‘శిక్షణ’లో వైసీపీ వాసన
ABN , Publish Date - Jun 27 , 2026 | 05:18 AM
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు శిక్షణ ఇచ్చే సంస్థ అది. జగన్ ఐదేళ్ల పాలనలో నిర్వీర్యమైన ఆ సంస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.
ఎన్నికల్లో పోటీచేసి ఓడిన అభ్యర్థితో క్లాసులు
జగన్ వీరాభిమాని రిటైర్డ్ ఐఏఎస్‌తో పాఠాల బోధన
కూటమి ప్రభుత్వంపై విషం కక్కే యత్నాలు!
అమరావతి, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు శిక్షణ ఇచ్చే సంస్థ అది. జగన్ ఐదేళ్ల పాలనలో నిర్వీర్యమైన ఆ సంస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. దేశంలో 24వ స్థానంలో ఉన్న ఆ శిక్షణ సంస్థ.. అక్కడ పనిచేసే సిబ్బంది చొరవతో ఇప్పుడు మొదటి స్థానంలోకి వచ్చింది. అత్యధిక మంది ఉద్యోగులు, స్థానిక సంస్థల ప్రతినిధులకు ట్రైనింగ్ ఇస్తూ దూసుకుపోతోంది. ఈ సంస్థకు అమరావతిలో ఐదెకరాల స్థలం కూడా కేటాయించారు. అయితే ఇటీవల ఈ సంస్థలో వైసీపీ వాసనలు వస్తున్నాయన్న ఆరోపణ బలంగా ఉంది. ఈ శాఖలో పనిచేసే ఓ ఉన్నతాధికారి చొరవతో అందులో గెస్ట్ లెక్చరర్లుగా వైసీపీ నేతలు హాజరై తమ ప్రసంగాలు వినిపిస్తున్నారు. గత ప్రభుత్వంలో సీఎం కార్యాలయానికి వీర విధేయుడిగా ఉన్న ఆ ముత్యంలాంటి అధికారి ఆహ్వానంతో.. వైసీపీ నేతగా మారిన ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వచ్చి పాఠాలు బోధించారు. ఆ శాఖలో గతంలో కమిషనర్లుగా పనిచేసిన ఐఏఎస్ అధికారులు ప్రస్తుతం టీడీపీలో ఒకరు, జనసేనలో ఒకరు ఉన్నారు. ప్రస్తుతం అక్కడ పనిచేసే ఓ కమిషనర్ శిక్షణ ఇవ్వడంలో దిట్ట. అయితే వారందరినీ వదిలేసి.. వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి.. జగన్‌కు వీరాభిమాని అయిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో శిక్షణ ఇప్పించడం చర్చనీయాంశమైంది. పైగా ఆయన ఇటీవల విజయవాడ వచ్చినప్పుడు.. అప్పట్లో పనిచేసిన పలువురు సహచరులతో సమావేశమయ్యారన్న ఆరోపణలున్నాయి. అంతేకాదు.. వైసీపీ హయాంలో జగన్ టీంగా ఉన్న సదరు అధికారులతో కలిసి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.