Share News

పోలవరం @ 45.72 మీటర్లు

ABN , Publish Date - Apr 22 , 2026 | 04:14 AM

పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తులో నిర్మిస్తారా.. 194.60 టీఎంసీల నీటి నిల్వ ఉంటుందా లేదా అన్న సందేహాలకు తెరపడింది. 45.72 మీటర్ల గరిష్ఠ కాంటూరులో ప్రాజెక్టు పూర్తవుతుందని...

పోలవరం @ 45.72 మీటర్లు

  • 194.6 టీఎంసీల నీటి నిల్వపై తొలిసారి పీపీఏ ప్రస్తావన

  • ప్రాజెక్టు రెండో దశ నిర్మాణానికి లైన్‌ క్లియర్‌!

  • 45.72 మీటర్ల గరిష్ఠ కాంటూరుపై వెబ్‌సైట్‌లో అధికారికంగా వెల్లడి

  • రెండో దశకు ప్రధాన కట్టడాల్లో మార్పుండదు

  • భారీగా భూసేకరణ, పునరావాస వ్యయం

  • 80 వేల ఎకరాలు సేకరించాలి

  • నిర్వాసిత కుటుంబాలు 85,962

  • వీటన్నిటికీ రూ.28,561 కోట్లు అవసరం

  • ప్రాజెక్టు పూర్తయితే కుడి కాలువ కింద 3.29 లక్షల ఎకరాలకు సాగునీరు

  • ఎడమ కాలువ కింద 4 లక్షల ఎకరాలకు..

  • 10.13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ

  • 13 లక్షల ఎకరాల కృష్ణా ఆయకట్టు కూడా

అమరావతి, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తులో నిర్మిస్తారా.. 194.60 టీఎంసీల నీటి నిల్వ ఉంటుందా లేదా అన్న సందేహాలకు తెరపడింది. 45.72 మీటర్ల గరిష్ఠ కాంటూరులో ప్రాజెక్టు పూర్తవుతుందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) మొట్టమొదటిసారి అధికారికంగా పేర్కొంది. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వీఎల్‌ కాంతారావు గత నెల 25వ తేదీన ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో సందర్శించాక గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టు పూర్తి దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఆయన పోలవరంలో పర్యటించడానికి ముందు.. తొలిదశలో 41.15 మీటర్ల ఎత్తులో 115 టీఎంసీల నిల్వకే ప్రాజెక్టును పరిమితం చేసే గణాంకాలు పీపీఏ వెబ్‌సైట్‌లో కనిపించేవి. ఆయన పర్యటన తర్వాత పోలవరం చిత్రమే పూర్తిగా మారిపోయుంది. రెండో దశలో 45.72 మీటర్ల కాంటూరులో నీటి నిల్వకు అవసరమయ్యే కేంద్ర అటవీ పర్యావరణ అనుమతులు, స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌ ఎత్తివేత వంటివాటిపై జలశక్తి శాఖ చర్యలు తీసుకుంటుందని కాంతారావు స్వయంగా వెల్లడించారు. భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలనూ కేంద్రమే చూసుకుంటుందని హామీ ఇచ్చారు. ఆ క్రమంలోనే గరిష్ఠ మట్టం 45.72 మీటర్ల కాంటూరులో నీటిని నిల్వ చేస్తున్నట్లుగా పీపీఏ తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది. దరిమిలా.. పోలవరం మొదటి దశ పనులు పూర్తి కానున్నందున.. రెండో దశకు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నామన్న సంకేతాలను జలశక్తి శాఖ ఇచ్చినట్లయిందని అధికార వర్గాలు అంటున్నాయి.


వచ్చే ఏడాది జూన్‌కల్లా తొలి దశ పూర్తి..

పోలవరం తొలిదశ పనులు వచ్చే ఏడాది జూన్‌ నాటికి పూర్తి చేస్తామని జల వనరుల శాఖ ధీమాగా చెబుతోంది. 2454 మీటర్ల పొడవైన ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాం పనులు అప్పటికల్లా పూర్తి చేస్తామని కాంట్రాక్టు సంస్థా అంటోంది. 141.435 క్యూమెక్‌ల (50 లక్షల క్యూసెక్కుల) గోదావరి జలాలను బయటకు వదిలే సామర్థ్యంతో 1118.40 మీటర్ల పొడవైన స్పిల్‌వేను ఇప్పటికే నిర్మించారు. 181.999 కిలోమీటర్ల ఎడమ ప్రధాన కాలువ ద్వారా పరీవాహక ప్రాంతంలోని 4 లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది. 178.81 కిలోమీటర్ల కుడి ప్రధాన కాలువ ద్వారా 3.2 లక్షల ఎకరాలకు సాగునీందుతుంది. 45.72 మీటర్ల (150 అడుగుల) ఎత్తులో 194.6 టీఎంసీల చొప్పున రెండు దఫాలుగా 389.2 టీఎంసీలను నిల్వ చేసుకునే వీలుంటుంది. ప్రాజెక్టు పూర్తయితే మొత్తంగా 10.13 లక్షల ఎకరాల గోదావరి, 13 లక్షల ఎకరాల కృష్ణా ఆయకట్టును స్థిరీకరించే వీలుంటుంది. కృష్ణా బేసిన్‌కు 80 టీఎంసీలు, 23.44 టీఎంసీలు పరిశ్రమలకు అందుతాయి. 611 గ్రామాల్లోని 28.5 లక్షల మందికి తాగునీరు దక్కుతుంది. 960 మెగావాట్ల జల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది.

భూసేకరణకు భారీ ఖర్చు..

రెండో దశ చేపడితే ప్రధాన కట్టడాల నిర్మాణాల్లో ఎలాంటి మార్పూ ఉండదు. కానీ భూసేకరణ వ్యయం భారీగా పెరుగుతుంది. 80 వేల ఎకరాలను సేకరించాల్సి ఉంటుంది. మొత్తంగా 8 రెవెన్యూ మండలాల్లో 222 రెవెన్యూ గ్రామాలు ముంపునకు గురవుతాయి. 85,962 నిర్వాసిత కుటుంబాల తరలింపునకు భూసేకరణ, సహాయ పునరావాసానికి, రూ.28,561.43 కోట్లు అవసరమవుతాయి. రెండు దశల్లో కలిపి మొత్తం నిర్వాసిత కుటుంబాలు 1,06,008 ఉంటాయని అంచనా.

Updated Date - Apr 22 , 2026 | 04:15 AM