పోలవరం పనులు బాగుబాగు!
ABN , Publish Date - Feb 19 , 2026 | 03:58 AM
పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం పనుల్లో వేగం పెరిగిందని అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్ సంతృప్తి వ్యక్తం చేసింది.
వచ్చే ఏడాది జూన్‌కు పూర్తవుతుంది.. నిపుణుల విశ్వాసం
డయాఫ్రం వాల్ నాణ్యత భేష్
బయట 19 మీటర్ల ఎత్తు ఉండేలా చూడండి.. వాటర్ బ్లీడింగ్‌పైనా దృష్టి
అంతర్జాతీయ నిపుణుల ప్రాథమిక నివేదిక.. త్వరలోనే తుది నివేదిక!
అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం పనుల్లో వేగం పెరిగిందని అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్ సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం పనులు చూస్తుంటే.. వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తవుతాయన్న విశ్వాసం కలుగుతోందని పేర్కొంది. ప్రాజెక్టు పనులపై అధ్యయనం.. సిఫారసులు, సూచనలు ఇచ్చేందుకు కేంద్ర జలసంఘం నియమించిన నలుగురు సభ్యుల బృందంలోని ముగ్గురు నిపుణులు డేవిడ్ బి.పాల్, గియాస్ ఫ్రాంకో డి.సిక్కో (అమెరికా), సీస్ హించ్‌బెర్జర్ (కెనడా) గతనెల 19-21 మధ్య ప్రాజెక్టు క్షేత్రంలో పర్యటించారు. గతేడాది 2025 ఆగస్టులో జరిపిన పర్యటనలో పరిశీలించిన అంశాలతో కలిపి తమ ప్రాథమిక నివేదికను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా జల సంఘానికి పంపించారు. డయాఫ్రం వాల్ పనుల్లో నాణ్యత బాగుందని తెలిపారు. వాల్ ఎత్తు భూమిపైన 20 మీటర్ల ఎత్తులో ఉండాలని నిర్ధారించుకున్నా.. తర్వాత దాన్ని 19 మీటర్లకు కుదించామని.. అయితే 18.5మీటర్లే ఉండేలా ‘కట్’ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఎత్తును 19 మీటర్లకు పెంచాలని స్పష్టం చేశారు. ఈసీఆర్‌ఎఫ్ డ్యాం ఎత్తు 53.38 మీటర్లు ఉండాలన్న డిజైన్‌ను ఆమోదించారు. కాగా.. వీరు తమ తుది నివేదికను త్వరలోనే కేంద్ర జల సంఘానికి అందజేస్తారని జల వనరుల శాఖ అధికారులు వెల్లడించారు.