మార్చి 31నాటికి పోలవరం సిద్ధం!
ABN , Publish Date - Jul 14 , 2026 | 03:47 AM
రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు తొలిదశ పనులన్నీ వచ్చే మార్చి 31వ తేదీ నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
అప్పటికల్లా తొలిదశ పూర్తిచేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తాం
18న రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల
మొదటి దశ పనులన్నిటికీ నిధులు కోరతాం
రెండో దశ పనులకూ చాలా డబ్బు కావాలి
ప్రాజెక్టును 37 సార్లు సందర్శించా..136 సార్లు వర్చువల్ రివ్యూ చేశా
ఆగస్టు 14న అనకాపల్లిలో గోదావరి జలాలకు అఖండ హారతి
శ్రీశైలంలో నిల్వలుంటే సెప్టెంబరు 1న వెలిగొండ నుంచి నీటి విడుదల
మూడేళ్లలో 36 ప్రాధాన్య ప్రాజెక్టులు పూర్తి
9 నెలల్లో కాటన్ బ్యారేజీకి 117 గేట్లు: సీఎం
ధవళేశ్వరం, పోలవరం ప్రాజెక్టుల సందర్శన
2019 నాటికి పోలవరం పనులు 72 శాతం పూర్తి చేశాం. జగన్ ఐదేళ్ల హయాంలో కేవలం రెండు శాతం పనులే జరిగాయి. 2024లో కూటమి వచ్చాక ఈ రెండేళ్లలోనే 15 శాతం పనులు పూర్తి చేశాం.
- సీఎం చంద్రబాబు
అమరావతి/అమలాపురం/ఆత్రేయపురం/రాజమహేంద్రవరం, జూలై 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు తొలిదశ పనులన్నీ వచ్చే మార్చి 31వ తేదీ నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆపై గోదావరి నదికి వరద వచ్చిన వెంటనే ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని వెల్లడించారు. ఈ నెల 18వ తేదీన రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వస్తున్నారని.. పోలవరం తొలిదశలో కేంద్రం నుంచి రావలసిన నిధులు మంజూరు చేయాలని కోరతామని చెప్పారు. సోమవారం ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అంతకుముందు మధ్యాహ్నం 12.15 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండల పరిధిలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్దకు వెళ్లారు. రూ.153 కోట్ల వ్యయంతో చేపట్టిన 117 కొత్త గేట్ల ఏర్పాటు పనులకు శ్రీకారం చుట్టారు. అక్క డ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు.
ఆ తర్వాత పిచ్చుకలంకలో రైతులతో ఏర్పాటుచేసిన భారీ సభలో ప్రసంగించారు. తర్వాత పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో వర ద ప్రవాహాన్ని హెలికాప్టర్లో తిలకించారు. అనంతరం క్షేత్ర స్థాయికి వెళ్లి ఎర్త్ కమ్ రాక్ ఫిల్(ఈసీఆర్‌ఎఫ్) డ్యాం గ్యాప్-2, గ్యాప్-1, జలవిద్యుత్కేంద్రం, ట్విన్ టన్నెళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారుల తో, జిల్లా కలెక్టర్లతోనూ ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను ఇప్పటికి 37 సార్లు పోలవరం ప్రాజెక్టు ను సందర్శించానని.. 136 సార్లు వర్చువల్‌గా సమీక్షించానని గుర్తుచేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
ఆ వెంటనే రెండో దశ పనులు..
