రేకుల షెడ్‌లోనే అక్షర తపస్సు!
ABN , Publish Date - Jul 20 , 2026 | 03:50 AM
ఒక పక్క డిజిటల్ క్లాసులు, కార్పొరేట్ స్థాయి వసతులు అంటూ ప్రభుత్వం దూసుకుపోతోంది. మరోవైపు గిరిజన విద్యార్థుల చదువు కోసం రూ.కోట్లు ఖర్చు పెడుతున్నామని గిరిజన సంక్షేమ శాఖ గొప్పలు చెప్పుకొంటోంది. కానీ..
కష్టాల కడలిలో గిరి విద్యార్థుల చదువులు
మౌలిక వసతులు, సదుపాయాలు కరువు.. 51 మంది విద్యార్థులకు ఒక్కరే టీచర్
పోలవరం జిల్లా మెట్టగూడెం బడి దుస్థితి.. పక్కా భవనం కోసం ఎదురుచూపులు
మోతుగూడెం, జూలై 19(ఆంధ్రజ్యోతి): ఒక పక్క డిజిటల్ క్లాసులు, కార్పొరేట్ స్థాయి వసతులు అంటూ ప్రభుత్వం దూసుకుపోతోంది. మరోవైపు గిరిజన విద్యార్థుల చదువు కోసం రూ.కోట్లు ఖర్చు పెడుతున్నామని గిరిజన సంక్షేమ శాఖ గొప్పలు చెప్పుకొంటోంది. కానీ.. కొన్ని మారుమూల గిరిజన ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. అందుకు పోలవరం జిల్లా గుర్తేడు మండలం బొడ్డగండి గ్రామ పంచాయతీ పరిధిలోని మెట్టగూడెం గ్రామంలోని గిరిజన ప్రాథమిక పాఠశాల (జీపీఎస్) దుస్థితే ఉదాహరణ. రంపచోడవరం ఐటీడీఏ, గిరిజన సంక్షేమ శాఖ పర్యవేక్షణలో నడుపుతున్న మెట్టగూడెంలోని గిరిజన ప్రాథమిక పాఠశాలకు (జీపీఎస్) పక్కా భవనం లేదు. కేవలం మట్టిగోడలతో ఉన్న చిన్న రేకుల షెడ్‌లో నిర్వహిస్తున్నారు. మెట్టగూడెం, రెడ్డినగర్ గిరిజన గ్రామాలకు చెందిన 51మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరందరికీ కేవలం ఒక్కరే ఉపాధ్యాయురాలు ఉండటం గమనార్హం.
ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ..
ఈ షెడ్‌లోనే ఒకటి నుంచి ఐదో తరగతి వరకు నిర్వహిస్తున్నారు. బెంచీలు లేక విద్యార్థులు నేలమీదే కూర్చుంటున్నారు. ఎండకాలం వస్తే ఆ సిమెంటు రేకులు సెగలతో వేడెక్కిపోతోంది. వర్షాకాలం వస్తే పైకప్పు నుంచి వర్షపు నీరు కారుతుంది. ఇలా విద్యార్థులు ఇటు ఎండకు ఎం డుతూ, వానకు తడుస్తూ చదువులు సాగిస్తున్నారు. పెద్ద వర్షం వస్తే ఇక అంతే సంగతులు. ఇంకోవైపు మంచినీటి వసతి లేదు. బోరు ఉన్నప్పటికీ ఏడాది నుంచి పనిచేయడం లేదు. మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. షెడ్ చట్టూ తుప్పలు ఉండడంతో కీటకాలు వస్తున్నాయని పిల్లలు చెబుతున్నారు. వంట గది, భోజనం చేయడానికి సదుపాయం లేకపోవడంతో మధ్యా హ్న భోజనం కోసం విద్యార్థులు 300 మీటర్ల దూరంలో ఉన్న వంట కార్మికురాలి ఇంటికి నడిచి వెళ్లాల్సిన పరిస్థితి.
లోకేశ్ సారు స్పందిస్తేనే బడి భవనం!
ప్రభుత్వాలు మారుతున్నా, పథకాల పేర్లు మారుతున్నా, పాలకులు మారుతున్నా ఈపాఠశాల రాత మాత్రం మారలేదు. అధికారులు ఏటా సర్వేల పేరుతో వస్తుంటారు, ఫొటోలు తీసుకుని, నివేదికలు సిద్ధం చేసుకుని వెళ్తుంటారు తప్ప.. నేటికి శాశ్వత భవన నిర్మాణానికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కూటమి ప్రభుత్వం స్పందించి మెట్ట గూడెంలోని గిరిజన ప్రాథమిక పాఠశాల (జీపీఎస్)కు భవనం నిర్మించి, మౌలిక సదుపాయాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ‘విద్యాశాఖ మంత్రి లోకేశ్ సారూ.. మా పాఠశాలకు భవనం కట్టించాల’ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.