Share News

ఇదీ రాజారెడ్డి రక్తచరిత్ర

ABN , Publish Date - May 26 , 2026 | 04:28 AM

జగన్‌ నటనతో కూడిన వ్యాఖ్యల పుణ్యమా అని తాత రాజారెడ్డి రక్తచరిత్ర మరోసారి చర్చనీయాంశమైంది. అరాచకాలు, దౌర్జన్యాలు, దొమ్మీలు, దోపిడీలు, హత్యా రాజకీయాలతో నిండిన ఈ చరిత్ర రాజారెడ్డి రాక్షసత్వానికి దాఖలా.

ఇదీ రాజారెడ్డి రక్తచరిత్ర

  • దొమ్మీలు, దోపిడీలు, హత్యలతో కోట్లలో ఆస్తులు

  • దౌర్జన్యాలు, హింసే ఆయన రాజకీయం

  • పులివెందులలో అంతేలేని అరాచకాలు

  • ఊసన్నను సజీవదహనం చేయించారు

  • రిగ్గింగ్‌, అడ్డుపడిన వ్యక్తులపై కాల్పులు

  • జగన్‌ తాతపై కేసుల చిట్టా పెద్దదే..

(అమరావతి, ఆంధ్రజ్యోతి)

జగన్‌ నటనతో కూడిన వ్యాఖ్యల పుణ్యమా అని తాత రాజారెడ్డి రక్తచరిత్ర మరోసారి చర్చనీయాంశమైంది. అరాచకాలు, దౌర్జన్యాలు, దొమ్మీలు, దోపిడీలు, హత్యా రాజకీయాలతో నిండిన ఈ చరిత్ర రాజారెడ్డి రాక్షసత్వానికి దాఖలా. రాజకీయ నాయకులంటే నిరసనలు, ఎన్నికలకు సంబంధించిన కేసులు ఉంటాయి. కానీ హత్యలు, హత్యాయత్నాలు, ఎన్నికల్లో హింస, ప్రభుత్వ అధికారులపై దాడులు, పోలీసులపై దాడులు తదితర ఘటనల్లో రాజారెడ్డిపై లెక్కకుమించి క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. మంగంపేట మైనింగ్‌ కోసం బీసీ వర్గానికి చెందిన వెంకట నరసయ్య హత్య, పులివెందులలో ఎరుకల కాలనీ లూటీ, ఎస్టీ వర్గానికి చెందిన ఊసన్న హత్య లాంటివి చంబల్‌ లోయ ఘోరాలను తలపిస్తాయి. రౌడీలు, దొంగలు, బందిపోట్లు, నాటుసారా తయారీ దారులే అనుచరులుగా కోట్లకు పడగలెత్తారు. తన కుమారుడు వైఎస్‌ రాజకీయంగా ఎదిగాక మరింతగా ఆయన రెచ్చిపోయారు. బ్రిటిషర్ల హయాంలో పాలేర్లుగా పనిచేసిన రాజారెడ్డి కుటుంబం క్రైస్తవ మిషనరీల సొమ్ముతిని బతికింది. ఆ తర్వాత ముఠాకక్షల సంస్కృతిని వంటబట్టించుకుని, ఎరుకల కాలనీపై దోపిడీకి తెగబడ్డారు. ఈ వివరాలను టీడీపీ నేతలు సేకరించారు. మా తాత మంచోడు.. నేను అమాయకుడిని అంటూ జగన్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో రాజారెడ్డి రక్త చరిత్ర మరోమారు చర్చనీయాంశమైంది. ఆయనపై అప్పట్లో నమోదైన కొన్ని కేసులు పరిశీలిస్తే...


నెత్తుటి మరకలు..

  • కడప 1టౌన్‌ పోలీసు స్టేషన్లో 1975 జూలై 15న మొదటి హత్య కేసు నమోదైంది. తనను నమ్మి మంగంపేట బెరైటీస్‌లో భాగస్వామ్యం ఇచ్చిన బీసీ వర్గానికి చెందిన వెంకట నరసయ్యను వైఎస్‌ రాజారెడ్డి... వైఎస్‌ జార్జి రెడ్డి మరో ఐదుగురితో కలిసి హత్య చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌ నెం:144/1975 కింద ఈ కేసురిజిస్టర్‌ అయింది. ఇదే కేసులో ’మిసా’ కింద కేసులు నమోదవడం రాజారెడ్డి నేర తీవ్రతకు నిదర్శనం.