2019లో టీడీపీ గెలిచి ఉంటే 2021 నాటికి పోలవ రం పూర్తయ్యేది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పనుల ను మరింత వేగవంతం చేసి ప్రస్తుతం 89 శాతం పురోగతి సాధించాం. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ నాటికి పోలవరం తొలిదశ పనులు పూర్తయిన వెంట నే.. రెండో దశ పనులు ప్రారంభిస్తాం. అధిక నిధులు వ్యయం చేయాల్సి ఉన్నందున.. రానున్న మూడేళ్లలో రెండో దశ పనులు పూర్తి చేయడం కష్టమే. శ్రీశైలం జలాశయంలోకి కృష్ణా జలాలు వచ్చి నీటి నిల్వలు చేరితే.. సెప్టెంబరు 1న వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేస్తాం. ప్రాజెక్టు టన్నెల్ పనులు పూర్తికాకుండా.. ఎన్నికలకు ముందు హడావుడిగా వెలిగొండను జాతికి అంకితం ఇస్తున్నట్లు ప్రకటించి నాటి సీఎం జగన్ ప్రజలను మోసం చేశారు. మేం వచ్చాక నిర్వాసితులకు క్రమం తప్పకుండా భూసేకరణ నష్టపరిహారం చెల్లిస్తున్నాం. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందు.. అనకాపల్లిలో గోదావరి జలాలకు అఖండ హారతి ఇస్తా(అంటే పోలవరం ఎడమ కాలువ నుంచి నీటిని విడుదల చేస్తారు). అనకాపల్లి తర్వాతి ప్రాంతాలకు వచ్చే ఏడాది నీరిస్తాం. పారిశ్రామిక వినియోగానికి కూడా అందిస్తాం. విశాఖ వరకు గోదావరి జలాలను తరలించి.. ఉత్తరాంధ్రలోని వంశధార నదికి అనుసంధానం చేస్తాం. రాష్ట్రంలోని 36 ప్రాధాన్య ప్రాజెక్టులనూ మూడేళ్లలో పూర్తి చేస్తాం. గోదావరి డెల్టాకు శాశ్వత రక్షణ కల్పించేందుకు ప్రభు త్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ధవళేశ్వరం బ్యారేజ్‌కు కొత్త గేట్లు బిగిస్తున్నాం. పుష్కరాల నాటికి 117 గేట్లూ మారుస్తాం.
జగన్ పోలవరానికి నష్టం చేశాడు..
2019లో జగన్ అధికారంలోకి వచ్చి పోలవరం ప్రాజెక్టుకు తీరని నష్టం చేశాడు. డయాఫ్రం వాల్ కొట్టుకుపోయినా గుర్తించలేదు. దీంతో నేను నిద్రలేని రాత్రులు గడిపాను. మళ్లీ నేనొచ్చాక రూ.990 కోట్లు వ్యయం చేసి కొత్త వాల్‌ను ఈ ఏడాది ఏప్రిల్ 2నాటికి పూర్తి చేశాం. ఈసీఆర్‌ఎఫ్ డ్యాం పనులు వేగంగా పూర్తవుతున్నాయి. పోలవరం ఎడమ కాలువ రక్షణ పనుల కోసం రూ.200 కోట్లు వ్యయం చేస్తాం. ప్రాజె క్టు సమీపంలో ఐకానిక్ బ్రిడ్జ్, స్పిల్‌వే డిజైన్లపై మంగళవారం అమరావతిలో సమీక్ష నిర్వహిస్తాం. నిర్వాసితులకు న్యాయం చేస్తాం. అనుకున్న సమయానికి పోలవరం పూర్తయితే ఉమ్మడి గోదావరి జిల్లాల్లో నీటి సమస్య శాశ్వతంగా తగ్గుతుంది. జగన్ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులను, వాటి నిర్వహణను పట్టించుకోలే దు. గేట్లు కొట్టుకుపోయినా కన్నెత్తి చూడలేదు. గ్రీజు పెట్టేందుకు కూడా నిధులివ్వలేదు. తుంగభద్ర ప్రాజెక్టుకు మొత్తంగా కొత్త గేట్లు బిగించాం. గత రెండేళ్లలో సాగునీటి రంగంపై రూ.24 వేల కోట్లు ఖర్చుచేశాం.
కాటన్ ఆనకట్టే కారణం..
గోదావరి డెల్టా దేశానికి అన్నపూర్ణ అనే ఖ్యాతి రావడానికి సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ధవళేశ్వరం ఆనకట్టే కారణం. 2.9 టీఎంసీల నిల్వ సామర్థ్యం, 32.2 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేలా.. ఈస్ట్రన్, సెంట్రల్, వెస్ట్రన్ గోదావరి డెల్టాలకు కలిపి 10.13 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ఈ బ్యారేజ్ కు రూపకల్పన చేసిన మహనీయుడు కాటన్. 2014-19 మధ్య రూ.32 కోట్లతో ధవళేశ్వరం బ్యారేజ్‌లో 58 కొత్త గేట్లు అమర్చాం. మిగిలిన 117 పాత గేట్ల స్థానంలో కొత్తవాటిని 9 నెలల్లోనే అమర్చే విధంగా చర్యలు చేపట్టాం.
