Share News

కాలంతో పోటీ!

ABN , Publish Date - May 25 , 2026 | 04:20 AM

అసాధ్యం... అనుకున్నది సుసాధ్యమవుతోంది. మట్టిపనులు తప్ప తట్టెడు కాంక్రీటు ఎరుగని పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు పూర్తిస్థాయి స్పిల్‌వే గేట్లతో నిలువెత్తు అద్భుతంగా సాక్షాత్కరిస్తోంది.

కాలంతో పోటీ!

  • నీరు ఉరకలు వేయాలి..

  • పనులు పరుగులు తీయాలి

  • శరవేగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం

  • సాంకేతికత, ఇంజనీరింగ్‌ నైపుణ్యం మేళవింపు

  • పుష్కరాలకు తొలిదశ.. డెడ్‌లైన్‌ వచ్చే ఏడాది జూన్‌

  • రాత్రింబవళ్లూ ప్రధాన డ్యామ్‌ పనులు

  • భద్రతకు ప్రాధాన్యం.. 3 దశల్లో తనిఖీలు

  • కుడి, ఎడమ ప్రధాన కాలువలకు కనెక్టివిటీలను పూర్తి చేయడంపైనా దృష్టి

  • దేశంలో మరే ప్రాజెక్టుకూ లేని ప్రత్యేకతలు

  • నదీ ప్రవాహాన్ని మళ్లించి ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌

  • సెల్‌ఫోన్‌తోనూ స్పిల్‌ వే గేట్ల నిర్వహణ

రెండింటి సారాంశం ఒక్కటే! పోలవరం ఒక కలగానే మిగిలిపోతుందని! కానీ... ఆ కల ఇప్పుడు సాకారమవుతోంది. 48 గేట్లతో నిలువెత్తు స్పిల్‌వే రూపంలో సాక్షాత్కరిస్తోంది. శరవేగంగా జరుగుతున్న ‘మట్టి-రాతి కట్ట’ (ఎర్త్‌కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌) పనుల సాక్షిగా కళ్లముందు కనిపిస్తోంది. కుడి, ఎడమ కాలువల సొరంగాలు గోదావరి జలాలకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నాయి. ‘2027 జూన్‌ నాటికి... గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం తొలి దశ పూర్తి చేస్తాం’’ అనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా అక్కడ నిర్మాణ యజ్ఞం జరుగుతోంది. పోలవరం ప్రత్యేకతలు, ఇంజనీరింగ్‌ అద్భుతాలు, అక్కడ జరుగుతున్న పనుల తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించి ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న సచిత్ర, సవివర కథనమిది!

(పోలవరం నుంచి ‘ఆంధ్రజ్యోతి’ బృందం)

అసాధ్యం... అనుకున్నది సుసాధ్యమవుతోంది. మట్టిపనులు తప్ప తట్టెడు కాంక్రీటు ఎరుగని పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు పూర్తిస్థాయి స్పిల్‌వే గేట్లతో నిలువెత్తు అద్భుతంగా సాక్షాత్కరిస్తోంది. అత్యాధునిక సాంకేతికత, ఇంజనీరింగ్‌ నైపుణ్యంతో సంక్లిష్టతలను దాటుకుని ముందుకు సాగుతోంది. గోదావరి ప్రవాహం, నిర్మాణ ప్రాంతం దృష్ట్యా... పోలవరం ప్రాజెక్టు అత్యంత సంక్లిష్టమైనది! అనేక అధ్యయనాల అనంతరం గోదావరిపై ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పుడున్న స్థలాన్ని ఎంపిక చేశారు. సాధారణంగా నదికి అడ్డంగా ‘స్పిల్‌వే’ నిర్మిస్తారు. రాతి పొర తగిలేదాకా వెళ్లి... అక్కడి నుంచి పునాదులు తవ్వి, కాంక్రీట్‌ నిర్మాణం చేపడతారు. కానీ... పోలవరం ప్రత్యేకమైనది. గోదావరి గర్భంలో లోతుకు వెళ్లేకొద్దీ ఇసుక, మట్టే! అంతలోతుల్లోకి వెళ్లి.. అక్కడి నుంచి పునాదులు తీసి స్పిల్‌వే నిర్మించడం అసాధ్యం. అందుకే... పోలవరంలో ‘సైడ్‌ స్పిల్‌వే’ అవసరమైంది.


