Share News

‘పోలవరం’ నాణ్యత పెరిగింది.. మరింత పెరగాలి

ABN , Publish Date - May 30 , 2026 | 04:01 AM

‘పోలవరం ప్రధాన కట్టడాల్లో గతంతో పోల్చితే నాణ్యత పెరిగింది. కానీ ఇంకా పెరగాల్సి ఉంది’ అని పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన విదేశీ నిపుణుడు సీన్‌ హించ్‌ బెర్గర్‌ చెప్పారు.

‘పోలవరం’ నాణ్యత  పెరిగింది.. మరింత పెరగాలి

  • విదేశీ నిపుణుడు హించ్‌ బెర్గర్‌

అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): ‘పోలవరం ప్రధాన కట్టడాల్లో గతంతో పోల్చితే నాణ్యత పెరిగింది. కానీ ఇంకా పెరగాల్సి ఉంది’ అని పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన విదేశీ నిపుణుడు సీన్‌ హించ్‌ బెర్గర్‌ చెప్పారు. ప్రాజెక్టు పనుల పరిశీలనకు వచ్చిన ఆయన శుక్రవారం రాజమండ్రిలోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) కార్యాలయంలో సీఈవో సంజీవ్‌ వోరా, ఈఎన్‌సీ నరసింహమూర్తి తదితరులతో సమీక్షించారు. ఈ సందర్భంగా గతంలో పోలవరం విదేశీ నిపుణులు వెలిబుచ్చిన అభ్యంతరాలపై ఈఎన్‌సీ నరసింహమూర్తి వివరణను ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు ప్రధాన కట్టడం డయాఫ్రమ్‌ వాల్‌, ఇతర నిర్మాణాలపైనా ఎక్స్‌పర్ట్‌ ప్యానెల్‌ సభ్యులు(పీఓఈ) వెలిబుచ్చిన అభ్యంతరాలపై చర్చ జరిగింది. ఈ సమయంలో పీఓఈ వెలిబుచ్చిన అభ్యంతరాలను పరిష్కరించిన తీరును, సాంకేతికంగా సరిదిద్దిన వైనాన్ని నరసింహమూర్తి వివరించారు. మరికొన్ని అంశాల్లో తీసుకున్న చర్యలపై లిఖిత పూర్వకంగా వివరణ ఇస్తామన్నారు. ఈ చర్యలపై హించ్‌ బెర్గర్‌ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీవోఈ అభిప్రాయాలతో కూడిన నివేదికను పీపీఏకు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా హించ్‌ బెర్గర్‌ వివరించారు.

Updated Date - May 30 , 2026 | 04:01 AM