పోలవరం ‘రెండో దశ’పై కృతజ్ఞతలు!
ABN , Publish Date - Apr 23 , 2026 | 04:00 AM
పోలవరం ప్రాజెక్టు రెండో దశలో భాగంగా 45.72 మీటర్ల కాంటూరులో 194.60 టీఎంసీల జలాలను నిల్వ చేసే దిశగా కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించడంపై రాష్ట్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది.
జలశక్తి శాఖ కార్యదర్శితో ఫోన్‌లో మాట్లాడిన సీఎస్
అమరావతి, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు రెండో దశలో భాగంగా 45.72 మీటర్ల కాంటూరులో 194.60 టీఎంసీల జలాలను నిల్వ చేసే దిశగా కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించడంపై రాష్ట్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. ‘ఆంధ్రజ్యోతి’లో బుధవారం ప్రచురితమైన ‘పోలవరం ఎట్ 45.72 మీటర్లు’ కథనంపై సీఎం చంద్రబాబు స్పందించారు. కేంద్రం నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. దీంతో పోలవరం కల సాకారమవుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై జలశక్తి కార్యదర్శి వీఎల్ కాంతారావుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ బుధవారం ఫోన్‌లో కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని కాంతారావు హామీ ఇచ్చారు. ఈ నెల 30న ఢిల్లీకి రావాలని సీఎస్‌ను ఆహ్వానించారు. గోదావరి- కావేరి అనుసంధాన పథకంపై ఈ సమావేశంలో చర్చిద్దామని సూత్రప్రాయంగా వెల్లడించారు. తెలంగాణ ప్రతిపాదిస్తున్నట్లుగా ఇచ్ఛంపల్లి నుంచి కాకుండా పోలవరం నుంచి కావేరి అనుసంఽధాన పథకం అమలు చేయాలని సాయిప్రసాద్ ప్రతిపాదించారు. అన్ని అంశాలపై సమగ్రంగా చర్చద్దామని కాంతారావు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 30న ప్రభుత్వ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావుతో కలసి ఢిల్లీకి వెళ్లాలని సీఎస్ నిర్ణయించారు.