గోదావరి ప్రవాహానికి అవతల ఓ వైపు స్పిల్‌వేను నిర్మించారు. ప్రధాన ఆనకట్ట (ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ -ఈసీఆర్‌ఎఫ్‌)తో నదీ ప్రవాహాన్ని అడ్డుకుని, స్పిల్‌వే వైపు మళ్లించేలా పోలవరాన్ని డిజైన్‌ చేశారు. స్పిల్‌వే నిర్మాణం వంద శాతం పూర్తయింది. మిగిలింది... ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణమే. ఈ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దీని కోసం ప్రత్యేకంగా అప్పర్‌ కాఫర్‌ డ్యామ్‌, లోయర్‌ కాఫర్‌ డ్యామ్‌లను నిర్మించారు. ఈ రెండింటి మధ్య... భూగర్భంలో డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించారు. దానిపైన ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మిస్తున్నారు. దీనికి సమాంతరంగా కుడి, ఎడమ కాలువల పనులూ జరుగుతున్నాయి. ప్రస్తుతం తొలిదశలో సహాయ, పునరావాస కార్యక్రమాలు దాదాపుగా పూర్తయ్యాయి. ఈసీఆర్‌ఎఫ్‌ పనులు పూర్తయితే... పోలవరంలో 119 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. కుడి, ఎడమ కాలువల ద్వారా గ్రావిటీతోనే నీటిని మళ్లించవచ్చు. పోలవరం తొలిదశ పూర్తికి ప్రభుత్వం వచ్చే ఏడాది జూన్‌ను గడువుగా పెట్టుకుంది. సహాయ, పునరావాస కార్యక్రమం రెండో దశ కూడా పూర్తయితే... పోలవరంలో 194 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం లభిస్తుంది.


ఇదీ పోల‘వరం’

  • ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 194.6 టీఎంసీలు. దీర్ఘకాలం పాటు పూర్తి స్థాయిలో నీరు నిల్వ చేసుకునే అవకాశముంది. దీంతో ఏడాదిలో దాదాపు రెట్టింపు స్థాయిలో 322 టీఎంసీల దాకా గోదావరి జలాలను వాడుకునే వీలుంటుంది.

  • సాగు కోసం 7.2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 23.5 లక్షల ఎకరాల స్థిరీకరణ జరుగుతుంది.

  • 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా నదిలోకి మళ్లించేందుకు వీలుంది. గోదావరి ట్రైబ్యునల్‌ ఆదేశాల మేరకు గోదావరి జలాలను కృష్ణాకు అనుసంధానం చేస్తే 45 టీఎంసీలు ఏపీకి, 21 టీఎంసీలు కర్ణాటకకు, 14 టీఎంసీలు మహారాష్ట్రకు ఇవ్వాల్సి ఉంది.

  • పోలవరం ప్రాజెక్టుకు అనుబంధంగా 960 మెగావాట్ల జల విద్యుత్తు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఏడాదిలో దాదాపు ఆరు నెలలపాటు ఇక్కడ విద్యుదుత్పత్తి జరిగే అవకాశముంది.

  • కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా రాష్ట్రంలోని 540 గ్రామాలలో 28.5 లక్షల మందికి తాగునీరు అందుతుంది. ఒడిశా,ఛత్తీస్‌గఢ్ లకు 5 టీఎంసీల నీరందుతుంది.

Untitled-2 copy.jpg


తొలిదశ ఆర్‌అండ్‌ఆర్‌ దాదాపు పూర్తి

పోలవరం ప్రాజెక్టులో స్పిల్‌ వేను పూర్తి స్థాయిలో నిర్మించారు. అయితే... పునరావాసం, పరిహారం, నిర్వాసితుల తరలింపును దృష్టిలో ఉంచుకుని తొలి దశలో 41.15 మీటర్ల కాంటూరులో 119 టీఎంసీల నీటిని నిల్వ చేస్తారు. ఎనిమిది మండలాల పరిధిలోని 90 రెవెన్యూ గ్రామాలు, 172 హేబిటేషన్లపై ముంపు ప్రభావం ఉంటుంది. రెండు దశల్లో కలిపి 1,00,099 ఎకరాలను సేకరించాల్సి ఉండగా, 93,508 ఎకరాలు సేకరించారు. మరో 6,590 ఎకరాలు సేకరించాల్సి ఉంది. తొలి దశలో సహాయ పునరావాస కాలనీల్లో 34,360 ఇళ్లను నిర్మించాల్సి ఉండగా... 15,878 ఇళ్లను నిర్మించారు. మరో 18,482 ఇళ్లను నిర్మించాల్సి ఉంది. ఇందుకు రూ.4,935 కోట్ల నిధులు అవసరం. రెండో దశలో భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల కోసం మరో రూ.32,000 కోట్లు అవసరమని అధికారులు చెబుతున్నారు.

