ఖాకీల అవినీతి గోవుల దీనస్థితి
ABN , Publish Date - Feb 05 , 2026 | 04:48 AM
ఆవుల అక్రమ రవాణా ముఠాతో పలువురు పోలీసులు కుమ్మక్కైనట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. పార్వతీపురం నుంచి సుళ్లూరుపేట వరకూ రాత్రిపూట జరుగుతున్న చీకటి దందాకు దారి పొడవునా మద్దతిస్తున్న పలువురు పోలీసుల...
ఆవుల అక్రమ రవాణా ముఠాతో పోలీసుల కుమ్మక్కు
పార్వతీపురం నుంచి సుళ్లూరుపేట దాకా మాఫియా
గోవుల్ని ఎడాపెడా కంటైనర్లలో కుక్కి కభేళాలకు వందల కోట్ల చీకటి వ్యాపారానికి పోలీసుల మద్దతు
నాయుడుపేట పోలీసులపై ఏసీబీ దాడితో ఫిర్యాదులు
చిలకలూరిపేట, సుళ్లూరుపేటలో వైసీపీ నేతల దందా
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఆవుల అక్రమ రవాణా ముఠాతో పలువురు పోలీసులు కుమ్మక్కైనట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. పార్వతీపురం నుంచి సుళ్లూరుపేట వరకూ రాత్రిపూట జరుగుతున్న చీకటి దందాకు దారి పొడవునా మద్దతిస్తున్న పలువురు పోలీసుల బాగోతం ఏసీబీ అధికారులకు చేరినట్లు తెలిసింది. నెల రోజుల్లోనే ముగ్గురు పోలీసులు కర్నూలు, నాయుడుపేటలో ఏసీబీ ట్రాప్‌లో పడటంతో పశువుల అక్రమ రవాణాదారుల అరాచకాలు, వారికి సహకారం అందిస్తున్న పోలీసుల గురించి గోరక్ష సంఘాల నుంచి పాడి రైతుల వరకూ ఫిర్యాదులు చేస్తున్నారు. గో మాంసం ఎక్కువగా తినే కేరళకు మన పొరుగు రాష్ట్రమైన ఒడిశా నుంచి ఆవులు, ఎద్దులు రవాణా అవుతున్నాయి. ఉత్తరాంధ్రలోని పార్వతీపురంలో అతిపెద్ద పశువుల సంతలో వ్యాపారులు ఆవులు, ఎద్దుల్ని కొనుగోలు చేసి కేరళలోని కబేళాలకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి ఆవు మాంసం విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. సంతలో కొనుగోలు చేసిన ఆవుల్ని కంటైనర్లలో తగినంత స్థలంలో ఉంచి మార్గమధ్యంలో ఆపుతూ కిందికి దించి వాటికి ఆహారం, నీరిచ్చి తీసుకెళ్లేందుకు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
అయితే రాష్ట్రంలో మాఫియాగా ఏర్పడిన కొందరు 16 ఆవులు మాత్రమే పట్టే కంటైనర్లలో 40 నుంచి 50 కుక్కి ఊపిరి ఆడకుండా చేసి అత్యంత దారుణంగా తీసుకెళ్తున్నారు. పగటిపూట సంతలో కొనుగోలు చేసి చీకటి పడగానే వాటిని కంటెనర్లలో ఎక్కిస్తున్నారు. పార్వతీపురం నుంచి సుళ్లూరుపేట వరకూ వెళ్లే దారిలో రాజమహేంద్రవరం, చిలకలూరిపేటలో ఆపి కొందరు తీసుకెళ్తున్నారు. ఎక్కువమంది పశువుల్ని ఆపకుండా రాష్ట్ర సరిహద్దుకు తరలించి, అక్కడి నుంచి మరో వాహనంలో కేరళకు పంపుతున్నారు. పశుసంవర్థక, రవాణా, పోలీసు శాఖల అనుమతి లేకుండా వెళ్లే వాహనాలను పోలీసులు, ఎంవీఐలు తనిఖీలు చేస్తారు. గో సంరక్షణ సంఘాలేవైనా ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసులు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసి పశువుల్ని గోశాలకు తరలిస్తారు.