  • రహంతుల్లా అనే వ్యక్తి గనిలో బలవంతంగా బాక్సైట్‌ తవ్వేందుకు అక్రమంగా చొరబడినట్లు ఫిర్యాదు అందడంతో ఓబులవారి పల్లె పోలీసు స్టేషన్లో 1989 జనవరి 6న ఎఫ్‌ఐఆర్‌ 02/1989 కింద దురాక్రమణ కేసు నమోదైంది.

  • ఓబులవారి పల్లె పీఎ్‌సలో 1991 అక్టోబరు 13న రైల్వే ఆస్తులు ధ్వంసం చేసిన ఘటనలో రాజారెడ్డిపై ఎఫ్‌ఐఆర్‌ 67/1991 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

  • ఓబులవారి పల్లె పీఎ్‌సలో 1992 ఏప్రిల్‌ 8న గనుల కార్యాలయంలోకి దౌర్జన్యంగా ప్రవేశించి ప్రభుత్వ ఆస్తి ధ్వంసం చేసినందుకు గానూ క్రైమ్‌ నెంబర్‌ 18/1992 కింద ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌ అయింది.

  • ఓబులవారి పల్లె పీఎ్‌సలో 1992 అక్టోబరు 27న బారైట్స్‌ అక్రమంగా తవ్వేందుకు సిబ్బందిని బెదిరించినట్లు కేసు నమోదైంది.

  • కోడూరు పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేసిన ఘటనలో రాజారెడ్డి, మరికొందరిపై 1992 అక్టోబరు 11న ఎఫ్‌ఐఆర్‌ 97/1992 రిజిస్టర్‌ అయింది.

  • పెద్దముడియం పీఎస్‌ పరిధిలోని చిన్నముడియం గ్రామంలో పోలింగ్‌ తర్వాత, ఎల్‌. వెంకట్రామిరెడ్డి అనే వ్యక్తిపై కాల్పులు జరిపి హత్య చేసినట్లు 1989 నవంబరు 22న ఎఫ్‌ఐఆర్‌ 34/1989 నమోదైంది.


  • పులివెందులలోని ఎరుకల కాలనీ, నగరిగుట్ట ప్రాంతాల్లో 1990 ఫిబ్రవరి 16న దోపిడీలు, ఇళ్ల దహనాలు, బెదిరింపులకు పాల్పడిన ఘటనలో రాజారెడ్డిపై స్థానిక పోలీసు స్టేషన్‌లో పలు ఐపీసీ సెక్షన్లతో పాటు ఎస్సీ/ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు రిజిస్టర్‌ చేశారు. స్థానిక పోలీసుల్ని సైతం రాజారెడ్డి కుటుంబం బెదిరించడంతో కేసు సీఐడీకి బదిలీ అయింది.

  • పులివెందులలో 1991 నవంబరు 10న టీడీపీ కార్యాలయంపై దాడి, కార్యకర్తలను భయబ్రాంతులకు గురి చేసిన ఘటనలో రాజారెడ్డిపై ఎఫ్‌ఐఆర్‌ 90/1991 నమోదైంది.

  • అక్రమంగా నిల్వ చేసిన బాంబులు పేలిన ఘటనలో కోడూరు పోలీసు స్టేషన్‌లో 1995 మార్చి 8న రాజారెడ్డిపై క్రైమ్‌ నంబర్‌ 38/1995కింద ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌ అయింది.

  • కోడూరు పట్టణంలో 300మంది అనుచరులతో కడప జిల్లా ఎస్పీపై దాడికి ప్రయత్నించిన వ్యవహారంలో రాజారెడ్డిపై కోడూరు పోలీసుస్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ 57/1996 నమోదైంది.

  • పులివెందుల సర్కిల్‌ ఆఫీసులో 100 మంది అనుచరులతో కలిసి సీఐపై దాడి చేసిన ఘటనలో రాజారెడ్డిపై 1998 మే 17న కేసు 48/1998 రిజిస్టర్‌ అయింది.

  • పంచాయతీ ఎన్నికల్లో ఫ్యాక్షన్‌ హింసకు పాల్పడిన ఆరోపణలపై రాజారెడ్డితో పాటు మరో 9మందిపై పులివెందుల పట్టణ పోలీసులు 1970లో కేసు 23/1970 నమోదు చేశారు.

Updated Date - May 26 , 2026 | 05:41 AM