వైభవంగా గోదావరి పుష్కరాలు..
గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తాం. పుష్కర ఘాట్ల అభివృద్ధితో పాటు రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో సుమారు రూ.1200 కోట్లతో పుష్కర యాత్రికుల కోసం మౌలిక వసతులు కల్పిస్తున్నట్టు వెల్లడించారు. పిచ్చుకలంక, బొబ్బర్లంక ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నాం. కోనసీమకు రైల్వేలైన్‌ను తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. కొవ్వూరులో కోకోసిటీ ఏర్పాటు ద్వారా కోకో సాగును ప్రోత్సహించడంతోపా టు చాక్లెట్ల పరిశ్రమను ఇక్కడ నెలకొల్పుతాం. వాతావరణ మార్పులు, ఎల్‌నినో నేపథ్యంలో పంటల ఎంపికలో రైతులు శాస్ర్తీయ విధానాలు పాటించాలి.
వారిపై కఠిన చర్యలే..
గంజాయి, డ్రగ్స్, రౌడీయిజంపై ఎట్టి పరిస్థితుల్లో నూ రాజీపడం. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు, వ్యక్తిత్వ హననం, సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. వీటిని తీవ్రంగా పరిగణిస్తున్నాం.గంజాయి బ్యాచ్‌లను పెంచి పోషించడమే కాకుండా, గంజాయి సాగును గొడ్డలి పార్టీయే ప్రోత్సహించింది. పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులపై అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఆడవాళ్లను అసభ్యకరంగా మాట్లాడేవారిని గొడ్డలి పార్టీ సమర్థిస్తోంది. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ ఆ పార్టీ నేతలు స్టూడియోలు పెట్టి ఫైనాన్స్ చేస్తూ ప్రోత్సహిస్తున్నారు. వీరిపై కఠినచర్యలు తీసుకుంటాం.
పునర్నిర్మాణమే లక్ష్యం..
రాష్ట్ర పునర్నిర్మాణమేకూటమి ప్రభుత్వ లక్ష్యం. ప్రధాని మోదీ, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలసి ప్రతీ హామీని నెరవేరుస్తున్నాం. ఈ నెలలోనే తల్లికి వందనం నిధులు విడుదల చేస్తాం. ప్రతి నెలా 1న సామాజిక భద్రతా పెన్షన్లు, రైతు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. గోదావరి జిల్లాల ప్రజలు గతంలో టీడీపీకి అపూర్వ ఆదరణ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో కూటమికి ఇచ్చిన భారీ విజయాన్ని రాష్ట్ర అభివృద్ధికి ఆశీర్వాదంగా భావిస్తున్నాం. సవాళ్లను అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్నాం.
ప్రాజెక్టుల సమాచారం ఇవ్వలేని వాసర్
పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలోని సమావేశ మందిరంలో సమీక్ష సందర్భంగా.. ఈ ఏడాది వర్షపాతం.. ప్రాజెక్టులకు జలాల చేరికపై వాసర్ సంస్థను సీఎం ఆరా తీశారు. సోమవారంనాటికి ఏయే డ్యాంలలో ఎం త ప్రవాహం ఉందో అంచనా వేశారా అని ప్రశ్నించా రు. ఇంకా అంచనా వేయలేదని వాసర్ వెల్లడించింది.
శశిభూషణ్ ఆగ్రహం
సీఎం పర్యటన సందర్భంగా వచ్చిన జలవనరుల శాఖ ప్రత్యేక సీఎస్ శశిభూషణ్ కుమార్ వేమగిరి వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్దకు వెళ్తుండగా సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను అడ్డుకున్నారు. ఆయన మండిపడి.. వెంటనే బయటకు వచ్చి తన కారెక్కారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు వెంటనే వాహనం వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడి సర్దిచెప్పి హెలిప్యాడ్ వద్దకు తీసుకెళ్లారు.