పోలవరం పనుల్లో వివాదాలు తొలగించండి
ABN , Publish Date - Apr 17 , 2026 | 04:26 AM
పోలవరం, వెలిగొండ ప్రాజెక్టుల పనుల్లో ఎదురైన న్యాయ వివాదాలను తొలగించాలని అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ను జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు అభ్యర్థించారు.
ఏజీ దమ్మాలపాటికి మంత్రి నిమ్మల వినతి
అమరావతి, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): పోలవరం, వెలిగొండ ప్రాజెక్టుల పనుల్లో ఎదురైన న్యాయ వివాదాలను తొలగించాలని అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ను జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు అభ్యర్థించారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువలోని ఏడో ప్యాకేజీ పనులు దాదాపు 80 శాతం పూర్తయ్యాయి. కాంట్రాక్టు సంస్థకు రూ.30 కోట్ల దాకా చెల్లింపులు జరపాల్సి ఉంది. తమకు బిల్లులివ్వడం లేదని ఆ సంస్థ కోర్టుకెళ్లింది. వరుస క్రమంలో బిల్లులు చెల్లిస్తున్నామని ప్రభుత్వం నివేదించింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. కాంట్రాక్టు సంస్థపై ఎలాంటి చర్యా తీసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ప్రభుత్వం అప్పీలుకు వెళ్లింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. వీలైనంత త్వరగా నిర్ణయం వెలువరించేలా హైకోర్టును అభ్యర్థించాలని కోరుతూ ఏజీ దమ్మాలపాటిని మంత్రి నిమ్మల కోరారు.