సీదిరి వ్యవహారంలో పట్టుబిగిస్తున్న పోలీసులు
ABN , Publish Date - Jul 25 , 2026 | 04:59 AM
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడి హిట్ అండ్ రన్ కేసులో పోలీసులు పట్టుబిగిస్తున్నారు. కేసులో ఏ ఒక్కరూ తప్పించుకోకుండా నిజాన్ని దాచిన అందరికీ శిక్ష పడేలా సాక్ష్యాలు సేకరిస్తున్నారు.
కేసులో మరో ముగ్గురు నిందితులు
అల్లు వెంకటరమణ, నర్తు వెంకటరమణ, ఏ2 సిద్ధార్థ తండ్రి అరెస్టుకు రంగం సిద్ధం
ములాఖత్‌లో అప్పలరాజును కలిసిన వైసీపీ నేతలు
శ్రీకాకుళం, జూలై 24(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడి హిట్ అండ్ రన్ కేసులో పోలీసులు పట్టుబిగిస్తున్నారు. కేసులో ఏ ఒక్కరూ తప్పించుకోకుండా నిజాన్ని దాచిన అందరికీ శిక్ష పడేలా సాక్ష్యాలు సేకరిస్తున్నారు. ఈ కేసులో అప్పలరాజు(ఏ3), ఆయన కుమారుడు ఆరవ్ వర్మ(ఏ1), సిద్ధార్థ త్యాడి (ఏ2)తో పాటు మరో ముగ్గురిని నిందితులుగా చేర్చారు. అల్లు వెంకటరమణ (ఏ4), నర్తు వెంకటరమణ (ఏ5), సిద్ధార్థ త్యాడి తండ్రి గౌరి త్యాడి (ఏ6)ని త్వరలో అరెస్టు చేయనున్నట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించి అల్లు వెంకటరమణ పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. అప్పలరాజు వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీను ఈ ప్రమాదానికి కారకుడని.. అతడిని కస్టడీలోకి తీసుకోవాలని.. ఈ విషయాన్ని అప్పలరాజు ధ్రువీకరిస్తారని పోలీసులకు ఫోన్ చేసి ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చాడు. అలాగే బైక్ ప్రమాద ఘటనలో దుబ్బ దానయ్య తీవ్ర గాయాలపాలై మృతిచెందాడు. ఆయనకు తాను సీపీఆర్ చేశానని అప్పలరాజు చెప్పడం అబద్ధమని పోలీసులు నిర్ధారించారు. ఇక ఏ5 నర్తు వెంకటరమణ.. దుబ్బ దానయ్య కుటుంబానికి వాస్తవం చెప్పకుండా.. ప్రమాదం చేసింది అప్పలరాజు కుమారుడని తెలియజేయకుండా... ఆ కుటుంబాన్ని సెటిల్‌మెంట్‌కు తీసుకురావాలని చూశాడు. చేయని ప్రమాదాన్ని చేసినట్లు పోలీసులను నమ్మించేలా సిద్ధార్థ త్యాడి యత్నించడం.. వాస్తవం తెలిసినా దాచిపెట్టినందుకు అతడి తండ్రి గౌరి త్యాడిని ఏ6గా చేర్చారు. ఈ ముగ్గురినీ పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. త్వరలోనే అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
అప్పలరాజును జైల్లో కలిసిన వైసీపీ నేతలు
జిల్లా జైలులో ఉన్న అప్పలరాజును శుక్రవారం వైసీపీ నేతలు ములాఖత్‌లో కలిశారు. ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్‌చార్జి ముత్యాలనాయుడు, ఎమ్మెల్సీలు రవి వర్మ, కుంబా రవిబాబు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, టెక్కలి ఇన్‌చార్జి పేరాడ తిలక్ వీరిలో ఉన్నారు. రోడ్డు ప్రమాదాన్ని మర్డర్ కేసుగా మార్చి అప్పలరాజును, ఆయన కుమారుడిని అరెస్టుచేశారని వారు ఆరోపించారు.