AP High Court: రవికుమార్‌తో పోలీసుల కుమ్మక్కు!
ABN , Publish Date - Jan 07 , 2026 | 03:13 AM
తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీకి సంబంధించి నమోదైన కేసును బలహీనపరిచే కుట్రలో భాగస్వాములైన పోలీసు అధికారుల పై శాఖపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది..
కేసును బలహీనపరచడంలో భాగస్వామ్యం
వారిపై శాఖాపరమైన చర్యల అవసరం ఉంది
‘పరకామణి’ కేసులో హైకోర్టు
అమరావతి, జనవరి 6(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీకి సంబంధించి నమోదైన కేసును బలహీనపరిచే కుట్రలో భాగస్వాములైన పోలీసు అధికారుల పై శాఖపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. సీఐడీ, ఏసీబీ దాఖలు చేసిన నివేదికలను పరిశీలిస్తే, నిందితుడు రవికుమార్ తదితరులతో కొందరు పోలీసు అధికారులు కుమ్మక్కయ్యారని స్పష్టమౌతుందని పేర్కొంది. ఉద్దేశపూర్వకంగానే సరైన సెక్షన్లు నమోదు చేయలేదని తెలిపింది. ఈ నేపఽథ్యంలో పరకామణి చోరీ కేసును లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోవడం మినహా సరైన సెక్షన్లు నమోదు చేయకపోవడం, ఇతర అంశాల పై చట్ట ప్రకారం ముందుకెళ్లవచ్చని పేర్కొంది. ఆదాయానికి మించి నిందితుడు రవికుమార్, కుటుంబ సభ్యులు సంపాదించిన ఆస్తుల వ్యవహారంపై చట్ట ప్రకారం ముందుకెళ్లే స్వేచ్ఛ సీఐడీ, ఏసీబీకి ఉందని తెలిపింది. మరోవైపు హుండీ సీలింగ్, రవాణా, లెక్కింపు విషయంలో తక్షణం చేపట్టనున్న సంస్కరణలకు సంబంధించి టీటీడీ ఈవో సమర్పించిన నివేదికపై తాము సంతృప్తిగా లేమని వ్యాఖ్యానించింది. పరకామణి సేవ కోసం స్వచ్ఛందంగా వచ్చే భక్తులను అమానవీయ పద్ధతిలో తనిఖీలు చేసే విధానాన్ని తప్పించి, ప్రత్యామ్నాయ పద్ధతిని తీసుకొచ్చే విషయమై, నివేదికలో ప్రస్తావన లేదని తెలిపింది. తనిఖీ చేయడంపై తమకు అభ్యంతరం లేదని భక్తులు చెప్పినప్పటికీ, ఇది మనిషి గౌరవానికి సంబంధించిందని గుర్తు చేసింది. ఈ వ్యవహారం రాజ్యాంగంలోని అధికరణ 21 పరిధిలోకి వస్తున్నందున, భక్తులు సైతం ఆ హక్కును వదులుకోలేరని తేల్చిచెప్పింది. అమానవీయ విధానంలో తనిఖీలు చేయడం నిలిపివేయలేని పరిస్థితి ఉంటే, పరకామణిలో భక్తుల సేవలను నిలిపివేస్తూ ఉత్తర్వులిస్తామని టీటీడీని హెచ్చరించింది. కానుకల లెక్కింపు కోసం టేబుళ్లు ఏర్పాటు చేయాలని కోర్టు చేసిన సూచనల విషయంలో, నివేదికలో ఎలాంటి ప్రస్తావన లేదని గుర్తు చేసింది. ఈ రెండు అంశాల పై స్పష్టత తీసుకొని, కోర్టు ముందుకు రావాలని టీటీడీ తరఫు న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు.
కేసు నేపథ్యం...: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరకామణిలో జరిగిన చోరీకి సంబంధించి (వైసీపీ హయాంలో) నమోదైన కేసును టీటీడీ బోర్డు తీర్మానం, ఈవో అనుమతి లేకుండానే 2023 సెప్టెంబరు 9న లోక్ అదాలత్ వద్ద ఏవీఎ్‌సవో వై.సతీశ్‌కుమార్... నిందితుడు రవికుమార్‌తో రాజీ చేసుకున్న వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. అలాగే పరకామణిలో చోరీకి పాల్పడిన రవికుమార్, ఆయన కుటుంబసభ్యుల స్థిర-చర ఆస్తుల పై లోతైన దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశించింది. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు రాగా, పరకామణిలో సంస్కరణలకు సంబంధించి తక్షణ, శాశ్వత ప్రణాళికలు రూపొందించాలని టీటీడీని నిర్దేశించింది. సేవ పేరుతో కానుకల లెక్కింపునకు భక్తులను టీటీడీ ఆహ్వానిస్తోందని, వచ్చిన భక్తుల లుంగీలు ఊడదీసి డ్రాయర్ల పై సోదాలు నిర్వహించడం అమానవీయ విధానమని పేర్కొంది. స్వామివారికి వచ్చే కానుకలను అంచులు ఉన్న టేబుళ్లపై పోసి, లెక్కించే విధానాన్ని తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించింది.
కానుకలు పరకామణికి తరలింపు, వాటిని వేరు చేసి లెక్కించే విధానాన్ని ఆధునికీకరించే విషయంలో తగిన సూచనలు, సలహాలతో తమ ముందుకు రావాలని టీటీడీని ఆదేశించింది. ఈ పిటిషన్ మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. పరకామణిలో చేపట్టనున్న తక్షణ సంస్కరణల పై టీటీడీ ఈవో సమర్పించిన నివేదికను పరిశీలించామని, తాము చేసిన సూచనలను టీటీడీ పరిగణనలోకి తీసుకోలేదని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. టీటీడీ తరఫు స్టాండింగ్ కౌన్సిల్ శ్రీనివాసబాబా స్పందిస్తూ... కోర్టు చేసిన సూచనలను టీటీడీ ఈవో దృష్టికి తీసుకెళ్లి ఆయనతో చర్చిస్తానన్నారు. ఆ వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు.