Share News

ఈ రెండేళ్లలో పోలవరం పనుల్లో 15 శాతం పురోగతి

ABN , Publish Date - Jul 08 , 2026 | 05:31 AM

‘కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో పోలవరం ప్రాజెక్టు పనుల్లో 15 శాతం పురోగతి సాధించాం. అనుకున్న సమయానికి వచ్చే ఏడాది ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తాం’ అని..

ఈ రెండేళ్లలో పోలవరం పనుల్లో 15 శాతం పురోగతి

  • పట్టిసీమ, తాడిపూడి నుంచి నేడు కృష్టా డెల్టాకు నీటి తరలింపు: నిమ్మల

ఏలూరు/ధవళేశ్వరం, జూలై 7(ఆంధ్రజ్యోతి): ‘కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో పోలవరం ప్రాజెక్టు పనుల్లో 15 శాతం పురోగతి సాధించాం. అనుకున్న సమయానికి వచ్చే ఏడాది ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తాం’ అని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ పటిష్ఠానికి రూ.150 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. నిమ్మల మంగళవారం ధవళేశ్వరం బ్యారేజ్‌ను, పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అధికారులతో చర్చించారు. ఆయా సందర్భాల్లో మీడియాతో మాట్లాడారు. ‘పోలవరంలో ముఖ్యమైన ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం గ్యాప్‌-2 పనులు 29 శాతం, గ్యాప్‌-1 పనులు 48 శాతం పూర్తయ్యాయి. ఇప్పటి వరకు కేంద్రం రూ.8,323 కోట్లు అడ్వాన్సుగా ఇవ్వగా నిర్వాసితులకు రూ.2,250 కోట్లు పరిహారంగా పంపిణీ చేశాం. త్వరలో జరిగే సీఎం పర్యటనలో నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు పరిహారం అందిస్తాం. కృష్టా డెల్టాలో సాగునీటి సమస్య తీర్చడానికి పట్టిసీమ, తాడిపూడి ఎత్తిపోతల ద్వారా బుధవారం నుంచి నీరు విడుదల చేస్తాం. ప్రాజెక్టును టూరిజం హబ్‌గా చేస్తాం. రిసార్టులు, వాటర్‌ స్పోర్ట్స్‌, పార్కులు అభివృద్ధి చేస్తాం’ అని వెల్లడించారు. 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న ధవళేశ్వరం బ్యారేజ్‌ గేట్లు బలహీనపడ్డాయని.. 117 గేట్ల స్థానంలో కొత్తవి అమరుస్తున్నామని, వచ్చే వారం (బహుశా 13వ తేదీన) సీఎం చేతుల మీదుగా ఈ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు.

Updated Date - Jul 08 , 2026 | 05:32 AM