రావణ్ ఫోన్‌లో ఏముంది?
ABN , Publish Date - Jul 09 , 2026 | 03:46 AM
హిందూమతంపై దూషణలు... డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టార్గెట్ గా వివాదాస్పద ప్రసంగాలు.. నిషేధిత మావోయిస్టులకు మద్దతుగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు...
డబ్బులు ఎలా సంపాదిస్తున్నారు?
కీలకాంశాలపై పోలీసుల దృష్టి
ఫోన్‌లో డేటా డిలీట్ చేసిన యూట్యూబర్
ఫోరెన్సిక్‌కు పంపి రికవరీ చేసిన పోలీసులు
ఆ ఫోన్‌లో వివాదాస్పద ‘వ్యక్తిగత’ వీడియోలు?
ప్రతినెలా లక్షల్లో ఆదాయం
ఖాతాలు ఫ్రీజ్ చేయాలని పోలీసుల లేఖ
(కాకినాడ - ఆంధ్రజ్యోతి)
హిందూమతంపై దూషణలు... డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టార్గెట్ గా వివాదాస్పద ప్రసంగాలు.. నిషేధిత మావోయిస్టులకు మద్దతుగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు... ఇప్పుడు ‘ఉపా’ కేసులో అరెస్టయిన బచ్చలకూరి జోసఫ్ అలియాస్ ‘ప్రశ్న’ రావణ్ నేపథ్యం, కార్యకలాపాలపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఆయన ఎలా డబ్బు సంపాదిస్తున్నారు? ఫోన్‌లో ఏముంది? అనే అంశంపై దృష్టి సారించారు. జోసెఫ్ రావణ్‌ను ఈనెల 1న కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పిఠాపురానికి తరలించి కేసు నమోదు చేశారు. అదేరోజు రాత్రి పిఠాపురం మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చగా రావణ్ రిమాండ్‌ను తిరస్కరించిన న్యాయాధికారి బెయిల్ మంజూరు చేశారు. 2వ తేదీన వేరే కేసులో సర్పవరం పోలీసులు రావణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందే ఆయన తన ఫోన్‌లో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేసేశారు. అరెస్ట్ సమయంలో పోలీసులు ఆ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దానిని అమరావతిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపారు. అక్కడ నిపుణులు ఫోన్‌లో డిలీట్ చేసిన కొన్ని వీడియోలు, ఇతర డేటాను కొంతవరకు పునరుద్ధరించ గలిగారు. ఈ క్రమంలో డిలీట్ చేసిన వీడియోల్లో పలు కీలక ఆధారాలు పోలీసులకు లభించాయి. అందులో కొన్ని ‘వ్యక్తిగత’ వీడియోలనూ గుర్తించినట్లు తెలిసింది. ఈ వీడియోల ద్వారా బెదిరింపులు/బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతూ లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. వాట్సాప్ కాల్స్, చాటింగ్ వివరాలను కూడా రికవరీ చేసే ప్రయత్నంలో ఉన్నారు. జోసెఫ్ రావణ్ చేతిలో మోసపోయిన, బెదిరింపులకు గురైన బాధిత మహిళలు ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని కాకినాడ జిల్లా పోలీసులు కోరుతున్నారు.
నెలకు రూ.లక్షల్లో ఆదాయం...
యూట్యూబ్‌లో ‘ప్రశ్న’ పేరుతో రావణ్ కొన్నేళ్లుగా వివాదాస్పద వీడియోలు చేస్తున్నారు. ముఖ్యంగా హిందూమతాన్ని కించపరచడం, హిందూ దేవుళ్లను తూలనాడడం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసుకుని కించపరిచే వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు, బూతులతో అనేక వీడియోలు పోస్టు చేశారు. ఈ తరహా వీడియోలకు సహజంగానే వీక్షకుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో యూట్యూబ్ ఆదాయం గడచిన కొన్ని నెలలుగా పెరిగినట్లు పోలీసులు గుర్తించారు. రావణ్ నెలకు యూట్యూబ్ నుంచే సరాసరి రూ.లక్షన్నర వరకు వస్తోందని అంచనా వేస్తున్నారు. ఇక... వ్యక్తిగత వీడియోల ద్వారా బెదిరింపుల ద్వారానూ లక్షల్లో సంపాదిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రావణ్‌కు చెందిన ఐసీఐసీఐ, ఎస్ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయాలని ఆ బ్యాంకులకు పోలీసులు లేఖలు రాశారు. కాగా, రావణ్ తండ్రి విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో సీ అండ్ డబ్ల్యూ విభాగంలో సీనియర్ టెక్నిషియన్‌గా పనిచేసి ఐదేళ్ల క్రితమే పదవీవిరమణ చెందారు. ప్రస్తుతం విజయవాడ రైల్వేస్టేషన్‌లో టిమ్స్ ద్వారా అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో ప్రయాణికులకు టికెట్లు కొడుతున్నట్టు తెలిసింది.