Share News

డయాఫ్రం వాల్‌ పూర్తి

ABN , Publish Date - Apr 03 , 2026 | 05:52 AM

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ఘట్టం ముగిసింది. వైఎస్‌ జగన్‌ నిర్వాకం కారణంగా ధ్వంసమైన పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్‌ పునర్‌ నిర్మాణం పూర్తయింది.

డయాఫ్రం వాల్‌ పూర్తి

  • నాడు జగన్‌ నిర్వాకంతో విధ్వంసం

  • కూటమి వచ్చాక పునర్‌నిర్మాణం.. 18 నెలల్లోనే 1372 మీటర్ల పని పూర్తి

  • ఇక ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం పనులు వేగిరం.. ఇంజనీర్లకు సీఎం అభినందనలు

  • స్వీట్లు పంచిన మంత్రి నిమ్మల.. పోలవరంలో గవర్నర్‌ ఏరియల్‌ సర్వే

పోలవరం/అమరావతి, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ఘట్టం ముగిసింది. వైఎస్‌ జగన్‌ నిర్వాకం కారణంగా ధ్వంసమైన పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్‌ పునర్‌ నిర్మాణం పూర్తయింది. 1372.60 మీటర్ల పొడవైన డయాఫ్రం వాల్‌ను కేవలం 18 నెలల రికార్డు సమయంలోనే పూర్తి చేయడం విశేషం. దీంతో జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో ఇంజనీర్లను సన్మానించి మిఠాయిలు తినిపించారు. రాష్ట్ర జీవనాడి పోలవరాన్ని పూర్తి చేయాలన్న ప్రభుత్వ సంకల్పంలో భాగంగా డయాఫ్రం వాల్‌ పూర్తయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. జలవనరుల శాఖ అధికారులను, ఇంజనీర్ల్లను ‘ఎక్స్‌’ వేదికగా అభినందించారు. దీనికి సహకరించిన కేంద్ర సంస్థలకు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి ధన్యవాదాలు తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ వాల్‌ దెబ్బతినడంతో అదనంగా రూ.1,000 కోట్లు వెచ్చించి కొత్తది నిర్మించామన్నారు. ఇది పూర్తికావడంతో ప్రధాన కట్టడమైన ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాం పనులు ఇక వేగవంతమవుతాయని తెలిపారు. అన్నిపనులూ పూర్తి చేసి 2027లో పుష్కరాలకు ముందే ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. మంత్రి నిమ్మల మాట్లాడుతూ.. ‘గత టీడీపీ ప్రభుత్వ పాలనలో 18నెలలపాటు శ్రమించి నిర్మించిన డయాఫ్రంవాల్‌ను జగన్‌ ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేసింది. 2025 జనవరి 18న 1,372 మీటర్ల నూతన డయాఫ్రం వాల్‌ నిర్మాణం పనులు ప్రారంభించి గురువారానికి 440 రోజుల్లో పూర్తిచేశాం. జగన్‌ చేసిన విధ్వంసంతో నూతన వాల్‌ నిర్మాణానికి అదనంగా రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. 2020 ఆగస్టు వరదలకు డయాఫ్రంవాల్‌ దెబ్బతింటే 2021 జూన్‌, 2021 డిసెంబరు, 2022 జూన్‌కి దాని నిర్మాణం పూర్తి చేస్తానంటూ జగన్‌ అసెంబ్లీలో పదే పదే చెప్పారు. కూటమి ప్రభుత్వం రాగానే ధ్వంసమైన పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం చంద్రబాబు గాడిన పెట్టారు. 2027 పుష్కరాలకు మునుపే నిర్మాణం పూర్తి చేసే లక్ష్యంతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. దానికి నిదర్శనం డయాఫ్రంవాల్‌ నిర్మాణం పూర్తవడమే. ప్రధాన డ్యాం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి’ అపి తెలిపారు. కార్యక్రమంలో ఈఎన్‌సీ ఎన్‌.నరసింహమూర్తి, ఎస్‌ఈ రామచంద్రరావు, ఈఈలు శ్రీనివాస్‌, బాలకృష్ణ, మాధవరావు, వెంకటరమణ, సుధాకర్‌, సత్యదేవ్‌, ప్రేమ్‌చంద్‌, జలవనరులశాఖ ఇంజనీర్లు, మేఘా ఇంజనీరింగ్‌ ప్రతినిధులు అంగర సతీశ్‌బాబు, గంగాధర్‌, మురళి పమ్మి పాల్గొన్నారు.


జగన్‌ విధ్వంసాన్ని అధిగమించి..

కీలక ఘట్టానికి పోలవరం!

