పోలీసులే గంజాయి స్మగ్లర్లు..!
ABN , Publish Date - Mar 19 , 2026 | 05:12 AM
గంజాయిపై ఉక్కుపాదం మోపాల్సిన పోలీసులే.. కాసులకు కక్కుర్తిపడ్డారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
కారులో తరలిస్తూ అడ్డంగా దొరికిన కానిస్టేబుళ్లు
దాకమర్రి వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి
విశాఖపట్నం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): గంజాయిపై ఉక్కుపాదం మోపాల్సిన పోలీసులే.. కాసులకు కక్కుర్తిపడ్డారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కారులో గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో మంగళవారం అర్ధరాత్రి దాటాక భీమిలి పోలీస్ స్టేషన్ పరిధి దాకమర్రి ఫార్చ్యూన్ లేఅవుట్ వద్ద సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కాపుకాశారు. అయితే అక్కడ వారిని చూసి పారిపోయేందుకు యత్నించడంతో వెంబడించి పట్టుకున్నారు. వారి నుంచి ఎనిమిది కిలోల గంజాయితోపాటు కారు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విజయనగరం జిల్లా వేపాడ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బీంపల్లి రాంబాబు, కొత్తవలస పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ ఇటికర్లపల్లి సతీశ్, గతంలో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా పనిచేసి, గంజాయి కేసుల్లో పట్టుబడి ఉద్యోగం కోల్పోయిన ఎస్.కోట మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన ఈతలపాక శివప్రసాద్ , ఎస్.కోటకు చెందిన రియల్‌ఎస్టేట్ వ్యాపారి కాండ్రపు గోపి, శ్రీకాకుళం జిల్లా హిరమండలం పాడలి గ్రామానికి చెందిన పీట్ల శివకృష్ణగా గుర్తించారు. వారిని భీమిలి పోలీసులకు అప్పగించగా.. కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు.
జైల్లో పరిచయం.. గంజాయి అమ్మకానికి సహకారం
కానిస్టేబుల్ భీంపల్లి రాంబాబు.. 2022లో దొంగతనం కేసుతోపాటు గంజాయి రవాణా కేసులో జైలుకు వెళ్లాడు. ఆ సమయంలో గంజాయి రవాణా కేసులో పట్టుబడి జైలుశిక్ష అనుభవిస్తున్న ఏపీఎస్పీ మాజీ కానిస్టేబుల్ శివప్రసాద్‌తో పరిచయం ఏర్పడింది. గంజాయి రవాణాకు పరస్పరం సహకరించుకోవాలని వారిద్దరూ అవగాహనకు వచ్చారు. జైలు నుంచి వచ్చిన రాంబాబు సస్పెన్షన్ ఎత్తివేయించుకుని వేపాడ పోలీస్ స్టేషన్‌లో విధుల్లో చేరాడు. ఈ క్రమంలో ఎస్.కోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటుచేసిన చెక్‌పోస్టులో డ్యూటీ వేయడంతో ఈనెల 14న ఉదయం ఒక వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా ఆపేందుకు యత్నించాడు. ఆ వ్యక్తి భయంతో బ్యాగ్ విసిరేసి పరారయ్యాడు. రాంబాబు దాన్ని పరిశీలించగా ఎనిమిది గంజాయి ప్యాకెట్లు లభించాయి. వాటిని చెక్‌పోస్ట్ సమీపంలో దాచిపెట్టాడు. తనకు రిలీవర్‌గా డ్యూటీకి వచ్చిన కానిస్టేబుల్ సతీశ్‌కు విషయం చెప్పాడు. శివప్రసాద్ ద్వారా ఈ గంజాయిని విక్రయిస్తే డబ్బులు వస్తాయని చెప్పి అతన్ని ఒప్పించాడు. శివప్రసాద్ తన స్నేహితులు కాండ్రపు గోపి, పీట్ల శివకృష్ణతో కలిసి కారులో గంజాయి ప్యాకెట్లు తీసుకుని ఫార్చ్యూన్ హిల్స్ లేఅవుట్ వద్దకు చేరారు. రాంబాబు, సతీశ్ వారితో జతకలిశారు. ఆ సమయంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడిచేసి వారిని పట్టుకున్నారు.