Untitled-2 copy.jpg


మొబైల్‌తో గేట్లు ఎత్తొచ్చు!

ఇంట్లో కూర్చుని మొబైల్‌ యాప్‌ ద్వారా పొలంలో మోటర్‌ ఆన్‌ చేయడం చూస్తున్నాం. కానీ... పోలవరం గేట్లను కూడా మొబైల్‌ ద్వారా ఆపరేట్‌ చేయొచ్చంటే నమ్ముతారా? స్పిల్‌ వేకు 48 రేడియల్‌ గేట్లను బిగించారు. ఒక్కో రేడియల్‌ గేట్‌ పొడవు 20.835 మీటర్లు, వెడల్పు 15.96 మీటర్లు. ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా క్షణాల్లో నిర్ణయం తీసుకుని... మొబైల్‌ ద్వారానే ఈ గేట్లను ఆపరేట్‌ చేయొచ్చు. రిమోట్‌ ద్వారా కూడా గేట్లను సులువుగా ఆపరేట్‌ చేయవచ్చు.

Untitled-2 copy.jpg

హైడ్రాలిక్‌ స్పెషల్‌...

ప్రాజెక్టు గేట్లు అనగానే... విద్యుత్‌ మోటార్లతో ఇనుప గొలుసులతో ఎత్తి, దించే దృశ్యాలే గుర్తుకొస్తాయి. కానీ, పోలవరం అలా కాదు. హైడ్రాలిక్‌ సిలెండర్ల ద్వారా గేట్లను ఎత్తడం, దించడం చేస్తారు. అది కూడా... కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచే ఆపరేట్‌ చేస్తారు. ఒక్కో గేటుకు రెండు హైడ్రాలిక్‌ సిలెండర్లు ఏర్పాటు చేశారు. వీటిని జర్మనీ నుంచి తెప్పించారు. ఒక్కో గేటు బరువు 278 టన్నులు. ఇంత భారీ గేటును హైడ్రాలిక్‌ సిలెండర్లే ఎత్తుతాయి.. దించుతాయి. గేట్లను సుదీర్ఘకాలం ఎత్తి ఉంచాల్సి వస్తే... మ్యాన్యువల్‌గా లాక్‌ చేసే వ్యవస్థనూ ఏర్పాటు చేశారు.


డయాఫ్రమ్‌ వాల్‌ రెండో సారి...

పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు డయాఫ్రమ్‌వాల్‌ ప్రత్యేకం. నదీ గర్భంలో రాతి పొరలు తగిలేదాకా వెళ్లి... అక్కడి నుంచి పైదాకా భూమిలోనే ‘కాంక్రీట్‌’ గోడ కడుతూ రావాలి. పోలవరంలో గరిష్ఠంగా 150 మీటర్ల లోతు వరకు వెళ్లారు. సగటున 50 మీటర్ల లోతు నుంచి డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించారు. ప్రాజెక్టులో కీలకమైన ఈసీఆర్‌ఎ్‌ఫకు ఇది కాంక్రీట్‌ పునాదిలాంటిది. ఇదే లేకపోతే ఈసీఆర్‌ఎఫ్‌ మెల్లమెల్లగా కుంగిపోతుంది. ఇంతటి కీలకమైన డయాఫ్రమ్‌ వాల్‌ను 2019కి ముందే పూర్తి చేశారు. కానీ... గత జగన్‌ సర్కారు నిర్లక్ష్యంతో 2020లో వచ్చిన గోదావరి వరదకు డయాఫ్రమ్‌వాల్‌ దెబ్బతిన్నది. నిపుణుల సూచనల మేరకు మళ్లీ డయాఫ్రమ్‌ వాల్‌ కట్టాల్సి వచ్చింది. డయాఫ్రమ్‌ వాల్‌ పూర్తయితే తప్ప ఈసీఆర్‌ఎఫ్‌ పనులు సాగవు. అందుకే... కూటమి ప్రభుత్వం శరవేగంగా కొత్త డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణం పూర్తి చేసింది.