డయాఫ్రం వాల్‌ నిర్మాణం పూర్తితో... ప్రధాన డ్యాంలో చివరిది అత్యంత కీలకమైన ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాం నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేసేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. 2019లో అధికారం చేపట్టిన జగన్‌.. పోలవరం కాంక్రీటు పనులను ఆపేశారు. అప్పటికే నిర్మించిన డయాఫ్రం వాల్‌పై ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాంను నిర్మించి ఉంటే.. రెండేళ్లలోనే ప్రాజెక్టు పూర్తయ్యేది. కానీ, నిర్మాణ సంస్థను అర్ధాంతరంగా తొలగించి.. రివర్స్‌ టెండర్‌ పేరిట కొత్త కాంట్రాక్టు సంస్థకు నిర్మాణ బాధ్యతలను జగన్‌ అప్పగించారు. ఈ పనులు వెంటనే ప్రారంభం కాలేదు. రెండేళ్లపాటు స్తంభించాయి. 2020, 2021 సంవత్సరాలలో గోదావరి నదికి వచ్చిన భారీ వరద కారణంగా డయాఫ్రం వాల్‌ దెబ్బతింది. జగన్‌ జమానాలోనే నిర్మించిన గైడ్‌బండ్‌ కుంగిపోయింది. 2024లో కూటమి విజయంతో సీఎం చంద్రబాబు.. మళ్లీ పోలవరంపై దృష్టి సారించారు. జగన్‌ చేసిన తప్పులు పునరావృతం కాకుండా.. కాంట్రాక్టు సంస్థలను కొనసాగించారు. గతంలో డయాఫ్రం వాల్‌ నిర్మించిన బావర్‌ సంస్థకే కొత్త వాల్‌ పనులనూ అప్పగించారు.


పోలవరం సందర్శన నా అదృష్టం

రాష్ట్ర ప్రజలకు ఈ ప్రాజెక్టు వరప్రదాయిని

పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలం: గవర్నర్‌

‘పోలవరాన్ని సందర్శించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ బహుళార్ధ సాధక ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు వరప్రదాయిని. దీని నిర్మాణంతో రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది’ అని గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఆకాంక్షించారు. పోలవరం ప్రాజెక్టును గురువారం ఆయన సందర్శించారు. కాకినాడ జేఎన్‌టీయూ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన అక్కడ నుంచి హెలికాప్టర్‌లో పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి వచ్చి.. ఏరియల్‌ సర్వే ద్వారా డయాఫ్రం వాల్‌ను.. ప్రాజెక్టు స్పిల్‌వేనూ పరిశీలించారు. మధ్యాహ్నం 1.55 గంటలకు వ్యూ పాయింట్‌కు చేరుకున్నారు. అక్కడ ప్రజాప్రతినిధులు, అఽధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం గెస్ట్‌హౌస్‌లో ప్రాజెక్టు పురోగతిపై సమీక్షించారు. ఈఎన్‌సీ నరసింహమూర్తి పనుల పురోగతిని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. గవర్నర్‌ పలు సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. నిర్వాసితులకు అందుతున్న పునరావాస కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. పనుల పురోగతిపై ప్రాజెక్టు మీటింగ్‌ హాలులో మంత్రి నిమ్మల రామానాయుడు, కలెక్టర్‌ వెట్రిసెల్వి, అధికారులు, ఇంజనీరింగ్‌ అధికారులతో గవర్నర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘ఇక్కడకు రావడం వల్ల చాలా విషయాలు తెలుసుకున్నాను. డయాఫ్రం వాల్‌ పూర్తయిందని ఇప్పుడే ఇంజనీరింగ్‌ అధికారుల నుంచి తెలుసుకున్నాను. నిర్దేశించిన సమయంలోగా ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు జలవనరుల శాఖ ఇంజనీరింగ్‌ అధికారులు చేస్తున్న కృషి ప్రశంసనీయం’ అన్నారు. పనులు శరవేగంతో సాగుతున్నాయని కలెక్టర్‌ వెట్రిసెల్వి తెలిపారు. పనుల పురోగతి, నిర్వాసితులకు అమలు చేస్తున్న పునరావాస కార్యక్రమాలను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ఈఎన్‌సీ నరసింహమూర్తి వివరించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ను మంత్రి నిమ్మల శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌, ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌, జేసీ అభిషేక్‌ గౌడ, ఎస్‌ఈ ఆర్‌.రామచంద్రరావు, జిల్లా అటవీశాఖ అధికారి పి.వి.సందీప్‌ రెడ్డి, ఐటీడీఏ పీవో రాములు నాయక్‌, మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Untitled-1 copy.jpg

Updated Date - Apr 03 , 2026 | 05:55 AM