అడ్డంకులు తొలగాలి.. నీరు పారాలి!
ABN , Publish Date - Apr 12 , 2026 | 04:58 AM
పోలవరం ప్రాజెక్టుకు ఉన్న ప్రధాన అడ్డంకులను తొలగించాలని కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని ఇతర శాఖలకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు సూచించారు.
పోలవరానికి లైన్ క్లియర్ చేయండి
చంద్రబాబు ఆకాంక్ష మేరకు గోదావరి పుష్కరాలకు ముందే తొలిదశ పూర్తి
త్వరలోనే రూ.3800 కోట్లు విడుదల
రాష్ట్ర అధికారులతో కేంద్ర జలశక్తి కార్యదర్శి కాంతారావు సమీక్ష
అమరావతి, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టుకు ఉన్న ప్రధాన అడ్డంకులను తొలగించాలని కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని ఇతర శాఖలకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు సూచించారు. సీఎం చంద్రబాబు ఆకాంక్షల మేరకు గోదావరి పుష్కరాలకు ముందే నీరు పారాలని పేర్కొన్నారు. పోలవరం పనులకు తరచూ ‘స్టాప్‌వర్క్’ ఆర్డర్ సమస్య ఎదురుకాకుండా ఉండేలా జలశక్తి, అటవీ పర్యావరణ శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రాజెక్టు తొలిదశలో 41.15 మీటర్ల కాంటూరుకు ముంపు సమస్య ఎదురు కాబోదని అధికారులు స్పష్టం చేస్తున్నా.. తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలతో ముంపు సమస్యపై మరింత లోతైన అధ్యయనం చేయాలని జలశక్తి, కేంద్ర జలసంఘం, వాప్కోస్, పీపీఏ అధికారులకు స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం తొలిదశలో 41.15మీ. కాంటూరు వరకు నీటిని నిల్వ చేసేందుకు వీలుగా అన్ని అనుమతులు వచ్చేలా చూడాలని సూచించారు. ప్రాజెక్టు తొలిదశను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్న నేపథ్యంలో.. ఇప్పటి నుంచే అన్ని అనుమతులూ వచ్చేలా చూడాలని ఆదేశించారు. భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల అమలులోనూ ఆఖరి నిమిషం వరకు ఆగకుండా.. నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. ఈ బాధ్యతలను జలశక్తి పరిధిలోని భూసేకరణ, సహాయ పునరావాస కమిషనర్ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఈసీఆర్‌ఎఫ్‌తో సహా ఇతర ప్రధాన డ్యాముల నిర్మాణ పనులపై రోజువారీ పరిశీలన చేయాలని వాప్కో్‌స్‌ను కాంతారావు ఆదేశించారు.
పనులు జరుగుతున్నప్పుడే..
ఇప్పటిదాకా పోలవరం పనులు జరిగిన తర్వాత క్వాలిటీ కంట్రోల్‌పై ప్రాజెక్టు అథారిటీ, వాప్కోస్ నివేదికలు ఇస్తున్నాయని కాంతారావు తెలిపారు. కానీ, ఇకపై పనులు జరుగుతున్న సమయంలోనే ప్రత్యక్షంగా పరిశీలించి.. తప్పొప్పులను అప్పటికప్పుడే సరిచేయాలంటూ వాస్కో్‌సకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టుపై శనివారం శ్రమశక్తి భవన్‌లో రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్, పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, సహాయ పునరావాస కమిషనర్ ప్రశాంతి, ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తితో కాంతారావు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పీపీఏ, వాప్కోస్, సీఎ్‌సఎంఆర్‌ఎస్, కేంద్ర జలసంఘం అధికారులు పాల్గొన్నారు. పోలవరం పనుల ప్రగతిపై సంతృప్తి వ్యక్తం చేసిన కాంతారావు.. భూసేకరణ, సహాయ పునరావాసానికి బడ్జెట్‌లో రూ.3,800 కోట్లు విడుదల కానున్నాయని వెల్లడించారు. గడచిన ఐదేళ్లలో నిర్వాసితులకు పరిహారం చెల్లించలేదని, ఇటీవల నిర్వాసితుల ఖాతాల్లో రూ.లక్షలు జమ కావడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయని ప్రశాంతి వివరించారు. భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలకు సంబంధించి తరచూ సమీక్షలు నిర్వహించాలని సాయిప్రసాద్ కోరారు.
సందేహాలకు తావు లేకుండా..
పోలవరం పనులను కేంద్ర ఖనిజ, మృత్తికా పరిశోధన సంస్థ పరిశీలించి నివేదికలు ఇవ్వాలని కాంతారావు సూచించారు. పోలవరం ముంపు మండలాలపైనా సందేహాలను నివృత్తి చేయాల్సి ఉంటుందన్నారు. దీనికిగాను ఒడిశా, తెలంగాణల్లో కొండచరియల నుంచి వచ్చే జలాలను, వాగులు, వంకల్లోని నీళ్లను సైతం నిశితంగా లెక్కించేలా అధ్యయనాలు చేయాలని సూచించారు.
ఆ రాష్ట్రాలకు ముప్పులేదు!
పోలవరం నిర్మాణంతో తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు ముంపు ముప్పేమీ లేదన్న విషయాన్ని తార్కికంగా వివరించాలని కాంతారావు తెలిపారు. భద్రాచలం సహా తెలంగాణలోని ఏ ప్రాంతానికీ పోలవరం ప్రాజెక్టు కారణంగా ఎలాంటి నష్టమూ ఉండదన్నారు. దీనికిగాను ఎన్ని అధ్యయనాలైనా చేయాలని, ఖర్చుకు వెనుకాడాల్సిన అవసరం లేదని కూడా వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించాలన్నారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి పోలవరం తొలిదశ పనులు పూర్తయ్యేలా అన్ని అనుమతులు రావాల్సిందేనని కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఆయన స్పష్టం చేశారు.