ఈసీఆర్‌ఎఫ్‌ చకచకా..

రెండో డయాఫ్రమ్‌వాల్‌ ఈ ఏడాది ఏప్రిల్‌కు పూర్తయింది. దీనిపై ప్రస్తుతం ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌(ఈసీఆర్‌ఎఫ్‌) డ్యామ్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ను 53.32 మీటర్ల ఎత్తులో మట్టి, ఇసుక, రాళ్లతో నిర్మిస్తున్నారు. దీనిని రెండు కొండల మధ్య గ్యాప్‌-1, గ్యాప్‌-2గా నిర్మిస్తున్నారు. దీని పొడవు... 1.37 కిలోమీటర్లు. దీనిని వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

Untitled-2 copy.jpg

ప్రకంపనలను తట్టుకునేలా...

డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణంలో ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ ఉపయోగించారు. ప్రకంపనలను తట్టుకునేలా పకడ్బందీగా ఈ నిర్మాణం చేపట్టారు.


ప్రతి దశలో ‘పరీక్ష’

‘సమయంలేదు మిత్రమా! ఏదోలా పనులు చేసి, ప్రాజెక్టును పూర్తి చేశామని అనిపించుకుందాం’... ఇదేమీ చెల్లదిక్కడ! వరద గోదావరిని నిలిపి పట్టి... పద్ధతిగా కాలువలకు మళ్లించే ప్రాజెక్టు ఇది! అందుకే... ప్రతి దశలో నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కాంట్రాక్టు సంస్థతో పాటు సాగునీటి శాఖ ఇంజనీర్లూ ప్రమాణాల ప్రకారం పనులను పరీక్షిస్తున్నారు. చివర్లో... పోలవరం జాతీయ ప్రాజెక్టు కావడంతో కేంద్ర జలసంఘం ప్రతినిధులు రంగంలోకి దిగుతారు. ప్రస్తుతం జరుగుతున్న ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణాన్ని సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్‌ రిసెర్చ్‌ స్టేషన్‌(సీఎస్ఎంఎస్ఆర్‌), విదేశాలకు చెందిన నిపుణుల బృందం వేర్వేరుగా తనిఖీలు చేస్తున్నాయి.

Untitled-2 copy.jpg

జగన్‌ పాలనలో ఇలా...

2019లో జగన్‌ సీఎం అయ్యాక పోలవరం ప్రాజెక్టు పనులు నిలిపేశారు. 2020లో గోదావరి నదికి వచ్చిన 14 లక్షల క్యూసెక్కుల వరదకు డయాఫ్రమ్‌వాల్‌ దెబ్బతింది. 2019-24 మధ్య ఐదేళ్లకాలం ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి పురోగతీ లేదు. నిర్దేశిత లక్ష్యం మేరకు 2020లోనే ప్రాజెక్టు పూర్తయింటే.. 7.20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరందేది. 23.5 లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగేది. ఎడమ, కుడి ప్రధాన కాలువల గుండా గ్రామాలకు తాగు నీరందేది. అదేవిధంగా వేల కోట్ల విలువైన జల విద్యుత్తూ రాష్ట్రానికి అందేది. జగన్‌ సర్కారు నిర్వాకంతో భారీ నష్టం జరిగింది. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాకే పనుల్లో మళ్లీ కదలిక వచ్చింది. కొత్త డయాఫ్రమ్‌వాల్‌ను నిర్మించారు. వచ్చే మార్చినాటికి ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ను పూర్తి చేస్తే.. ప్రాజెక్టులో కాంక్రీట్‌, ఎర్త్‌, రాక్‌తో కూడిన నిర్మాణాలన్నీ పూర్తయినట్లేనని జలవనరుల శాఖ ఇంజనీర్లు చెబుతున్నారు.


రివర్‌ స్లూయిజ్‌లూ...

