Share News

రాజకీయ వేఢీ

ABN , Publish Date - Oct 15 , 2026 | 12:23 AM

స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ కూసింది.

   రాజకీయ వేఢీ

రిజర్వేషన్ల ఖరారుతో మొదలైన హడావిడి

తొలి విడతగా పుర పోరుకు గ్రీన సిగ్నల్‌

గెలుపు గుర్రాల కోసం పార్టీల అన్వేషణ

వైసీపీలో కనిపించని ఉత్సాహం

బీసీలతో పాటు మహిళలకు ప్రాధాన్యం

నంద్యాల, అక్టోబరు14(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ కూసింది. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర షెడ్యూల్‌ను విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా రాజకీయం వేడెక్కింది. తొలి విడతగా పురుపోరుకు గ్రీనసిగ్నల్‌ ఇవ్వడంతో జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో రాజకీయం ఊపందుకుంది. ఇప్పటికే ఖరారైన రిజర్వేషన్లతో అభ్యర్థుల ఎంపికపై హడావిడి మొదలైంది. కూటమి పార్టీలతో పాటు వైసీపీ సైతం గెలుపు గుర్రాల కోసం అన్వేషణ చేస్తోంది. ఆయా సీట్లను అశించే ఆశావహులు సైతం ఎవరికివారు తమదైన శైలిలో పైరవీలకు తెర లేపారు.

తొలి విడతగా పురు పోరుకు..

తొలి విడతగా పుర పోరుకు శ్రీకారం చుట్టారు. ఇటు కూటమి.. అటు వైసీపీలు సైతం అభ్యర్థుల ఖరారుపై దృష్టి పెట్టారు. ఇప్పటికే నంద్యాల మున్సిపాలిటీ పరంగా కూటమి తరుపున చైర్మన అభ్యర్థిగా టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఏవీఆర్‌ ప్రసాద్‌ను దాదాపు ఖరారు చేశారు. వైసీపీలో భిన్నమైన పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలతో పాటు మహిళలకు ప్రాధాన్యత కల్పించారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. రాజకీయంగా బీసీలతో పాటు మహిళలకు రాజకీయంగా కూటమి మార్క్‌ అన్నట్లైంది.తాజా ఎన్నికల షెడ్యూల్‌ విడుదలతో జిల్లా వ్యాప్తంగా రాజకీయ సందడి మొదలైంది.

ఆరు మున్సిపాలిటీల్లోనూ..

జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లోనూ మున్సిపల్‌ చైర్మన్లలో బీసీలకు-4, జనరల్‌ మహిళకు-1, ఎస్టీ జనరల్‌-1 కేటాయించారు. ఆరు మున్సిపాలిటీల్లో 212 వార్డుల్లో బీసీలకు-72, జనరల్‌ మహిళలకు-59, అన రిజర్వుడ్‌-47, ఎస్టీలకు- 08, ఎస్సీలకు- 26 చొప్పున కేటాయించారు. ఈ లెక్కన212 వార్డుల్లో బీసీలకు 72 స్థానాలు, మహిళలకు 59 స్థానాలు కేటాయించి ఆయా వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించినట్లైంది.

ఒక్కొక్క మున్సిపాలిటీకి..

ఆరు మున్సిపాలిటీలో చైర్మన, చైర్‌పర్సన స్థానాలకు గెలుపు గుర్రాల (అభ్యర్థుల) కోసం కూటమి పార్టీతో వైసీపీ అన్వేషణ మొదలెట్టింది. బుధవారం జిల్లా ఇనచార్జి మంత్రి పయ్యావుల కేశవ్‌, నంద్యాల పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ం ప్రభాకర్‌చౌదరి, మంత్రులు ఎనఎండీ ఫరూక్‌, బీసీ జనార్దనరెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, భూమా అఖిలప్రియ, కోట్ల సూర్య ప్రకాశ రెడ్డి, గిత్తా జయసూర్య, కీలక నాయకులతో కలిసి కూటమి అభ్యర్థుల ఎంపికపై సమీక్షించారు. ఈక్రమంలో ఒక్కొక్క మున్సిపాలిటీకి ముగ్గురి చొప్పున జాబితా సిద్ధం చేసినట్లు తెలిసింది. అధికారికంగా సదరు అభ్యర్థుల జాబితాను త్వరలో ప్రకటించనున్నారని సమాచారం.

ఏవీఆర్‌ ప్రసాద్‌ పేరు ఖరారు?

నంద్యాల మున్సిపాలిటీ చైర్మన అభ్యర్థిగా టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఏవీఆర్‌ ప్రసాద్‌ పేరు దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. మరో టీడీపీ నాయకుడు శివశంకర్‌ యాదవ్‌ పేరు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. నందికొట్కూరు మున్సిపల్‌ చైర్‌పర్సన రేసులో మొల్ల సాబీరున్నీసా, మొల్ల నషీమ్‌, ఎస్‌. నౌషాద్‌, ఆళ్లగడ్డ మున్సిపల్‌ చైర్‌ పర్సన రేసులో షేక్‌ అనీషా, ఎం. శ్రావణి, డోన మున్సిపల్‌ చైర్‌పర్సన రేసులో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, టీఈ శీరీషా, మర్రి వసుధ, కోట్రికే పద్మజ, బేతంచెర్ల మున్సిపల్‌ చైర్మనగా రామాంజినేయులు, జాకీరుల్లా, అరుణ్‌బాబు, ఆత్మకూరు మున్సిపల్‌ చైర్మన రేసులో డాక్టర్‌ గోవిందరాజులు పేర్లను ప్రతిపాదించినట్లు సమాచారం.

