Share News

మద్యం సీసా లేబుల్‌ పట్టించింది!

ABN , Publish Date - Apr 13 , 2026 | 06:26 AM

పల్నాడు జిల్లాలో కలకలం రేపిన చీమకుర్తి న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు.

మద్యం సీసా లేబుల్‌ పట్టించింది!

  • న్యాయవాది హత్య కేసును ఛేదించిన పోలీసులు

చిలకలూరిపేట, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లాలో కలకలం రేపిన చీమకుర్తి న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్య జరిగిన ప్రదేశంలో పడి ఉన్న మద్యం సీసాపై లేబుల్‌ ఆధారంగా దాన్ని ఎక్కడ కొనుగోలు చేశారో గుర్తించారు. ఆ దుకాణం వద్దకు వెళ్లి ఆరా తీయగా మద్యం కొనుగోలు సమయంలో ఫోన్‌ పే ద్వారా చెల్లింపులు జరిగాయని తేలింది. డబ్బు చెల్లించిన ఫోన్‌ నంబరు ఆధారంగా హంతకులను గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. చిలకలూరిపేట రూరల్‌ పోలీస్ స్టేషన్ లో ఆదివారం రాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో నరసరావుపేట డీఎస్పీ ఎం. హనుమంతరావు ఈ కేసు వివరాలను వెల్లడించారు. న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్‌ హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు. వారిలో ఒకరు నరసరావుపేటలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఉసర్తి వెంకటకోటయ్య కాగా మరొకరు పోలీసు శాఖ ఉద్యోగులకు డ్రైవర్‌గా వ్యవహరిస్తున్న తాత్కాలిక ఉద్యోగి కొండారెడ్డి శ్రీనివాసరావు. వెంకటకోటయ్య, హరిప్రసాద్‌ ఇద్దరూ దగ్గరి బంధువులు. అక్రమ సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. న్యాయవాది భార్యతో వెంకట కోటయ్యకు వివాహేతర సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్నారు.

Updated Date - Apr 13 , 2026 | 06:53 AM