రైలు దొంగలపై పోలీసు కాల్పులు
ABN , Publish Date - May 13 , 2026 | 04:52 AM
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ పరిధిలో మంగళవారం రైలుదోపిడీ యత్నం జరిగింది. ముందుగా దుండగులు రైల్వే సిగ్నల్స్‌ను హ్యాక్ చేయడం ద్వారా రైలు నిలపాలనుకున్నారు.
అడ్డుకున్న రైల్వే గస్తీ పోలీసులపై రాళ్లదాడి
10 రౌండ్ల కాల్పులు.. పరారైన దుండగులు
గుంటూరు జిల్లా నిడుబ్రోలు వద్ద ఘటన
పొన్నూరు, మే 12 (ఆంధ్రజ్యోతి): నిడుబ్రోలు రైల్వే స్టేషన్ పరిధిలో మంగళవారం రైలుదోపిడీ యత్నం జరిగింది. ముందుగా దుండగులు రైల్వే సిగ్నల్స్‌ను హ్యాక్ చేయడం ద్వారా రైలు నిలపాలనుకున్నారు. అయితే, గస్తీలో ఉన్న రైల్వే పోలీసులు సకాలంలో గుర్తించి అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. దుండగులు రాళ్లు రువ్వగా పోలీసులు కాల్పులు జరిపారు. అయినా వారు తప్పించుకుని పరారయ్యారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని నిడుబ్రోలు రైల్వేస్టేషన్ దాటిన తరువాత తెనాలి వైపు వెళ్లే దారిలో ఆలూరు రైల్వే గేటుకు అత్యంత సమీపంలో మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే, పొన్నూరు పోలీసుల కథనం ప్రకారం.. కొంత కాలంగా రైళ్లలో ప్రయాణికులకు చెందిన బంగారం, నగదు దొంగతనాలు జరుగుతున్నాయి. గత నెలలో ఇదే రూట్‌లోని అప్పికట్ల వద్ద కొందరు దుండగులు రైలు ఆపి ప్రయాణికుల వద్ద ఉన్న బంగారు నగలు దోచుకుని పరారయ్యారు. దోపిడీ దొంగలు సిగ్నల్ హ్యాక్ చేసి లేదా సిగ్నల్ వైరు కత్తిరించి సిగ్నల్ వ్యవస్థను ధ్వంసం చేయడం ద్వారా రైళ్లలో దోపిడీలకు పాల్పడుతున్నట్లు రైల్వే పోలీసులు గుర్తించారు. అప్పటి నుంచి రాత్రి వేళ సిగ్నలింగ్ వ్యవస్థ వద్ద గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున ఆలూరు వద్ద సిగ్నల్‌కు సమీపంలో ఇద్దరు అనుమానితులు సంచరించడాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. వారి సమీపంలోకి వెళ్లి ప్రశ్నిస్తుండగానే దుండగులు రాళ్లు రువ్వారు. దీంతో ఆత్మ రక్షణ కోసం దుండగులపై రైల్వే పోలీసులు పది రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో దుండగులు పొలాల్లోకి పరుగులు తీసి నిడుబ్రోలు వైపు పారిపోయారు. కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని సమాచారం. ఆ మార్గంలో మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ వెళ్లాల్సి ఉంది. ఆ రైలుకు సిగ్నల్ లేకుండా చేసి దోపిడీ ప్రయత్నాల్లో దుండగులు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలం వద్ద వైరు కట్టర్ లభించడమే ఈ అనుమానాలకు కారణం. ఈ ఘటనపై రైల్వే, సివిల్ పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేకంగా ఆరు బృందాలను ఏర్పాటు చేసినట్లు గుంటూరు రైల్వే డీఎస్పీ అక్కేశ్వరరావు తెలిపారు. రైల్వే ఆస్తులకు నష్టం కలిగించాలని చూసినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కాల్పులు జరపడానికి వెనకాడబోమని హెచ్చరించారు.