పోలవరం నిర్వాసితులకు జూన్‌లోగా పరిహారం
ABN , Publish Date - Jan 25 , 2026 | 04:12 AM
పోలవరం ప్రాజెక్టు తొలి దశ (41.15 మీటర్ల కాంటూరు) నిర్వాసితులకు జూన్‌లోగా పరిహారం అందజేయాలని జల వనరుల శాఖ నిర్ణయించింది.
21,709 కుటుంబాలకు రూ.2427.98 కోట్లు అవసరమని అంచనా
డిసెంబరులోగా పునరావాస కాలనీలు పూర్తి
అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు తొలి దశ (41.15 మీటర్ల కాంటూరు) నిర్వాసితులకు జూన్‌లోగా పరిహారం అందజేయాలని జల వనరుల శాఖ నిర్ణయించింది. మొత్తం 21,709 నిర్వాసిత కుటుంబాలకు రూ.2,427.98 కోట్లు అవసరమని అంచనా వేస్తోంది. ప్రాజె క్టు తొలిదశ పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్న జల వనరుల శాఖ, ఆలోగా నిర్వాసితులకు పునరావాస కాలనీలను కూడా సిద్ధం చేయాలని నిర్ణయించుకుంది. తొలిదశలో 1,00,099.58 ఎకరాలను సేకరించాల్సి ఉండగా, ఇప్పటికే 91,126.96 ఎకరాల ను సేకరించింది. తొలి దశలో 38,060 నిర్వాసిత కుటుంబాలను రెవెన్యూ, జల వనరుల శాఖలు గుర్తించాయి. వీరి కోసం 75 పునరావాస కాలనీలను నిర్మించాలని నిర్ణయించారు. వీటిలో 28 కాలనీల నిర్మాణం పూర్తయ్యింది. మరో 49 కాలనీలు నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పటికే పునరావాస కాలనీలకు 16,291 కుటుంబాలను తరలించారు. మరో 21,769 కుటుంబాలను తరలించాల్సి ఉంది. భూమికి భూమి ఇవ్వడం కోసం 17,114 కుటుంబాలను గుర్తించారు. వీరి కోసం 7,012 ఎకరాలను సేకరించాల్సి ఉండగా.. 5,911.34 ఎకరాలు సేకరించారు. పునరావాస కాలనీలను డిసెంబరులోగా నిర్మించాలని నిర్ణయించుకుంది.