National Emblem Controversy: జాతీయ చిహ్నానికి ఆర్‌ఎస్ఎస్ నిక్కరు
ABN , Publish Date - Jan 10 , 2026 | 05:54 AM
జాతీయ చిహ్నంలో మార్పులు, వివాదాస్పద నినాదాలతో రూపొందించిన పౌరహక్కుల సంఘం మహాసభల ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు.
పౌర హక్కుల సంఘం సభల ఫ్లెక్సీపై ఫిర్యాదు
తిరుపతి(నేరవిభాగం), జనవరి 9(ఆంధ్రజ్యోతి): జాతీయ చిహ్నంలో మార్పులు, వివాదాస్పద నినాదాలతో రూపొందించిన పౌరహక్కుల సంఘం మహాసభల ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు. కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. తిరుపతిలో శని, ఆదివారాల్లో పౌరహక్కుల సంఘం రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. సంఘం కార్యకర్తలు గురువారం అర్ధరాత్రి తిరుపతిలోని కొన్ని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇందులో... జాతీయ చిహ్నంలోని ధర్మపీఠానికి ఆర్‌ఎస్ఎస్ నిక్కర్ తొడిగినట్లు చిత్రీకరించారు. ‘హేతువాదులను, ప్రజాస్వామిక వాదులను హత్య చేస్తున్న హిందూ మతోన్మాదులను శిక్షించాలి’ అని మరో ఫ్లెక్సీలో రాశారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో పోలీసులు రంగంలోకి దిగి ఫ్లెక్సీలను తొలగించారు. పౌర హక్కుల సంఘం నేత క్రాంతి చైతన్యను, పబ్లిషర్ దుగ్గినేని మోహన్ కృష్ణను శుక్రవారం అరెస్టు చేశారు. ర్యాలీకి, సభలకు అనుమతి తీసుకోలేదని తిరుపతి డీఎస్పీ ప్రసాద్ వెల్లడించారు.