Share News

జగన్‌ ఫ్యామిలీ రక్త చరిత్ర ఇదా!!

ABN , Publish Date - May 23 , 2026 | 04:51 AM

వైసీపీ అధినేత జగన్‌ గురువారం ప్రెస్‌మీట్‌ పెట్టి.. ‘‘నేను మంచోడిని కాబట్టే మా తాత(రాజారెడ్డి)ను చంపినవారు గుండెలపై చేయివేసుకుని నిద్రపోతున్నారు.

జగన్‌ ఫ్యామిలీ రక్త చరిత్ర ఇదా!!

  • పార్థసారథి వెల్లడించిన వాస్తవాలపై చర్చోపచర్చలు

  • 1995 తర్వాతి జనరేషన్‌లో ఆసక్తిగా మారిన పేర్ల వ్యాఖ్యలు

  • కొంపముంచావన్నా.. జగన్‌ తీరుపై సీనియర్ల ఆవేదన

కడప, మే 22(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత జగన్‌ గురువారం ప్రెస్‌మీట్‌ పెట్టి.. ‘‘నేను మంచోడిని కాబట్టే మా తాత(రాజారెడ్డి)ను చంపినవారు గుండెలపై చేయివేసుకుని నిద్రపోతున్నారు. నేను చెడ్డోడిని అయితే వాళ్లు బతికి ఉండేవాళ్లా? వారిని ఏమీ చేయనని భరోసా ఇస్తున్నా. గంజాయి వనంలాంటి రాజకీయాల్లో నేను తులసి మొక్కను. చంద్రబాబు హత్యలు, కుట్రలతో రాజకీయాలు చేస్తుంటే.. నేను విశ్వసనీయతతో రాజకీయం చేస్తున్నా. దీనికి గర్వపడుతున్నా.’’ అన్న వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. రాజారెడ్డి హత్యలో హంతకులను వదిలేసినట్లు జగన్‌ చెప్పడంపై కడపవాసులు విస్మయం వ్యక్తం చేశారు. దీనికితోడు.. రాజారెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొన్న పేర్ల పార్థసారఽథిరెడ్డి ‘జగన్‌ కుటుంబ రక్త చరిత్ర’ను ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ వేదికగా చీల్చిచెండాడారు. ‘జగన్‌ నరరూప రాక్షసుడు.’ అని స్పష్టం చేశారు. పులివెందులలో ఏం జరిగిందో చాలామందికి తెలియని సంచలనాత్మక విషయాలను పూసగుచ్చినట్టు వివరించారు. దీంతో ఈ వ్యవహారం శుక్రవారం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ‘‘జగన్‌ ఫ్యామిలీ రక్త చరిత్ర ఇదా!’’ అంటూ.. ప్రతి ఒక్కరూ చర్చించుకున్నారు. 1995 తరువాతి జనరేషన్‌కు రాజారెడ్డి గురించి తెలియదు. అందుకే జగన్‌ రాజారెడ్డి, వైఎస్సార్‌, వివేకా హత్యల గురించి మాట్లాడారు. తాను అమాయకుడినంటూ ప్రస్తుత తరానికి చెప్పాలని ప్లాన్‌ చేశారు. అయితే, ఇది బెడిసి కొట్టింది. పేర్ల పార్థసారథిరెడ్డి చెప్పిన నిజాలతో వైసీపీ శ్రేణులు సైతం విస్తుపోయాయి. సానుభూతి కోసం ఏదో ప్లాన్‌ చేస్తే కథ అడ్డం తిరిగిందంటూ వారు తల పట్టుకున్నారు.


నేటి తరానికి తెలియదనే!

రాయలసీమ జిల్లాల్లో వైఎస్సార్‌ కుటుంబం ఫ్యాక్షన్‌ గురించి 1990కి ముందు పుట్టిన అందరికీ బాగా తెలుసు. 1995 తరువాత పుట్టిన వారికి వీరి ఆరాచకాల గురించి పెద్దగా తెలియదు. అందుకే జగన్‌.. తనను తాను శాంతికాముడిగా ప్రకటించుకున్నారు. కానీ, పార్థసారఽథిరెడ్డి జగన్‌ కుటుంబీకుల రక్తచరిత్రను కళ్లకు కట్టినట్లు వివరించారు. 1995కు మునుపు పార్థసారథిరెడ్డి వర్గీయులు రాజారెడ్డి వర్గంలోనే ఉండేవారు. వారి విధానాలు ఎదిరించి కొందరు బయటికి వచ్చి టీడీపీకీ మద్దతుగా నిలిచారు. ఆ ఎన్నికల్ల్లోనే టీడీపీ వేంపల్లె, వేములలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానంతో పాటు లింగాల జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుంది. దీనిని రాజారెడ్డి కుటుంబం జీర్ణించుకోలేక పోయింది.

