Share News

నిర్వాసితుల ఇళ్లు భేష్‌ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను ఆహ్వానిస్తా కేంద్ర ప్రభుత్వ సలహాదారు ముదిత్‌ కుమార్‌

ABN , Publish Date - Oct 08 , 2026 | 06:09 AM

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న గృహ సముదాయాలు బాగున్నాయని కేంద్ర ప్రభుత్వం నియమించిన పర్యవేక్షక సలహాదారు, విశ్రాంత ఐఎప్ఎస్‌ అధికారి ముదిత్‌ కుమార్‌ సింగ్‌ ప్రశంసించారు.

నిర్వాసితుల ఇళ్లు భేష్‌  మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను ఆహ్వానిస్తా  కేంద్ర ప్రభుత్వ సలహాదారు ముదిత్‌ కుమార్‌
polavaram project view

అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న గృహ సముదాయాలు బాగున్నాయని కేంద్ర ప్రభుత్వం నియమించిన పర్యవేక్షక సలహాదారు, విశ్రాంత ఐఎప్ఎస్‌ అధికారి ముదిత్‌ కుమార్‌ సింగ్‌ ప్రశంసించారు. ఈ గృహ సముదాయాలను పరిశీలించేందుకు కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను ఆహ్వానిస్తానని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నిర్మిస్తున్న గృహాలు, కాలనీలు, సదుపాయాల పరిశీలనకు ఆయన ఈ నెల 5న పోలవరం ప్రాంతానికి వచ్చారు. పోలవరం ప్రాజెక్టు పర్యవేక్షక అధికారులతో కలసి జంగారెడ్డిగూడెంలో నిర్వాసితుల కోసం యూనిక్‌ ఇన్‌ఫ్రా నిర్మిస్తున్న గృహసముదాయాలను బుధవారం పరిశీలించారు. ప్రాజెక్టు అధికారులతో సహాయ పునరావాస కార్యక్రమాల ప్రగతిపై సమీక్షించారు. కాలనీల నిర్మాణ పనులు బాగున్నాయని, ఇతర ప్రాజెక్టుల కంటే పోలవరంలో పనులు జోరుగా సాగుతున్నాయని ముదిత్‌కుమార్‌ సింగ్‌ ప్రశంసించారు.

పోలవరం పనులు సంతృప్తికరం: సంజీవ్‌ వోహ్రా

పోలవరం ప్రాజెక్టు పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయని ప్రాజెక్టు అథారిటీ సీఈవో సంజీవ్‌ వోహ్రా అన్నారు. బుధవారం పోలవరం ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్‌ కం రాక్‌ ఫిల్‌ డ్యాం పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరు, నాణ్యతా ప్రమాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో ఇదే వేగం, నాణ్యతను కొనసాగిస్తూ వానలు అంతగా లేని ఈ కాలాన్ని సద్వినియోగపరుచుకోవాలని అధికారులకు, మేఘా నిర్మాణ సంస్థకు సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నాయని తెలిపారు. డ్యాం నిర్మాణానికి అవసరమయ్యే మట్టి, రాయి, ఇసుక, సిమెంట్‌ మొదలైన వాటిని సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఆర్థిక వనరుల కొరత లేదని స్పష్టం చేశారు.


కేంద్రం విడతల వారీగా నిధులు విడుదల చేస్తుందన్నారు. ఈ నెలలో విదేశీ నిపుణుల బృందం పోలవరం సందర్శించనున్న నేపథ్యంలో అనుకున్న ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో అథారిటీ సీఈ రమేశ్‌కుమార్‌, ఎస్‌ఈ రామచంద్రరావు, డీఈఈలు డి.శ్రీనివాస్‌ బాలకృష్ణ, పీపీఏ సాంకేతిక అంశాల సమన్వయ అధికారి కేవీఎం భాస్కరరావు, మేఘా జీఎం గంగాధర్‌, డీజీఎం మురళి పమ్మి పాల్గొన్నారు.

Updated Date - Oct 08 , 2026 | 06:14 AM