అడుగడుగునా రక్షణ నేత్రం
ABN , Publish Date - May 27 , 2026 | 05:52 AM
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రపంచ శ్రేణి ఇంజనీరింగ్ అద్భుతానికి అడుగడుగునా అత్యాధునిక సాంతికేతకతను జోడించిన వైనం ఆసక్తికరం. ప్రత్యేకించి స్పిల్ వే భద్రతకు తీసుకున్న చర్యలు, అనుక్షణం పరిస్థితిని కంట్రోల్ రూమ్‌లోని డ్యాష్ బోర్డు నుంచి...
అత్యాధునిక టెక్నాలజీతో నిరంతర పర్యవేక్షణ
అమరావతి, మే 26(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రపంచ శ్రేణి ఇంజనీరింగ్ అద్భుతానికి అడుగడుగునా అత్యాధునిక సాంతికేతకతను జోడించిన వైనం ఆసక్తికరం. ప్రత్యేకించి స్పిల్ వే భద్రతకు తీసుకున్న చర్యలు, అనుక్షణం పరిస్థితిని కంట్రోల్ రూమ్‌లోని డ్యాష్ బోర్డు నుంచి... ప్రత్యేక సమయాల్లో నిర్దేశిత అధికార నిపుణుల మొబైల్ నుంచి కూడా పర్యవేక్షించే అవకాశం ఉండడం విశేషం. ఈ పర్యవేక్షణ కేవలం లెక్కలకు మాత్రమే పరిమితం కాలేదు. అదుబాటులోకి వచ్చిన ప్రతి అంకెనూ విశ్లేషించి, డ్యామ్ పరిస్థితిని కళ్లకు కట్టే కృత్రిమ మేధతో అనుసంధానమైన పర్యవేక్షణ పోలవరం సొంతం. పైకి కనిపించే 47 గేట్లు, కనిపించని నాలుగు రివర్స్ స్లూయిజ్ గేట్లు.. వాటికి మరింత లోతులో రెండు చివర్లనూ అనుసంధానిస్తూ గ్యాలరీ (వాక్ వే)ని నిర్మించారు. ఆ గ్యాలరీ ఆసాంతం నడవడానికి మనకు కనిష్ఠంగా గంటకుపైగా సమయం పడుతుంది. అక్కడే అనేక సెన్సార్లు.. పీజో మీటర్, ఫౌండేషన్ పీజో మీటర్, అప్ లిఫ్ట్ ప్రెషర్ మీటర్, జాయింట్ మీటరు, టెంపరేచర్, ఫోర్ ప్రెజర్, టిల్ట్ మీటర్, స్ట్రెస్ మీటర్ వంటివి సుమారుగా 10 రకాల సెన్సార్లు అమర్చారు. ఇవి నిత్యం డ్యామ్ పరిస్థితిని తెలియచేస్తాయి. భూగర్భంలో కొన్ని వందల మీటర్ల లోతు నుంచి వేసిన కాంక్రీట్ పునాదుల ఉష్ణోగ్రతల్లో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు పసిగట్టే సెన్సార్లు అమర్చారు. ఇవి దీర్ఘకాలంలో కట్టడం స్థితిగతులను అంచనా వేస్తాయి.
ఏ కాంక్రీట్ గోడ అయినా ఎంతో కొంత సీపేజ్ తప్పదు. అయితే చెమ్మ ఊట పెరుగుతుందని సెన్సర్ల ద్వారా గమనించిన వెంటనే సివిల్ ఇంజనీరింగ్ నిపుణులు రంగంలోకి దిగి దానిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటారు. నీటి ఉధృతి పెరుగుతున్నప్పుడు స్పిల్ వే కట్టడంపై ఒత్తిడిని తట్టుకొని నిలబడే క్రమంలో కంటికి కనిపించని స్థాయిలో స్పిల్ వే ‘టిల్ట్’(ఒరుగుతుంది) అవుతుంది. నది ఉధృతి పెరుగుతున్న క్రమంలో ఈ టిల్టింగ్ ఏ స్థాయిలో ఉంది? అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు రికార్డు చేసి కంట్రోల్ రూమ్ లోని డ్యాష్ బోర్డుకు చేరవేసే సెన్సార్లు కీలకం కానున్నాయి. ప్రవాహ ఉధృతిని అంచనా వేయండంలో కూడా సెన్సార్లు ఎంతో కీలకంగా వ్యవహరిస్తాయి. క్లుప్తంగా చెప్పాలంటే స్పిల్ వే రక్షణకు అత్యాధునిక సెన్సార్లు అమర్చారు. ఇలాంటి సెన్సార్లే రిజర్వాయర్ ప్రధాన ఆనకట నిర్మాణం ప్రతి పొరలోనూ నిక్షిప్తం చేసుకుంటూ వస్తున్నారు.