అప్పటి విభేదాల కారణంగా పార్థసారథిరెడ్డిని చంపేందుకు ప్రయత్నించారు. చివరికి రాజారెడ్డిని తన వర్గం లేపేసిందని పార్థసారథిరెడ్డి వివరించారు. రాజారెడ్డి హయాంలో పులివెందులలో జరిగిన హత్యలు, మంగంపేట మైనింగ్‌ కోసం చేసిన హత్యలు, రైల్వేకోడూరులో కోళ్ల పీకలు కోసినట్టుగా కోసి చంపడం గురించి పార్ధసారథిరెడ్డి చెప్పారు. 1998లో రాజారెడ్డి హత్యకు గురికావడంతో ఆయన చేసిన అరాచకాలు తర్వాత తరానికి పెద్దగా తెలియవు. ఈ క్రమంలో జగన్‌ కుటుంబం, వారి రక్తచరిత్రను పేర్ల వివరించ డంతో.. వీళ్లకు ఇంత రక్తచరిత్ర ఉందా అంటూ నేటి తరం చర్చించుకునే పరిస్థితి వచ్చింది.


కొంప ముంచావన్నా!

‘‘జగన్‌.. పనికిరాని స్ర్కిప్ట్‌ చదివి ఇప్పటిదాకా నవ్వులపాలు అవుతూ వస్తున్నాం. అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులు అన్నారు. ఇప్పుడు మావిగన్‌ అంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద మైన్‌సగా మారాయి. వీటిపై సోషల్‌ మీడియాలో ఘోరంగా సెటైర్లు పడుతున్నాయి. ఆ విషయం గురించి జనం మరిచారు అనుకునేలోపే ఎప్పుడో జరిగిన రాజారెడ్డి హత్య గురించి ‘నేను మంచోన్ని’ అని జగన్‌ ప్రస్తావించారు. మళ్లీ జనంలో అభాసుపాలయ్యారు.’’ అని వైసీపీ నేతలే వాపోతున్నారు. ‘కొంప ముంచావన్నా..’ అంటూ సీనియర్‌ నాయకులు సైతం ఆవేదన వ్యక్తం చేశారు.

అసలు చరిత్ర తెలిసింది!

జగన్‌ చేసిన ‘శాంతి’ వచనాల మాట ఎలా ఉన్నా.. తన తాత రాజారెడ్డి హత్య గురించి చేసిన వ్యాఖ్యల అనంతరం.. దీనికి ముందు.. తర్వాత ఏం జరిగిందనే విషయాలు స్థానికంగా చర్చకు దారితీశాయి. ముఖ్యంగా రాజారెడ్డి హత్యకు కారణాలను పేర్ల పార్థసారథిరెడ్డి వెల్లడించడంతో మరింత ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో సూట్‌కేసు బాంబు, పరిటాల రవి హత్య, జమ్మలమడుగుకు చెందిన శివారెడ్డి హత్య వెనుక రాజారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, జగన్‌రెడ్డి ఉన్నట్లు ఆరోపించడంతో ఆయా అంశాలపై పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. నిజానికి ఈ జనరేషన్‌కు మాజీ మంత్రి గుండ్లకుంట శివారెడ్డి హత్య, రాజారెడ్డి హత్య, కోర్టు నుంచి వస్తుండగా పార్థసారథిరెడ్డిని చంపేందుకు సూట్‌కేసు బాంబు పెట్టిన విషయాలు తెలియదు. ఇప్పుడు జగన్‌ వ్యాఖ్యలతో పెద్ద చర్చగా మారాయి. ఈ జనరేషన్‌కు కూడా జగన్‌ ‘అసలు చరిత్ర’ తెలిసిపోవడం గమనార్హం.

Updated Date - May 23 , 2026 | 04:54 AM