సాధారణంగా ఇతర ప్రాజెక్టుల్లో స్పిల్‌వే గేట్ల నుంచి లేదా ఒక కెనాల్‌ నుంచి మాత్రమే నీటిని కిందికి వదులుతుంటారు. కానీ... పోలవరంలో ప్రత్యేకంగా పది ‘రివర్‌ స్లూయిజ్‌’ గేట్లు ఏర్పాటు చేశారు. ఇవి... పైకి కనిపించవు. ఈ గేట్లు తెరిచినప్పుడు స్పిల్‌వే గేట్ల కిందుగా గోదావరి ప్రవాహం కిందికి వెళుతుంది. డ్యామ్‌ కనీస నీటి మట్టం నుంచి కూడా ధవళేశ్వరం బ్యారేజీకి నిరంతరంగా 20వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రివర్‌ స్లూయిజ్‌ గేట్లు పూడికను కూడా నివారిస్తాయి.

Untitled-2 copy.jpg

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు

పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఉత్తరాంధ్ర దాకా గోదావరి జలాలను తరలిస్తారు. హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇది వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తవుతుందని ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు. దాని తర్వాత కీలకమైన సొరంగ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. సుమారు కిలోమీటరు పొడవునా 18.5 మీటర్ల చొప్పున వెడల్పు-ఎత్తులో నిర్మిస్తున్న సొరంగం పూర్తిగా తవ్వారు. లైనింగ్‌ పనులు 80 శాతం పూర్తయ్యాయి. ఈ సొరంగం తర్వాత బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ ఉంది. దీనికి మూడు వైపుల కొండ సానువులు ఉన్నాయి. ఒకవైపు మాత్రమే నిర్మించాల్సిన కేఎల్‌ బండ్‌ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి ఆఫ్‌ టేక్‌ రెగ్యులేటర్‌ ద్వారా ఎడమ ప్రధాన కాలువలోకి నీరు ప్రవహిస్తుంది. ఎడమకాలువ ద్వారా 20,000 క్యూసెక్కుల గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలిస్తారు. విశాఖ నగరానికి, ఉక్కు పరిశ్రమలకూ అవసరమైన నీటిని అందిస్తారు.

Untitled-2 copy.jpg


కుడి, ఎడమ ప్రధాన కాలువ పనులు

పోలవరం సాగునీటి ప్రాజెక్టులో అత్యంత కీలకమైన కుడి, ఎడమ ప్రధాన కాలువ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ కాలువల ద్వారా తాగు, సాగు నీటి అవసరాలను తీర్చేందుకు గోదావరి జలాలను నిర్దేశిత లక్ష్యాలకు చేరుస్తారు. కుడి ప్రధాన కాలువలో జంట టన్నెళ్ల పనులు దాదాపు పూర్తయ్యాయి. ఒక్కో టన్నెల్‌ సామర్థ్యం 20,000 క్యూసెక్కులు. ఈ ఏడాది జూలై నాటికి పనులు పూర్తిచేస్తామని అధికారులు చెబుతున్నారు. కుడి ప్రధాన కాలువ కనెక్టివిటీ ద్వారా కృష్ణా నదికి గోదావరి జలాలను తరలిస్తారు. అలాగే పోలవరం-నల్లమలసాగర్‌ అనుసంధాన ప్రక్రియను చేపట్టవచ్చు.

Untitled-2 copy.jpg

హైలెస్సో... హెలెస్సా..

గోదావరి పేరు చెప్పగానే పాపికొండల విహార యాత్ర గుర్తుకొస్తుంది. ప్రస్తుతం యాత్ర ప్రారంభమయ్యే చోటు మారింది. ప్రాజెక్టులో ఎడమ కాలువ పూర్తయిన తర్వాత... ఎంచక్కా ‘నేవిగేషన్‌ కెనాల్‌’ గుండానే పడవ ప్రయాణం సాగుతుంది. ఇందులో కొంత భాగం సొరంగంలోనూ సాగుతుంది. పర్యాటకులకు అద్భుతమైన అనుభూతిని అందించనుంది. ప్రస్తుతం ప్రతిపాదన దశలో ఉంది.

Untitled-2 copy.jpg


శరవేగంగా పోలవరం నిర్మాణం1.2 కిలోమీటర్ల పొడవు...

48 గేట్లతో పోలవరం స్పిల్‌వే నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ప్రాజెక్టులో ఇదే కీలకం. ‘ఫుల్‌ రిజర్వాయర్‌ లెవెల్‌’.. 45.72 మీటర్ల ఎత్తులో 194 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా దీనిని నిర్మించారు. గోదావరి నదికి వరద వచ్చినప్పుడు ఈ స్పిల్‌వే గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

Untitled-2 copy.jpg

Updated Date - May 25 , 2026 | 04:49 AM