ఫ ఊహించని రీతిలో రిజర్వేషన్లు

మొదటి నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్‌, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలతో పాటు మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తామని చెబుతూ వచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే తాజా స్థానిక స్థాల ఎన్నికల్లో బీసీలతో పాటు మహిళలకు గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ ప్రాధాన్యత కల్పించారు. జిల్లాలోని 28 జడ్పీటీసీ స్థానాలతో పాటు 28 ఎంపీపీల్లో 14 చొప్పున మహిళలకు కేటాయించగా అందులో బీసీలకు 7స్థానాలు చొప్పున కేటాయించారు. నంద్యాల జడ్పీ చైర్మన మాత్రం జనరల్‌కు కేటాయించారు. పురు పోరుతో పాటు పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీసీలతో పాటు మహిళల్లో కూటమి పార్టీ రాజకీయ జోష్‌ నింపింది.

కూటమిలో తీవ్ర పోటీ..

తాజాగా స్థానిక సంస్థ ఎన్నికలకు షెడ్యూల్‌ విడదల చేయడంతో జిల్లా వ్యాప్తంగా కూటమి పార్టీల్లో ఆనందోత్సవం మొదలైంది. ఇదే క్రమంలో పలు స్థానాలకు తీవ్ర పోటీ నెలకొంది. కూటమి పొత్తులో భాగంగా బేతంచెర్ల మున్సిపల్‌ చైర్మన పీఠం బీజేపీకి వరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదే క్రమంలో నంద్యాల మున్సిపాలిటీలో వైస్‌ చైర్మన స్థానంతో పాటు 10వార్డు స్థానాలు బీజేపీ కోరినట్లు తెలిసింది. జనసేన సైతం అక్కడక్కడ బలమున్న స్థానాల్లో కొన్నివార్డులు కోరినట్లు సమాచారం. ఇదే క్రమంలో ఆశావహులు సైతం ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధుల వద్దకు క్యూకడుతున్నారు. కొందరైతే తమదైన శైలిలో పైరవీలు మొదలెట్టినట్లు తెలుస్తోంది.

ఈసారి ఆశించిన స్థాయిలో..

కొన్ని రోజులుగా వైసీపీలోనూ స్థానిక సంస్థల ఎన్నికల ఫీవర్‌ మొదలైంది. గతంలో అధికారంలో ఉన్నంత ఉత్సాహంతో పోలిస్తే.. ఈసారి ఆశించిన స్థాయిలో ఎక్కడా కనిపించడం లేదు. పైగా ఆ పార్టీ అధినేత పదేపదే హెచ్చరించినా జిల్లా వ్యాప్తంగా నిస్తేజంగానే పరిస్థితి కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులు, స్థానిక బలాబలాలు, గెలుపు అవకాశాలు, కూటమిలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వైసీపీకి కాస్తా ఉలికిపాటుకు గురి చేస్తోంది.

ఆశావహులతో పాటు..

స్థానిక సంస్థల ఎన్నికల్లో పదవులను ఆశించే ఆశా వహులతో పాటు ఆయా పదవులకు ప్రతిపాదించిన అభ్యర్థులు సైతం నేటి నుంచి నామినేషన ప్రక్రియకు అవసరమైన ధ్రువపత్రాల కోసం ఆయా ప్రాంతాల సంబంధిత కార్యాలయాలకు పరుగులు తీయనున్నారు. గడువు కూడా తక్కువ సమయం ఉండటంతో మరింత ఉత్కంఠ రేపుతోంది. ముఖ్యంగా నేటి నుంచి ఎన్నికల కోడ్‌ అమలు కానుండటతో అందరిలో టెన్షన మొదలైంది.

377 ఎంపీటీసీ స్థానాలకు..

జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 377 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారు గెజిట్‌ను కలెక్టర్‌ రాజకుమారి విడుదల చేశారు. అత్యధికంగా జనరల్‌-183, బీసీలకు-104, ఎస్సీలకు- 79 స్థానాలు, ఎస్టీలకు -11 స్థానాలు కేటాయించారు. ఎస్టీ మహిళలు -5, ఎస్టీ జనరల్‌-6, ఎస్సీ మహిళలు-41, ఎస్సీ జనరల్‌- 38, బీసీ మహిళలు- 54, బీసీ జనరల్‌- 50, జనరల్‌ మహిళలు- 86, జనరల్‌- 97 ఎంపీటీసీల స్థానాల చొప్పున జిల్లాలో కేటాయించారు.

మున్సిపాలిటీల వారీగా

నంద్యాల( బీసీ జనరల్‌), వార్డులు :52

నందికొట్కూరు(బీసీ మహిళ), వార్డులు: 32

డోన ( జనరల్‌ మహిళ), వార్డులు : 36

ఆళ్లగడ్డ( బీసీ, మహిళ), వార్డులు: 32

ఆత్మకూరు(ఎస్టీ జనరల్‌), వార్డులు : 32

బేతంచెర్ల( బీసీ జనరల్‌), వార్డులు : 28

Updated Date - Oct 15 , 2026 | 12:23 AM