఈ లాబీయి్‌స్టకు ప్రభుత్వంలోని కీలక అధికారులతో అత్యంత సన్నిహిత పరిచయాలున్నాయి. ఉద్యోగులు, అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు, ఇతర కీలకాంశాలు గురించి ఆయనతో చర్చిస్తుంటారు. ఆయన్ను మధ్యవర్తిగా ఏర్పాటు చేసుకొని మంత్రాంగం నడుపుతున్నవారు కూడా కొందరు ఉన్నారు. జగన్ ప్రభుత్వంలో అదే పనిచేశారు. ఇప్పుడూ అదే దందా నడిపిస్తున్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆర్డీవో, డీఎస్పీ పోస్టులను ఎలాగూ ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంది. ఇందుకు అర్హులైన వారి వివరాలను పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో కీలక పోస్టల్లో పనిచేయాలని అనుకుంటున్నవారు.. ఆర్డీవో, డీఎస్పీలుగా వెళ్లాలని అనుకుంటున్నవారు తమ ప్రయత్నాలు ప్రారంభించారు.
తెలిసిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసి విన్నపాలు ఇస్తున్నారు. ఇదే అదనుగా ఈ లాబీయిస్ట్ తెరమీదకు వచ్చారు. గత నాలుగు రోజులుగా డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ క్యాడర్ అధికారులతో మాట్లాడుతున్నారు. ‘ఏ డివిజన్ కావాలో కోరుకోండి. వచ్చి మాట్లాడుకోండి. డిమాండ్ బాగా ఉంది. కోరుకున్న పోస్టులను ముందుగానే రిజర్వ్ చేసుకోండి’ అని సందేశాలు పంపిస్తున్నారు. పోస్టులను మూడు కేటగిరీలుగా విభజించి పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్‌ల కింద వర్గీకరించారు. ప్రీపెయిడ్ కింద 22 ఆర్డీవో, డీఎస్పీ పోస్టులను చూపిస్తున్నారు. పోస్ట్‌పెయిడ్ కింద పెద ్దగా ప్రాధాన్యం లేని ఆర్డీవో, డీఎస్పీ పోస్టులను చూపిస్తున్నారని తెలిసింది. ప్రీపెయిడ్ కింద బాగా డిమాండ్ ఉన్న పోస్టులు ఉంచి, వాటికి ముందుగా నే టోకెన్ చెల్లింపులు చేసి రిజర్వ్ చేసుకోవాలని ఆయన చెబుతున్నట్టు తెలిసింది. ఈ విషయంలో ప్రభుత్వంలో ఓ కీలక అధికారితో కూడా ఆయన ఫో న్ ద్వారా మాట్లాడించి అభయం ఇప్పిస్తున్నట్లు స మాచారం. అయితే, కొందరు అధికారులు ఆయ న్ను నమ్మవచ్చా? అనిక్రాస్ చెక్ చేసుకుంటున్నారని తెలిసింది.
జీఏడీకి అప్పగించినా...
నిజానికి ఆర్డీవో, డీఎస్పీ పోస్టులు ప్రతిభ, పనితీరు ఆధారంగా భర్తీచేసేవి. వృత్తి పట్ల నిబద్దత, అంకితభావం ఉన్న వారిని గుర్తించి ఆ పోస్టులకు ఎంపిక చేస్తారు. అలాంటి కీలకమైన పోస్టులను అంగడి సరుకుగా మార్చి ఏమాత్రం అంకితభావం, ప్రజాసేవ పట్ల నిబద్దత లేనివారితో భర్తీ చేయించేందుకు లాబీయిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలోనూ ఇలాంటి దందానే జరిగింది. ఇప్పుడూ వారు అదే దందా చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఈ రెండు పోస్టులను తొలుత శాఖాపరంగా భర్తీ చేసేవారు. రాజకీయ ఒత్తిళ్లు, పలుకుబడి ఉన్నవారికి కీలక పోస్టులు ఇస్తున్నారన్న విమర్శలు రావడంతో సర్కారు ఆ బాధ్యతను జీఏడీకి అప్పగించింది. ప్రభుత్వ స్థాయిలో అంటే ముఖ్యమంత్రి కార్యాలయం, జీఏడీ, రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు సమాలోచనలు చేసి సమర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారని భావించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొదట్లో పారదర్శకంగా సాగింది. రానురాను లాబీయి్‌స్టలు ఆ ప్రయత్నాలను నీరుగారుస్తుండటం ఆందోళన కలిగిస్తోందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ల్యాండ్ కేసుల్లోనూ...
కడప జిల్లా లాబీయిస్ట్ రెవెన్యూలో ఓ కీలక అధికారి వద్దకు వచ్చి వెళ్తుంటారు. ఆయన ఇటీవల అనేక ల్యాండ్ కేసులు తీసుకొచ్చి సెటిల్ చేయించినట్లు తెలిసింది. ఆ అధికారితో దిగిన ఫొటోలు కూడా ఆయన అందరికీ చూపిస్తుంటారు. తహశీల్దార్, డిప్యూటీ కలెక్టర్ల క్రమశిక్షణా చర్యల కేసులను దగ్గరుండీ మరీ సెటిల్ చేయిస్తుంటారని తెలిసింది. ఆయన శిష్యుడు అశోక్‌రెడ్డి కూడా పలువురు డిప్యూటీ కలెక్టర్లతో మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. ఆయన ప్రస్తుతం అప్రధాన్య పోస్టుల్లో పనిచేస్తున్న వారితో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. కీలక పోస్టులు కావాలంటే సర్దుబాటు చేస్తామని, అమరావతిలో తమ గురువును కలవాలని ఆయన ఫోన్ నంబర్ ఇస్తున్నారని తెలిసింది.