స్వల్పంగా పెరిగిన గోదావరి
ABN , Publish Date - Jul 20 , 2026 | 03:47 AM
ఎగువ రాష్ట్రాల్లో వర్షాల ప్రభావంతో ఉప నదుల జలాలు గోదావరిలో కలుస్తున్నాయి. అలాగే పోలవరం ప్రాజెక్టు ఎగువన శనివారం వర్షాలు కురవడంతో..
పోలవరం స్పిల్‌వే నుంచి30,377 క్యూసెక్కులు విడుదల
పట్టిసీమ నుంచి 6,726 క్యూసెక్కుల ఎత్తిపోత
ఆలమట్టిలోనూ పెరిగిన ఇన్‌ఫ్లో
92.5 టీఎంసీలకు చేరిన నిల్వలు
తుంగభద్రకు 25,590 క్యూసెక్కులు
శ్రీశైలంలో ఇన్‌ఫ్లో నిల్.. ఔట్‌ఫ్లో కూడా
పోలవరం/అమరావతి, జూలై 19(ఆంధ్రజ్యోతి): ఎగువ రాష్ట్రాల్లో వర్షాల ప్రభావంతో ఉప నదుల జలాలు గోదావరిలో కలుస్తున్నాయి. అలాగే పోలవరం ప్రాజెక్టు ఎగువన శనివారం వర్షాలు కురవడంతో కొండవాగులు పొంగి ఆ నీరు కూడా వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం ఆదివారం స్పల్పంగా పెరిగింది. స్పిల్‌వే నుంచి 30,377 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు డీఈ వెంకటేశ్వరరావు తెలిపారు. స్పిల్‌వే ఎగువన 26.250 మీటర్లు, ఎగువ కాఫర్ డ్యాం ఎగువన 26.300 మీటర్లు నీటిమట్టం నమోదైంది. ఇంకోవైపు.. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి పోలవరం కుడి కాలువకు 6,726 క్యూసెక్కులు విడుదల చేశామని ఈఈ ఏసుబాబు ఆదివారం తెలిపారు. గోదావరి నీటిమట్టం 14మీటర్లకు తగ్గడంతో పంపుల సంఖ్య తగ్గిం చి 19 పంపులు, 19 మోటార్లతో నీటిని ఎత్తిపోస్తున్నట్లు చెప్పారు.
75 శాతానికిపైగా ఆలమట్టి..
రెండ్రోజులుగా కర్ణాటకలోని ఆలమట్టి డ్యాంలోకి ప్రవాహం వస్తోంది. ప్రాజెక్టు గరిష్ఠ నిల్వ సామర్థ్యం 129.720 టీఎంసీలు కాగా.. 75.227 శాతం నిండింది. ప్రస్తుతం 92.590 టీఎంసీల నిల్వలున్నాయి. కాలువలకు 5,250 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జలాశయంలోకి ఆదివారం 40,559 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. తుంగభద్రకు కూడా ఇన్‌ఫ్లో పెరిగింది. ఆదివారం 20,510 క్యూసెక్కుల ప్రవాహం ఉం ది. కాలువలకు 1137 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. డ్యాం గరిష్ఠ నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 25.990 టీఎంసీల నిల్వలున్నాయి. ఇక జూరాల, శ్రీశైలం జలాశయాల్లోకి చుక్క నీరైనా రావడం లేదు. డ్యాం పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా.. ఆదివారం 820.899 అడుగుల వద్ద 41.453 టీఎంసీల నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో ఏమీ లేదు. బయటకు కూడా నీరు వదలడం లేదు. నాగార్జున సాగర్ జలాశయంలో ప్రస్తుతం 137.516 టీఎంసీల నీటి నిల్వలే ఉన్నాయి. ఎగువ నుంచి 900 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 900క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులో 29.480 టీఎంసీల నిల్వ ఉంది. 400 క్యూసెక్కులను కిందకు వదులుతున్నారు.