ఉత్తరాంధ్రలో మాఫియా డాన్
ఉత్తరాంధ్ర జిల్లాల్లో జామి శేఖర్ అనే వ్యక్తి మాఫియా డాన్‌లా తయారై వందల కోట్ల వ్యాపారం చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటీవల విశాఖపట్నంలో టన్నుల కొద్దీ సీజ్ చేసి భూమిలో పాతిపెట్టిన పశు మాంసం తరలింపులోనూ శేఖర్ పాత్ర బయట పడింది. పలుమార్లు పోలీసులు అరెస్టు చేసినా గ్యాంగులను ఏర్పాటు చేసుకుని పోలీసులకు మామూళ్లు ఇస్తూ వేలాది పశువుల్ని అక్రమంగా కబేళాకు తీసుకెళుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. కట్టడి చేసేందుకు కొందరు పోలీసులు ప్రయత్నించగా ఒక మంత్రి నుంచి ఫోన్లు వచ్చినట్లు తెలుస్తోంది.
చిలకలూరిపేటలో..
చిలకలూరిపేటలో గత ప్రభుత్వంలో మాజీ మంత్రి సహకారంతో పశువుల దందా నడిపిన వ్యక్తి ఎన్నికల ముందు టీడీపీకి జై కొట్టి ఇప్పుడు అంతకుమించి వ్యవహారం నడిపిస్తున్నట్లు సమాచారం. ఆయనకు సహకరిస్తున్న పోలీసుల గుట్టు, మా మూళ్ల వ్యవహారం బయటికి వస్తోంది. వైసీపీ హయాంలో అరాచకాలకు వంత పాడిన ఒక సీఐ మద్యం వ్యాపారుల్ని లంచం కోసం వేధిస్తుండగా తాజాగా ఏసీబీ అధికారులు అరెస్టు చేయడంతో పశువుల దందా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నాయుడుపేటలో హెడ్ కానిస్టేబుల్‌తో పాటు మరో కేసులో కర్నూలులో ఎస్‌ఐని లంచం తీసుకొంటుండగా అరెస్టు చేశారు. అవినీతి పోలసులపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి.
వైసీపీ నేత దందా
రాజమహేంద్రవరంలో వైసీపీకి చెందిన ఒక నేత పశువులు అక్రమంగా తరలించే వాహనాల్ని ఆపి డబ్బులు కట్టకుండా కదలడానికి వీల్లేదంటూ దౌర్జన్యం చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అక్కడి పోలీసులు హెచ్చరించడంతో నెల్లూరు జిల్లా సరిహద్దులకు వెళ్లి అక్కడ కొందరు పోలీసులతో కుమ్మక్కై దందా చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడి సంతలో రైతులు పాడి కోసం పశువుల్ని కొనుగోలు చేసినా తనకు మామూళ్లు ఇవ్వాలంటూ దౌర్జన్యం చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. రైతులు మామూళ్లు ఇవ్వకుంటే తనకు అనుకూలమైన పోలీసులకు ఫోన్లు చేసి కేసులు పెట్టిస్తున్నట్లు ఆధారాలు లభించాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు మాజీ మంత్రులతో సన్నిహితంగా ఉంటూ.. బియ్యం స్మగ్లర్‌గా పేరొందిన మాజీ ఎమ్మెల్యే అనుచరుడిగా దందాలు చేయడంతో గతంలో కేసులు నమోదయ్యాయి. ఆ వ్యక్తి ఇప్పుడు నెల్లూరు, సుళ్లూరుపేట ప్రాంత పోలీసులతో కుమ్మక్కై రైతుల్ని వేధిస్తున్నాడు. అతనికి వంత పాడుతున్న పోలీసులు ఎవరనే దానిపై అవినీతి కట్టడి చేసే అధికారులు కూపీ లాగారు.